Cell phone shop
-
పేలిన రెడ్మీ 5ఏ స్మార్ట్‌ఫోన్
శాలిగౌరారం(తుంగతుర్తి) : శాలిగౌరారంలో శనివారం స్మార్ట్‌ఫోన్ పేలింది. యువకుడు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణపాయం తప్పింది. వివరాలు.. శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధిలోని మార్కెట్‌కాలనీకి చెందిన రావుల సురేశ్ అనే యువకుడు నాలుగు నెలల క్రితం నల్లగొండలోని ఓ ప్రముఖ మొబైల్ దుకాణంలో ఎంఐ(రెడ్మీ)–5ఏ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యాహ్నం సెల్‌ఫోన్ అకస్మాత్తుగా స్విచ్ఆఫ్ కావడంతో పాటు ఆ సెల్‌ఫోన్ నుం చి చిన్నపాటి శబ్దం వస్తుండడంతో ఆ సెల్‌ఫోన్‌ను చూపించేందుకని వెంటనే మండలకేంద్రంలోని ఓ సెల్‌ఫోన్ రిపేర్షాపువద్దకు వెళ్లాడు. తనషర్ట్ జేబులో నుంచి ఆ సెల్‌ఫోన్‌ను తీసి షాపులోని టేబుల్‌పై పెడుతుండగానే ఒక్కసారిగా సెల్‌ఫోన్ నుంచి మంటలు వచ్చాయి. గమనించిన సురేశ్‌తో పాటు షాపు నిర్వాహకుడు వెంటనే బయటకు పరుగెత్తుతుండగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో చుట్టుపక్కల షాపుల నిర్వాహకులు ఏమి జరిగిందోనని భయాందోళనకు గురయ్యారు. సురేశ్ ఏ మాత్రం ఆలస్యం చేసినా అతని జేబులోనే ఆ సెల్‌ఫోన్ పేలి ఉండేది. ఒకవేళ అదే జరిగితే సురేశ్ ప్రాణానికే ముప్పు వాటిల్లేది. దీంతో సురేశ్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మండలకేంద్రంలో జరిగిన ఈ సంఘటన గంటల వ్యవధిలోనే ప్రజలకు తెలియడంతో ప్రతి ఒక్కరూ సెల్ఫోన్ల వాడకంపై కొంత ఆందోళనకు గురయ్యారు. -
సెల్‌ఫోన్ షాపులో చోరీ
సాలూరు: పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్‌ఫోన్ షాపులో శనివారం రాత్రి చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శివ సెల్ పాయింట్ వెనుకభాగంలో పైకప్పును పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే ఫోన్లు దొంగిలించకుపోయారు. పట్టణ పోలీసులకు ఆదివారం ఉదయం ఫిర్యాదు అందడంతో ఎస్సై ఫకృద్దీన్, సీఐ ఇలియాజ్ మహ్మద్ పరిశీలించారు. దొంగలను కనిపెట్టేందుకు విజయనగరం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి, వేలిముద్రలు సేకరించారు. ఇదే షాపులో మూడుసార్లు చోరీ ఇదిలా ఉడగా గడిచిన కొద్ది సంవత్సరాలలో ఇదే షాపులో మూడుసార్లు దొంగతనం జరగడం గమనార్హం. షాపు వెనుకభాగం నిర్మానుష్యంగా ఉండడంతో దొంగలు చెలరేగిపోతున్నారు. -
నకిలీవి ఇచ్చి.. అసలు ఐఫోన్లకు ఎసరు
తప్పుడు పత్రాల తో రిప్లేస్ నగరంలోని మొబైల్ షాపులకు ఢిల్లీ ముఠా టోకరా ఇద్దరి పట్టివేత, పరారీలో ఐదుగురు నిందితులు బంజారాహిల్స్: నకిలీ ఐఫోన్లను తప్పుడు ధ్రువపత్రాల సహాయంతో సెల్‌ఫోన్ షాపుల్లో రీప్లేస్ చేస్తూ మోసానికి పాల్పడుతోంది ఢిల్లీకి చెందిన ఓ ముఠా. జూబ్లీహిల్స్ పోలీసులు ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేసి, 20 డూప్లికేట్ ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన ప్రిన్స్ మల్హోత్ర అలియాస్ సోను(22), అమన్ నాగ్‌పాల్ అలియాస్ అర్మాన్ మాలిక్(23), జితిన్ మున్ని, ధ్రువ్, నాకుల్, సత్యంతో పాటు మరో యువకుడు నెలన్నర క్రితం నగరానికి వచ్చి మాదాపూర్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని నకిలీ సెల్ఫోన్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఐఫోన్లకు మక్కీమక్కీ నకిలీవి తయారు చేస్తూ వాటికి పత్రాలు కూడా సృష్టిస్తున్నారు. ఈ పత్రాలను చూపించి వివిధ షాపుల్లో నకిలీ ఫోన్లు రీప్లేస్ చేస్తూ.. కంపెనీ ఫోన్లు కొత్తవి తీసుకుంటున్నారు. వాటిని ఇతరులకు అధిక మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని ఆప్ట్రానిక్స్‌లో ఇటీవల ఓ నకిలీ ఐ ఫోన్‌ను రీప్లేస్ చేస్తూ సోను, అమన్‌నాగ్‌పాల్ దొరికిపోయారు. పోలీసులు వీరిద్దరినీ విచారించగా ఢిల్లీలోని జఫర్‌మార్కెట్ నుంచి వీటిని తీసుకొస్తున్నామని చెప్పారు. వీరి నుంచి 20 నకిలీ ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోను, అమన్‌నాగ్‌పాల్ అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చోరీకి వచ్చి ఇరుక్కుపోయాడు..
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఓ దొంగకు ఓ వింత అనుభవం ఎదురైంది. స్థానిక సెల్‌ఫోన్ షాపులో దొంగతనం చేయడం కోసం చిన్న రంధ్రం ద్వారా షాపులోకి ప్రవేశించాడు. అంతా సర్దుకుని సక్సెస్ అయిందని సంబరపడిన దొంగచివరికి అదే రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మొబైల్ షాపు నిర్వాహకులు శనివారం ఉదయం 10 గంటల సమయంలో షట్టర్ తెరిచేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. షాపు లోపల టేబుల్ కింద దొంగ కూర్చోని ఉండడాన్ని చూశారు. వెంటనే షాపు మూసేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు. షాపు షట్టర్‌కు, పై కప్పుకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలోంచి దొంగ లోపలికి వచ్చాడని తెలుస్తోంది. దొంగ లోపల నుంచి రూ.3 వేల విలువజేసే పరికరాలను బయట ఉన్న తోటి దొంగలకు ఇచ్చాడని పోలీసులు గుర్తించారు. కొసమెరుపు ఏంటంటే దొంగ వయస్సు 10 ఏళ్లు. ఈ బాలుడి వెనుక పెద్ద ముఠా ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, గతంలోనూ ఈ షాపులో ఇలానే మూడు సార్లు దొంగతనాలు జరిగాయని తెలుస్తోంది. షాపు యజమానుల నిర్లక్ష్యం వరుస దొంగతనాలకు ప్రధానం కారణమని పోలీసులు చెప్పుతున్నారు. -
రేకులు తొలగించి సెల్ ఫోన్స్ చోరీ
శ్రీకాళహస్తి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వీఎంసీ సెంటర్ వద్దనున్న శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజైస్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు పడ్డారు. దుకాణంపైనున్న రేకులు తొలగించి షాపులో ఉన్న రూ.87 వేల నగదు, రూ.లక్షా యాభై వేలు విలువ చేసే మొబైల్ ఫోన్లు తస్కరించారు. షాపు యజమాని సుధాకర్ గురువారం ఉదయం షాపు తెరిచి చూసే సరికి పైన రేకులు తొలగించి ఉన్నాయి. షాపులో దొంగలు పడిన విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు.