
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ఎండీ ఉమంగ్ కేజ్రీవాల్, సీఓఓ సురేష్ ఖండేల్వాల్ బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకర వాతావరణం నెలకొందని వారు తెలిపారు. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఉత్పత్తిని విస్తరించే ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించారు.
చదవండి: ఆ విధానాలను అధ్యయనం చేయండి: సీఎం జగన్
గత రెండున్నరేళ్లుగా ఏపీ.. సీఎం జగన్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. స్కూల్స్, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాలు 16 మెడికల్ కాలేజీల నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేయడం సంతోషకరమని తెలిపారు. మొదటి సారి కలిసినా చాలా స్నేహపూర్వకంగా తమ సమావేశం జరిగిందని చక్కటి విజన్‌తో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ప్రతినిధులు పేర్కొన్నారు.