Cement rates
-
దిగొస్తున్న సిమెంట్ ధరలు..
సాక్షి, అమరావతి : చాన్నాళ్లుగా కొండెక్కి కూర్చున్న సిమెంట్, ఐరన్ ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. మధ్యతరగతి, నిర్మాణ రంగాల వారికి ఊరటనిచ్చేలా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇవి పెరగడమే తప్పా తగ్గడం లేదు. దీంతో సొంతంగా ఇళ్లు, భవనాల నిర్మాణం చేపట్టే వారితో పాటు నిర్మాణరంగంలో ఉన్న వారికి వీటి ధరలు పెనుభారంగా పరిణమించాయి. ఫలితంగా నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతూ వచ్చింది. విజయవాడలో దాదాపు ఐదారు నెలల నుంచి 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.350–380ల మధ్య ఉంది. ఇప్పుడది రూ.80 నుంచి 100 వరకు తగ్గింది. బెజవాడ మార్కెట్లో 20కి పైగా కంపెనీలు సిమెంట్ విక్రయాలు జరుపుతున్నాయి. ఒక్కో కంపెనీ మధ్య సిమెంట్ గ్రేడ్‌ను బట్టి బస్తాకు 20–80 వరకు వ్యత్యాసం ఉంటుంది. వారం పది రోజుల నుంచి సిమెంట్ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమయ్యాయి. నెల రోజుల క్రితం వరకు కూడా 50 కిలోల బస్తా ధర రూ.350– 370 మధ్య ఉన్న సిమెంట్ ఇప్పుడు రూ.260–280కు దిగివచ్చింది. అదే సమయంలో ఇనుము «(ఐరన్) ధర కూడా బాగా తగ్గుముఖం పట్టింది. జాతీయ స్థాయిలో ఆర్థికమాంద్యం ప్రభావంతో టన్ను ఇనుము ధర రూ.10 నుంచి 12 వేల వరకు తగ్గింది. రెండు మూడు నెలల క్రితం ఐరన్ టన్ను రూ.50–52 వేల వరకు ఉండేది. కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చి ఇప్పుడు సగటున రూ.38–40 వేల మధ్య లభ్యమవుతోంది. సిమెంట్, స్టీల్ ధరలు గణనీయంగా దిగివస్తున్న నేపథ్యంలో ఆ రంగంలో ఉన్న వర్తకులు సాధ్యమైనంత మేర నిల్వ ఉంచుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత నిర్మాణరంగం మరింత ఊపందుకుంటే లాభపడవచ్చని వీరు యోచిస్తున్నారు. రాష్ట్రంలో నెలకు సగటున ఐరన్ 10 నుంచి 15 మిలియన్ టన్నులు, సిమెంట్ 15–20 మిలియన్ టన్నుల వినియోగం జరుగుతోంది. ఇటుక ధరలూ సరళం.. మరోవైపు సిమెంట్, ఇనుము ధరలతో పాటు ఇటుక ధరలు కూడా దిగివస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు వెయ్యి ఇటుకలు రూ.7 వేలకు విక్రయించే వారు. ఇప్పుడు రూ.5000–5,500కు లభ్యమవుతున్నాయి. ఈ లెక్కన వెయ్యి ఇటుకల వద్ద రూ.1,500–2000 వరకు తగ్గుముఖం పట్టినట్టయింది. త్వరలో ఇసుక కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇలా నిర్మాణ రంగానికి అవసరమైన వీటి ధరలు ఒక్కొక్కటిగా తగ్గుతుండడం నిర్మాణ రంగం వారికి ఊరటనిస్తోంది. ప్రభుత్వం కొత్త విధానం ద్వారా ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తే నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుంటుందని ‘క్రెడాయ్’ విజయవాడ చాంబర్ అధ్యక్షుడు సీహెచ్ సుధాకర్ ‘సాక్షి’కి చెప్పారు. -
సిమెంటు రేట్లు పెరుగుతాయ్!
