బాలుడితో నేరాలు చేయించిన మారుటి తండ్రి
విజయవాడ : బడికి పంపాల్సిన వయస్సులో బాలుడితో నేరాలు చేయించిన కేసులో మారుటి తండ్రిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 12 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ ఏడీసీపీ షరీన్ బేగం విలేకరులకు వివరాలను వెల్లడించారు. గవర్నర్‌పేట రాజగోపాలాచారి వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని, ఓ మహిళను అదుపులోకి తీసుకుని తమ సిబ్బంది విచారించారని ఆమె తెలిపారు. వారిద్దరు 13 ఏళ్ల బాలుడిని దొంగతనాలకు ప్రేరేపించి నేరాలు చేయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలిందన్నారు. 13 ఏళ్ల బాలుడు భవానీపురం స్టేషన్ ఏరియాలో 4, కొత్తపేట పరిధిలో 2, అజిత్‌సింగ్‌నగర్ ఏరియాలో 1.. మొత్తం 7 చోరీలకు పాల్పడ్డాడని వివరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన తానెం యేసుపాదం కొబ్బరి బొండాల వ్యాపారంతో విజయవాడకు వస్తూ విద్యాధరపురానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పారు. భర్త చనిపోయిన ఆమెను కొద్దికాలానికి వివాహం చేసుకున్నాడన్నారు. ఈ క్రమంలో తన రెండో భార్య కుమారుడు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నట్లు యేసుపాదం గుర్తించినట్లు ఏడీసీ తెలిపారు. బొండాల వ్యాపారంలో నష్టం రావటంతో రెండు కుటుంబాలను పోషించటం ఇబ్బందికరంగా మారిందని, దీంతో యేసుపాదం తన మారుటి కొడుకుతో దొంగతనాలు చేయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కేసు దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు.