- జేపీ పవర్‌ప్లాంట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
- గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు, నిరుద్యోగుల ఆందోళన
బూదవాడ (జగ్గయ్యపేట) : గ్రామంలో సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా వేరే రాష్ట్రాల వారికి ఇస్తున్నారని, గ్రామాభివృద్ధికి యాజమాన్యం చొరవ చూపడం లేదని గ్రామస్తులు అధికారుల ముందు వాపోయారు.
గ్రామంలోని రామపురం రోడ్డులో జేపీ సిమెంట్స్ ఆధ్వర్యంలో 25మెగావాట్ల బొగ్గు ఆధారిత క్యాప్టీవ్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం (పవర్‌ప్లాంట్) ఏర్పాటుకు గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి ప్రభావతి, విజయవాడ సబ్ కలెక్టర్ హరిచందన, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పివిఎల్‌జి.శాస్త్రి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గ్రామంలో ఐదు సంవత్సరాల క్రితం జేపీ సిమెంట్స్ ఫ్యాక్టరీ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారని, నిర్మాణం సమయంలో భూములు అమ్మిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని యాజమాన్యం ఇచ్చిన హామీని విస్మరించందన్నారు.
ప్రస్తుతం నిర్మాణం చేపట్టే పవర్‌ప్లాంట్ ద్వారా గ్రామానికి ఉచిత విద్యుత్, గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యంతోపాటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలకు, ఉద్యోగులకు జీతాలు పెంచాలని డిమాండ్‌కు యాజమాన్య ప్రతినిధులు స్పందించకపోవడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. గ్రామస్తులు, నిరుద్యోగులు, మహిళలు ఒక్కసారిగా ముందుకు రావడంతోపాటు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు.
డీఆర్‌వో ప్రభావతి మాట్లాడుతూ ప్రజలు చెప్పిన సమస్యలన్నింటినీ లిఖిత పూర్వకంగా నమోదు చేసుకున్నామని, యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ కోరడంతో యాజమాన్యం తర ఫున ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ ఎస్‌ఎం.సూరి అభివృద్ధికి కొంత సమయం పడుతుందని, ఏడు గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తున్నామని అందరికీ న్యాయం చేస్తామని చెబుతుండటంతో ప్రజలు కోపోద్రిక్తులై నినాదాలు చేశారు.
తహసీల్దార్ వరహాలయ్య, డీటీ భోజరాజు, ఆర్‌ఐ వెంకటేశ్వరరావు, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, ఫ్యాక్టరీ డెరైక్టర్ నవీన్‌సింగ్, సర్పంచి బాబురావు, ఎంపీటీసీ సభ్యురాలు గడ్డం సైదమ్మ, వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు సామినేని వెంకట కృష్ణప్రసాద్, తెలుగు యువత నాయకులు శ్రీరాం చిన్నబాబు పాల్గొన్నారు.