* బొగ్గు రవాణా చార్జీల పెంపు ప్రభావం * సిమెంటు తయారీదార్ల సంఘం వెల్లడి న్యూఢిల్లీ: రైల్వేలు బొగ్గు రవాణా చార్జీలను పెంచడంతో సిమెంటు రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రవాణా చార్జీల పెంపు కారణంగా సిమెంటు పరిశ్రమపై రూ.2,000 కోట్లకు పైగానే ప్రతికూల ప్రభావం పడుతుందని.. ఈ భారాన్ని వినియోగదారులకే మళ్లించాల్సివస్తుందని వారు అంటున్నారు. బొగ్గు రవాణా టారిఫ్‌లలో రైల్వే శాఖ గత వారం కొన్ని మార్పులు చేసింది. ఎక్కువ దూరం రవాణా టారిఫ్‌లను కొంత తగ్గించి.. తక్కువ దూరానికి సంబంధించిన టారిఫ్‌లను పెంచింది. అంతేకాకుండా 100 కిలోమీటర్లకు మించిన బొగ్గు రవాణాపై లోడింగ్, అన్‌లోడింగ్‌కు టన్నుకు రూ.110 చొప్పున కోల్ టెర్మినల్ సర్‌చార్జీని కూడా విధించింది. ‘రైల్వేల తాజా టారిఫ్ పెంపు వల్ల సిమెంటు పరిశ్రమ ఉత్పాదక వ్యయం పెరిగేందుకు దారి తీస్తుంది. మరోపక్క, విద్యుత్ ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుంది. ఈ రెండింటి కారణంగా పరిశ్రమపై రూ.2,000 కోట్ల భారం ఉంటుందని అంచనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని కంపెనీలు భరించడం కష్టమే. ఫలితంగా సిమెంటు ధరలు పెరిగే అవకాశం ఉంది’ అని సిమెంటు తయారీదార్ల అసోసియేషన్(సీఎంఏ) ప్రెసిడెంట్ శైలేంద్ర చౌక్సీ వ్యాఖ్యానించారు. -
సిమెంటుకు మంచి రోజులు!
తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయికి డిమాండ్ * మార్చిలో 22 లక్షల టన్నుల విక్రయాలు * ఐదేళ్ల కిందట ‘ఉమ్మడి’గా 24 లక్షల టన్నులు * గాడిలో రియల్టీ; ప్రభుత్వ ప్రాజెక్టుల జోరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటుకు సంబంధించి ఐదేళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సానుకూల పరిస్థితి మళ్లీ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమ్మకాలు బాగా పెరగ్గా... మార్చిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్మకాలు ఏకంగా 22 లక్షల టన్నులకు చేరాయి. ఐదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఒక నెలలో అమ్ముడైన 24 లక్షల టన్నుల రికార్డుకు ఇది చేరువలో ఉండటం గమనార్హం. హైదరాబాద్ రియల్టీ తిరిగి గాడిన పడటం... కొత్త ప్రాజెక్టులు మొదలుకావటం దీనికి ప్రధాన కారణంగా కంపెనీలు చెబుతున్నాయి. ఐటీ, ఈ-కామర్స్‌తోపాటు పలు రంగాల్లో ఎంఎన్సీల వస్తున్నాయని, దీంతో నిర్మాణ రంగం పుంజుకోవటమే కాక ఉద్యోగావకాశాలూ మెరుగైనట్లు హెచ్ఆర్ నిపుణులు బి.అపర్ణరెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో వేతనాలు 10-15 శాతం పెరిగాయి. ఇది కూడా రియల్టీకి సానుకూల పరిణామమే. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లు, బలహీన వర్గాలకు గృహాలను నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీ అమలవుతోంది. కొత్త రాజధానిలో నిర్మాణాలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో మండల, జిల్లా కేంద్రాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం జరుగుతోంది. వెరశి సిమెంటు అమ్మకాలు పుంజుకోవడానికి మంచి వాతావరణం ఏర్పడినట్లు కంపెనీలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇలా.. భారత్‌లో సిమెంటు కంపెనీల మొత్తం వార్షిక స్థాపిత సామర్థ్యం 400 మిలియన్ టన్నులు. 