ఏపీలో మరో భారీ ప్రాజెక్టు | Shree Cement Greenfield Plant In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో భారీ ప్రాజెక్టు

Published Mon, Dec 20 2021 6:33 PM | Last Updated on Tue, Dec 21 2021 3:33 AM

Shree Cement Greenfield Plant In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ.1,500 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంటు ఏర్పాటుకు శ్రీ సిమెంట్‌ గ్రూపు ముందుకొచ్చింది. 24 నెలల్లో దీనిని పూర్తిచేసేలా శ్రీ సిమెంట్‌ గ్రూపు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంట్‌ తయారీ, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్లను ఈ గ్రూప్‌ ఏర్పాటుచేసింది. శ్రీ సిమెంట్‌ గ్రూపు నుంచి ఏపీలో ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు కానుంది. ఈ నేపథ్యంలో.. సంస్థ ఎండీ హెచ్‌ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌లు సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఏపీలో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ముఖ్యమంత్రి జగన్‌ శ్రీ సిమెంట్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌తో చర్చించారు.  

రాష్ట్రాభివృద్దికి సీఎం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు
ఈ సందర్భంగా సంస్థ ఎండీ హెచ్‌ఎం బంగూర్‌ స్పందిస్తూ.. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. ఒక కంపెనీ సీఈఓ ఏ రకంగా వ్యవహరిస్తారో అలాగే రాష్ట్ర బాగోగుల కోసం సీఎం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని, రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్దఎత్తున జరగాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.

ఇక దేశం కంటే రాష్ట్ర వృద్ధి రేటు అధికంగా ఉందని.. భవిష్యత్తులో ఇది మరింతగా పెరుగుతుందని బంగూర్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆలోచనా దృక్పథంతో రాష్ట్రాభివృద్ధి మరింత పురోగమిస్తుందని.. అందువల్లే తామిక్కడ ప్లాంట్‌ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. సంస్థ జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌ మాట్లాడుతూ.. పెద్ద సిమెంటు ప్లాంటు ఏర్పాటువల్ల మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందన్నారు. తద్వారా అనేకమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సర్వీసులను అందించే క్రమంలో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి వేల మందికి లబ్ధి జరుగుతుందన్నారు. 

ఈ సమావేశంలో ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, శ్రీ సిమెంట్‌ ప్రెసిడెంట్‌ (కమర్షియల్‌) సంజయ్‌ మెహతా, జీఎం జీవీఎన్‌.శ్రీధర్‌ రాజు, మేనేజర్‌ వెంకటరమణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.  

చదవండి: ఆమె శాపం చంద్రబాబుకి తప్పనిసరిగా తగులుతుంది: కొడాలి నాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement