సెలబ్‌డబ్ సెలబ్రిటీస్ హార్ట్ బీట్
కమల్ కామరాజ్, సినీనటుడు
గోదావరి, ఆవకాయబిర్యానీ.. వంటి సినిమాల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన యువ నటుడు కమల్ కామరాజ్.. చిత్రకారుడిగా సిటీకి ఎప్పటి నుంచో పరిచితుడు. మహిళలకు తన ఆర్ట్ ద్వారా సంపూర్ణ మద్దతు ప్రకటించే ఈ యంగ్ హార్టిస్ట్.. నిర్భయ సంఘటన తర్వాత 6 నెలలపాటు చెప్పుల్లేకుండా నడిచి.. తన నిరసనను తెలియజేశాడు. అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆయన హృదయ స్పందన ఇది. ..:: ఎస్.సత్యబాబు
మాది మొదటి నుంచీ నాస్తికవాదం. మా తాత ముత్తాతల దగ్గర్నుంచి అదే విధానం. అందుకే నాకు ఆధ్యాత్మిక నమ్మకాలు, కులాలు, కట్టుబాట్లు, ఆచారాల గురించి ఏ మాత్రం అవగాహన లేదు. పైగా మా ఇంట్లో, మా బంధువుల్లో అన్నీ ఇంటర్ రెలిజియస్, ఇంటర్ కాస్ట్, ఇంటర్ కంట్రీ.. మ్యారేజ్‌లే. స్కూల్లో ఎవరైనా నన్ను కులం గురించి అడిగితే అలా ఎందుకు అడుగుతున్నారో అర్థమయ్యేది కాదు. ఇంటికి వచ్చి అమ్మానాన్నని అడిగితే... ‘మానవకులం’ అని చెప్పమన్నారు. నేను బెంగాలీ అమ్మాయిని చేసుకుంటున్నానని తెలిసినప్పుడు బాగా పరిచయస్థులు కూడా అదేదో విచిత్రమైన విషయంగా మాట్లాడారెందుకో.
కట్నమెందుకివ్వాలో...
వయసు పెరుగుతున్న కొద్దీ నాకు ఒక్కోటి తెలిసి వచ్చాయి. వ్యవస్థ సజావుగా నడవడానికి మనిషి చేసుకున్న అనేక ఏర్పాట్లలో కులమత సంప్రదాయాలు కూడా ఒకటి అని అర్థమైంది. అయితే ఆ తర్వాత కూడా నాకు ఎప్పటికీ అర్థం కాకుండా ఉంది ఆడవారి పరిస్థితి. నాతో పాటు ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయిలు కూడా కట్నం అనే విషయం చాలా సాధారణమైనదిగా, తమ పెళ్లి టైమ్‌లో ఎంతెంత కట్నం ఇవ్వాలో ముందే ఆలోచించుకునేవారు.. ఏమైనా అంటే నువ్వు తీసుకోవా అంటూ ఎదురు ప్రశ్నించేవారు.
ఇంత ఆధునిక యుగంలోనూ ఆడవాళ్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే నేను తోడురానా అంటూ ఎవరో ఒకరు అడగడం బాగా ఆవేదన కలిగించే విషయం. ఇక భర్తకు ఏదైనా అయితే భార్య బయటకు రాకుండా కట్టడి చేయడం, ఆమెకు అలంకారాలన్నీ దూరం చేయడం, రకరకాల ఆంక్షలు విధించడం.. ఇవన్నీ చూస్తూంటే సొసైటీ మొత్తం మహిళని ఇంతలా ఎందుకు బంధిస్తోంది? అనే ప్రశ్నలు వచ్చేవి. ఇలాంటి పరిస్థితులేవీ నేను మా ఇంట్లో చూడకపోవడం కూడా నాకు మరీ కొత్తగా అనిపించి ఎక్కువ బాధ కలిగించి ఉండొచ్చు.
చెప్పులు విప్పేశా...
ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన నన్ను బాగా కదిలించింది. ఆ ఆగ్రహం నా పెయింటింగ్‌లో ప్రతిఫలించింది. ఒక చిన్నపాప శరీరాన్ని కుక్కలు పీక్కుతింటుంటే రోడ్డు మీద చూస్తున్న వాళ్లంతా దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నట్టు చాలా తీవ్రమైన చిత్రం నానుంచి వచ్చింది. దీనికి వ్యక్తిగతంగా స్పందించాలని, నిరసన తెలియజేయాలని అనుకున్నా.
అందుకే 6 నెలల పాటు కాళ్లకు చెప్పుల్లేకుండా తిరిగాను. చూసిన వాళ్లంతా ఎందుకలా అంటే ఇది నా నిరసన అంటూ విడమరిచి చెప్పేవాడ్ని. దర్శకులు, నాకు సన్నిహితులు శేఖర్‌కమ్ముల అప్పట్లో ‘ఐ రియాక్ట్ ఐ కేర్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్నా. పలు కాలేజీలు, యూనివర్సిటీలకు తిరిగా.
చిత్రం.. ఆమెకు అంకితం..
అసలు ఆడపిల్లలని చూసే దృక్పథంలోనే మార్పురావాలి. అమ్మాయిలకే అన్ని జాగ్రత్తలు కాదు అమ్మాయిల పట్ల ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అబ్బాయిలకు చెప్పాలి. తాజాగా మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘మిన్ను’ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ కూడా పూర్తిగా మహిళనే కేంద్రంగా తీసుకుని రూపొందించాను. ఆడశిశువు మరణాల నుంచి ఒకవేళ పుట్టి పెరిగాక కూడా తను ఎదుర్కొనే రకరకాల సమస్యల్ని ప్రస్తావిస్తూ పలు చిత్రాలు గీశాను.
మహిళ పట్ల అందరి ఆలోచనల్లోనూ సంపూర్ణ మార్పు రావాలి. అందుకోసం చిత్రాలు గీస్తా.. చెప్పుల్లేకుండా నడుస్తా.. తెలిసిన, వీలైన మార్గాల్లో ఆమె క్షేమానికి నా మద్దతు అందిస్తా. అది కాకుండా నాకు నచ్చే మరో అంశం ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభ కాంతులీనేలా చేయడం. అందుకు ఆర్థిక పరిస్థితి అడ్డుకాకుండా చేసే యత్నాలకు తోడ్పాటు ఉంటుంది. క్యాప్ ఫౌండేషన్ అనే ఎన్జీవో 18 మంది చిన్నారులకు ఆశ్రయమిచ్చి వారిలో ఉన్న ప్రతిభ ఆధారంగా ప్రోత్సహిస్తున్న తీరు నాకు నచ్చింది. అప్పటి నుంచి వారికి నా వంతు సహాయసహకారాలు అందిస్తున్నా.