2015-16లో 300 మిలియన్ టన్నుల సిమెంటు అమ్ముడైంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంకన్నా ఇది 20 మిలియన్ టన్నులు అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంటు వినియోగం 330 టన్నులకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకు 45-50 లక్షల టన్నులు సిమెంటు అమ్ముడవుతోంది. మార్చిలో ఇది 66 లక్షల టన్నులకు చేరింది. కన్సాలిడేషన్ దిశగా.. దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు ధరల్లో భారీ తేడాలున్నాయి. సిమెంటురకాన్ని బట్టి బస్తా ధర కేరళ మార్కెట్లో రూ.400-420 ఉండగా తమిళనాడులో రూ.370-400, కర్నాటకలో రూ.350-380 ఉంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.270-300 ఉంటే, తెలంగాణలో బస్తా రూ.220-250కి లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధరల్లో తమకు నష్టమేనన్నది కంపెనీల మాట. ఇదే పరిస్థితి కొనసాగితే నాలుగు కంపెనీలు పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్లొచ్చునని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో సిమెంటు ధరలు పెరగడంతో సంబంధిత కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయని ప్రముఖ సిమెంటు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. విజయవంతంగా వైట్ టాపింగ్.. సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌లో (సీఎంఏ) ఉన్న భారతి సిమెంట్, అల్ట్రాటెక్, మహా, సాగర్ సిమెంట్స్ సహా 17 కంపెనీలు ప్రయోగాత్మకంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వైట్ టాపింగ్ టెక్నాలజీతో కాంక్రీటు రోడ్డును విజయవంతంగా వేయటం తెలిసిందే. 30 ఏళ్లకుపైగా మన్నటం వీటి ప్రత్యేకత. ఈ రోడ్లు చెన్నై వరదల్లో చెక్కు చెదరలేదని, బెంగళూరులో 300 కిలోమీటర్ల మేర రూ.900 కోట్ల పెట్టుబడితో మొదలయ్యాయని కంపెనీలు పేర్కొన్నాయి. -
సిమెంటు మరింత ప్రియం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకాలు, రవాణా చార్జీల మోతతో సిమెంటు రేట్లు గణనీయంగా పెరగనున్నాయి. బస్తా ధర రూ. 15-20 మేర పెరగనుంది. టన్ను సిమెంటుపై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 100 మేర పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్లో రవాణా చార్జీలు పెంచడం వల్ల ఇప్పటికే సిమెంట్ తయారీ వ్యయం రూ. 7-10 పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. బొగ్గుపై టన్నుకు రూ.200 చొప్పున హరిత ఇంధన సెస్సు కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నాయి. -
'సిమెంట్ ధరలు తగ్గించకుంటే రాయితీలు వెనక్కే'
హైదరాబాద్: పెంచిన సిమెంట్ ధరలు వెంటనే తగ్గించండి ... లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వెనక్కి తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సిమెంట్ కంపెనీ పారిశ్రామికవేత్తలను హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సిమెంట్ కంపెనీ పారిశ్రామికవేత్తలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్బంగా పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ... పాత రేట్ల ప్రకారమే సిమెంట్ బస్తాలను విక్రయించాలన్నారు. ముడి సరకులు ధరలు తగ్గుతున్నప్పటికీ సిమెంట్ బస్తాల రేట్లు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 4, 5 రోజుల్లో పెంచిన ధరలు తగ్గించాలి.. లేకుంటే చర్యలు తప్పవని పారిశ్రామికవేత్తలకు పల్లె రఘునాథ్‌రెడ్డి సూచించారు. -
పరిశ్రమలకు రేల్వే షాక్...!
చార్జీల పెంపుతో సిమెంటు, ఉక్కు రవాణా భారం సిమెంటు రేట్లు 3% మేర పెరిగే అవకాశం 2.5 శాతం వరకూ పెరగనున్న ఐరన్ ధరలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచాలన్న రైల్వేశాఖ నిర్ణయంతో సిమెంటు, స్టీలు తదితర ఉత్పత్తులు మరింత భారం కానున్నాయి. దాదాపు 40 శాతం సిమెంటు రవాణా రైల్వేల ద్వారానే ఉంటోంది. ఈ నేపథ్యంలో రవాణా చార్జీల పెరుగుదలతో సిమెంటు రేట్లు 3 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీంతో బస్తా ధరపై భారం రూ. 10కి కాస్త అటూ, ఇటూగా ఉండొచ్చని వివరించాయి. ఇక ఇనుము, దుక్కిఇనుము వంటి వాటి రేట్లు కూడా పెరగనున్నాయి. వీటి ధరలు సుమారు 2.5 శాతం దాకా పెరగవచ్చని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్ దక్షిణ ప్రాంత చైర్మన్ వి. రామస్వామి సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ఉక్కు కంపెనీలపై కూడా అంతేశాతం భారం వుండవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్ల పెరుగుదల భారాన్ని కంపెనీలు.. వినియోగదారులకు బదలాయిస్తాయా లేదా ప్రస్తుతానికి అవే భరిస్తాయా అన్నది చూడాల్సి ఉంటుందని పరిశీలకులు పేర్కొన్నారు. ఏటా రూ. 8,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే లక్ష్యంతో రైల్వేస్ అటు రైలు ప్రయాణ చార్జీలను 14.2 శాతం మేర, సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. రియల్టీ రంగానికి దెబ్బ... ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న సిమెంటు, ఉక్కు తదితర ఉత్పత్తుల ధరలు రైల్వే రవాణా చార్జీల పెంపు వల్ల మరింత ఎగిసే అవకాశం ఉందని రియల్టీ దిగ్గజం పార్శ్వనాథ్ డెవలపర్స్ చైర్మన్ ప్రదీప్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఉక్కు, సిమెంటు..రెండూ ప్రధాన ముడి సరుకులని ఆయన చెప్పారు. గడ్డుకాలం ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి రవాణా చార్జీల పెంపు గట్టి ఎదురుదెబ్బగా ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే అమ్ముడుకాని ప్రాజెక్టు యూనిట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో మేం ప్రాపర్టీ రేట్లను పెంచే పరిస్థితి కూడా లేదు’ అని జైన్ పేర్కొన్నారు. కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ రంగానికి కాస్త ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్లు జైన్ తెలిపారు.ఇప్పటికే వృద్ధి మందగమనంలో ఉన్నందున ఉక్కు వంటి భారీ పరిశ్రమలపై రవాణా చార్జీల పెంపు భారాన్ని మోయగలిగే పరిస్థితి లేదని సీఐఐ పేర్కొంది. సరకు రవాణా ద్వారా రైల్వేస్‌కి సుమారు 20 శాతం ఆదాయం ఉక్కు రంగం నుంచే ఉందని, ఇప్పటికే ఈ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని బెనర్జీ పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీ భారం మరో రూ.200 కోట్లు: సరకు రవాణా చార్జీల పెంపుదలతో ఎరువుల సబ్సిడీ భారం ఏటా దాదాపు రూ. 200 కోట్ల మేర పెరగనుంది. అయితే, ఈ ప్రభావం రిటైల్ రేట్లపై ఉండబోదని ఎరువుల సంస్థల సమాఖ్య(ఎఫ్ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీష్ చందర్ తెలిపారు. ప్రతి ఏటా దేశీయంగా 4.4 కోట్ల టన్నుల ఎరువులు రవాణా అవుతుండగా.. ఇందులో 80% రవాణా రైలు మార్గంలోనే ఉంటోంది. మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రూ. 67,970 కోట్ల మొత్తాన్ని ఎరువుల సబ్సిడీగా నిర్ణయించింది. విశాఖ ఉక్కుపై ప్రభావం... సాక్షి,విశాఖపట్నం: రైల్వేశాఖ రవాణా చార్జీలు పెంచడంతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌పై మరింత భారం పడనుంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి నిత్యం లక్షల టన్నుల్లో ముడి ఇనుమును వైజాగ్‌పోర్టు,గంగవరం పోర్టుల నుంచి ప్లాంటు వరకూ సరుకును తీసుకురావడానికి రవాణా చార్జీల రూపంలోనే ఏటా రైల్వేకు కోట్లకు కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు చార్జీలు మరింత పెరగడంతో ఆర్థికంగా మరింత సమస్య ఎదుర్కోనుంది. ఇప్పటికే ముడి ఇనుము విక్రయ ధరలను నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) భారీగా పెంచేసింది. మార్కెట్లో ఉక్కు అమ్మకాలు మందగించి సతమతమవుతోన్న స్టీల్ రంగానికి ఒకపక్క ముడి ఇనుము ధర పెంచడం, మరోపక్క రవాణా చార్జీలు పెంచడంతో ఆర్థిక భారం భరించలేక త్వరలో ఉక్కు ధరలను కూడా పెంచే అవకాశం ఉంది. రైల్వే నిర్ణయం వెలువడిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌తోపాటు అనేక ప్రైవేటు ఉక్కు కంపెనీల యాజమాన్యాలు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆర్థికభారంపై చర్చించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోపక్క ఇక్కడి ఎన్టీపీసీ ప్లాంటుపైనా రవాణా చార్జీల పెంపు భారం పడనుంది. తాల్చేరుతోపాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి ఎన్టీపీసీ 8 లక్షల బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. ద్రవ్యోల్బణం మరింత పైపైకి.. న్యూఢిల్లీ: రైలు ప్రయాణ చార్జీలు, సరకు రవాణా చార్జీల పెంపుదల అనివార్యమే అయినప్పటికీ.. దీని వల్ల ద్రవ్యోల్బణం మరికాస్త పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రవాణా వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని, అయితే దీని వల్ల రైల్వే ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చీఫ్ ఎకానమిస్టు డీకే జోషి చెప్పారు. ఇటీవలే విడుదలైన గణాంకాల ప్రకారం.. టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో ఏకంగా అయిదు నెలల గరిష్టమైన 6.01 శాతం మేర ఎగిసిన సంగతి తెలిసిందే. అటు, ప్రయాణికులపై కొంత భారం పడుతున్నప్పటికీ.. రైలు చార్జీల పెంపు స్వాగతించతగినదేనని ఎర్న్స్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అభయ అగర్వాల్ తెలిపారు. తగినన్ని నిధులు ఉంటేనే రైల్వే శాఖ మెరుగైన సర్వీసులు అందించడం సాధ్యపడుతుందన్నారు. సాహసోపేత నిర్ణయం.. చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం సాహసోపేతంగా వ్యవహరించిందని, సబ్సిడీలను కట్టడి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్న సంకేతాలను ఇది పంపించినట్లయిందని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సీఏసీపీ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ పేర్కొన్నారు. ఇది సర్వీసుల మెరుగుదలకు, ముందుముందు రేట్ల తగ్గుదలకు తోడ్పడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైల్వేస్‌ని ఒడ్డున పడేసేందుకు దిద్దుబాటు చర్యలు అవసరమని, ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. సరకు రవాణా, రైలు చార్జీలను పెంచడమనేది రైల్వేస్ మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడగలవని భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. సురక్షితమైన సర్వీసులు అందించే దిశగా వనరులు సమకూర్చుకోవడానికి ఉపయోగపడగలదని వివరించారు. రైల్వేస్ ప్రాజెక్టుల్లో పాల్గొనేలా బహుళజాతి ఫండింగ్ ఏజెన్సీలను ఆహ్వానించడం, రైల్వే స్థలాలను మెరుగ్గా వినియోగించుకోవడం, రైల్ అసెట్ లీజింగ్ అథారిటీని ఏర్పాటు చేయడం తదితర చర్యల ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఏళ్ల తరబడి పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా రేట్లను పెంచి ఉంటే.. ఇంత భారీగా ఒకేసారి పెంచాల్సిన అవసరం ఉండేది కాదని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా అభిప్రాయపడ్డారు.