cement plant
-
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు థ్యాంక్స్ చెబుతున్న ట్రక్ డ్రైవర్లు.. ఎందుకో తెలుసా!
సిమ్లా: భారత్‌లో ఇటీవల అదానీ గ్రూప్ వెర్సస్ హిండెన్‌బర్గ్ వివాదం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఈ నివేదిక కారణంగా అదానీ ఆస్తులు చూస్తుండగానే కరిపోతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని అస్త్రంగా మార్చుకుని కేంద్రంపై దాడికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్లు హిండెన్‌బర్గ్ నివేదికు ధన్యవాదాలు చెబుతున్నారు. అసలు ఈ రిపోర్ట్ ట్రక్ డ్రైవర్లకు ఏం చేసింది, వారేందుకు థ్యాంక్యు చెప్తున్నారో తెలుసుకుందాం! థ్యాంక్యూ హిండెన్‌బర్గ్ ట్రక్ డ్రైవర్లు సిమెంట్ సరఫరాకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని, ఈ కారణంగా ప్లాంట్ నడపడం లాభదాయకం కాదని అదానీ సంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోని గాగల్, దార్లఘాట్‌లోని అదానీ గ్రూప్‌కు చెందిన రెండు సిమెంట్ ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని సుమారు 7,000 మంది ట్రక్కు యజమానులు, డ్రైవర్లు వారాల తరబడి నిరసన ర్యాలీలను మొదలుపెట్టారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కోసం ట్రక్ డ్రైవర్లకు.. అదానీ గ్రూప్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ‘హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిని తర్వాత అదానీ గ్రూప్‌పై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కుంటున్న ఈ సంస్థ ఇటువంటి సమయంలో తమ ప్లాంట్లను మూసివేస్తే అది తప్పకుండా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి అదానీ ప్రతినిధులు ట్రక్ డ్రైవర్లతో చర్చలు జరిపారు. ఈ సారి సిమెట్ సరఫరాకు వసూలు చేస్తున్న మొత్తంలో 10 నుంచి 12 శాతం తగ్గించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ నిర్ణయంతో ట్రక్ డ్రైవర్లు తమ ఆందోళనను విరమించారు. అంతేకాకుండా సిమెంట్ ప్లాంట్లను మూసివేయాలన్న తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని, ఇకపై అవి యథావిధిగా పనిచేస్తాయని అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ గ్రూప్ వెనక్కి తగ్గిందంటే కారణం.. హిండెన్‌బర్గ్ నివేదిక వల్లేనని భావించిన ట్రక్ డ్రైవర్లు ఈ సందర్భంగా హిండెన్ బర్గ్ థ్యాంక్స్ చెబుతున్నారు. చదవండి 70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ! -
రాష్ట్రంలో మరో భారీ సిమెంట్ ప్లాంటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ సిమెంట్ ప్లాంటు ఏర్పాటు కానుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ప్రఖ్యాత శ్రీ సిమెంట్ కంపెనీ తమ తదుపరి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్‌ను రూ. 2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సిమెంట్ యాజమాన్యం పేర్కొంది. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శ్రీ సిమెంట్ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఉన్న శ్రీ సిమెంట్ కంపెనీ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.4 మిలియన్ టన్నులుగా ఉంది. ఉత్పత్తి సామర్థ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 64 శాతం వినియోగించుకుంది. రూ. 2,500 కోట్ల పెట్టుబడిని అంతర్గతంగా, రుణాల ద్వారా సమీకరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌ను 2024 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ వివరాలన్నింటిని శ్రీ సిమెంట్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలియజేసింది. శ్రీ సిమెంట్ సంస్థ ఎండీ హెచ్ఎం బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్ గతేడాది డిసెంబర్ 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి రాష్ట్రంలో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేశారు. అందులో భాగంగానే భారీ పెట్టుబడితో పెదగార్లపాడులో సిమెంట్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సిమెంట్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. -
ఏపీలో మరో భారీ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ.1,500 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ ప్లాంటు ఏర్పాటుకు శ్రీ సిమెంట్ గ్రూపు ముందుకొచ్చింది. 24 నెలల్లో దీనిని పూర్తిచేసేలా శ్రీ సిమెంట్ గ్రూపు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్లను ఈ గ్రూప్ ఏర్పాటుచేసింది. శ్రీ సిమెంట్ గ్రూపు నుంచి ఏపీలో ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు కానుంది. ఈ నేపథ్యంలో.. సంస్థ ఎండీ హెచ్ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్‌లు సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఏపీలో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ముఖ్యమంత్రి జగన్ శ్రీ సిమెంట్ మేనేజ్మెంట్ టీమ్‌తో చర్చించారు. రాష్ట్రాభివృద్దికి సీఎం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా సంస్థ ఎండీ హెచ్ఎం బంగూర్ స్పందిస్తూ.. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. ఒక కంపెనీ సీఈఓ ఏ రకంగా వ్యవహరిస్తారో అలాగే రాష్ట్ర బాగోగుల కోసం సీఎం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని, రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్దఎత్తున జరగాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. ఇక దేశం కంటే రాష్ట్ర వృద్ధి రేటు అధికంగా ఉందని.. భవిష్యత్తులో ఇది మరింతగా పెరుగుతుందని బంగూర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆలోచనా దృక్పథంతో రాష్ట్రాభివృద్ధి మరింత పురోగమిస్తుందని.. అందువల్లే తామిక్కడ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. సంస్థ జేఎండీ ప్రశాంత్ బంగూర్ మాట్లాడుతూ.. పెద్ద సిమెంటు ప్లాంటు ఏర్పాటువల్ల మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందన్నారు. తద్వారా అనేకమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సర్వీసులను అందించే క్రమంలో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి వేల మందికి లబ్ధి జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, శ్రీ సిమెంట్ ప్రెసిడెంట్ (కమర్షియల్) సంజయ్ మెహతా, జీఎం జీవీఎన్.శ్రీధర్ రాజు, మేనేజర్ వెంకటరమణ, అసిస్టెంట్ మేనేజర్ సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. చదవండి: ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది: కొడాలి నాని -
స్థానికులకు ఉద్యోగాలేవీ?
జేపీ పవర్‌ప్లాంట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు, నిరుద్యోగుల ఆందోళన బూదవాడ (జగ్గయ్యపేట) : గ్రామంలో సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా వేరే రాష్ట్రాల వారికి ఇస్తున్నారని, గ్రామాభివృద్ధికి యాజమాన్యం చొరవ చూపడం లేదని గ్రామస్తులు అధికారుల ముందు వాపోయారు. గ్రామంలోని రామపురం రోడ్డులో జేపీ సిమెంట్స్ ఆధ్వర్యంలో 25మెగావాట్ల బొగ్గు ఆధారిత క్యాప్టీవ్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం (పవర్‌ప్లాంట్) ఏర్పాటుకు గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి ప్రభావతి, విజయవాడ సబ్ కలెక్టర్ హరిచందన, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పివిఎల్జి.శాస్త్రి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గ్రామంలో ఐదు సంవత్సరాల క్రితం జేపీ సిమెంట్స్ ఫ్యాక్టరీ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారని, నిర్మాణం సమయంలో భూములు అమ్మిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని యాజమాన్యం ఇచ్చిన హామీని విస్మరించందన్నారు. ప్రస్తుతం నిర్మాణం చేపట్టే పవర్‌ప్లాంట్ ద్వారా గ్రామానికి ఉచిత విద్యుత్, గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యంతోపాటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలకు, ఉద్యోగులకు జీతాలు పెంచాలని డిమాండ్‌కు యాజమాన్య ప్రతినిధులు స్పందించకపోవడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. గ్రామస్తులు, నిరుద్యోగులు, మహిళలు ఒక్కసారిగా ముందుకు రావడంతోపాటు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు. డీఆర్వో ప్రభావతి మాట్లాడుతూ ప్రజలు చెప్పిన సమస్యలన్నింటినీ లిఖిత పూర్వకంగా నమోదు చేసుకున్నామని, యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ కోరడంతో యాజమాన్యం తర ఫున ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎం.సూరి అభివృద్ధికి కొంత సమయం పడుతుందని, ఏడు గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తున్నామని అందరికీ న్యాయం చేస్తామని చెబుతుండటంతో ప్రజలు కోపోద్రిక్తులై నినాదాలు చేశారు. తహసీల్దార్ వరహాలయ్య, డీటీ భోజరాజు, ఆర్ఐ వెంకటేశ్వరరావు, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, ఫ్యాక్టరీ డెరైక్టర్ నవీన్‌సింగ్, సర్పంచి బాబురావు, ఎంపీటీసీ సభ్యురాలు గడ్డం సైదమ్మ, వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు సామినేని వెంకట కృష్ణప్రసాద్, తెలుగు యువత నాయకులు శ్రీరాం చిన్నబాబు పాల్గొన్నారు.