వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ఓ దొంగకు ఓ వింత అనుభవం ఎదురైంది. స్థానిక సెల్ఫోన్ షాపులో దొంగతనం చేయడం కోసం చిన్న రంధ్రం ద్వారా షాపులోకి ప్రవేశించాడు. అంతా సర్దుకుని సక్సెస్ అయిందని సంబరపడిన దొంగచివరికి అదే రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
మొబైల్ షాపు నిర్వాహకులు శనివారం ఉదయం 10 గంటల సమయంలో షట్టర్ తెరిచేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. షాపు లోపల టేబుల్ కింద దొంగ కూర్చోని ఉండడాన్ని చూశారు. వెంటనే షాపు మూసేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు. షాపు షట్టర్‌కు, పై కప్పుకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలోంచి దొంగ లోపలికి వచ్చాడని తెలుస్తోంది.
దొంగ లోపల నుంచి రూ.3 వేల విలువజేసే పరికరాలను బయట ఉన్న తోటి దొంగలకు ఇచ్చాడని పోలీసులు గుర్తించారు. కొసమెరుపు ఏంటంటే దొంగ వయస్సు 10 ఏళ్లు. ఈ బాలుడి వెనుక పెద్ద ముఠా ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, గతంలోనూ ఈ షాపులో ఇలానే మూడు సార్లు దొంగతనాలు జరిగాయని తెలుస్తోంది. షాపు యజమానుల నిర్లక్ష్యం వరుస దొంగతనాలకు ప్రధానం కారణమని పోలీసులు చెప్పుతున్నారు.