సిమెంటుకు మంచి రోజులు! | Good Days to Cement! | Sakshi
Sakshi News home page

సిమెంటుకు మంచి రోజులు!

Published Mon, Apr 18 2016 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

సిమెంటుకు మంచి రోజులు!

సిమెంటుకు మంచి రోజులు!

తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయికి డిమాండ్
* మార్చిలో 22 లక్షల టన్నుల విక్రయాలు
* ఐదేళ్ల కిందట ‘ఉమ్మడి’గా 24 లక్షల టన్నులు
* గాడిలో రియల్టీ; ప్రభుత్వ ప్రాజెక్టుల జోరు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటుకు సంబంధించి ఐదేళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సానుకూల పరిస్థితి మళ్లీ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమ్మకాలు బాగా పెరగ్గా... మార్చిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్మకాలు ఏకంగా 22 లక్షల టన్నులకు చేరాయి. ఐదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఒక నెలలో అమ్ముడైన 24 లక్షల టన్నుల రికార్డుకు ఇది చేరువలో ఉండటం గమనార్హం.

హైదరాబాద్ రియల్టీ తిరిగి గాడిన పడటం... కొత్త ప్రాజెక్టులు మొదలుకావటం దీనికి ప్రధాన కారణంగా కంపెనీలు చెబుతున్నాయి. ఐటీ, ఈ-కామర్స్‌తోపాటు పలు రంగాల్లో ఎంఎన్‌సీల వస్తున్నాయని, దీంతో నిర్మాణ రంగం పుంజుకోవటమే కాక ఉద్యోగావకాశాలూ మెరుగైనట్లు హెచ్‌ఆర్  నిపుణులు బి.అపర్ణరెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో వేతనాలు 10-15 శాతం పెరిగాయి. ఇది కూడా రియల్టీకి సానుకూల పరిణామమే. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లు, బలహీన వర్గాలకు గృహాలను నిర్మిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీ అమలవుతోంది. కొత్త రాజధానిలో నిర్మాణాలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో మండల, జిల్లా కేంద్రాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం జరుగుతోంది. వెరశి సిమెంటు అమ్మకాలు పుంజుకోవడానికి మంచి వాతావరణం ఏర్పడినట్లు కంపెనీలు చెబుతున్నాయి.
 
దేశవ్యాప్తంగా ఇలా..
భారత్‌లో సిమెంటు కంపెనీల మొత్తం వార్షిక స్థాపిత సామర్థ్యం 400 మిలియన్ టన్నులు. 2015-16లో 300 మిలియన్ టన్నుల సిమెంటు అమ్ముడైంది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంకన్నా ఇది 20 మిలియన్ టన్నులు అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంటు వినియోగం 330 టన్నులకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకు 45-50 లక్షల టన్నులు సిమెంటు అమ్ముడవుతోంది. మార్చిలో ఇది 66 లక్షల టన్నులకు చేరింది.
 
కన్సాలిడేషన్ దిశగా..

దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు ధరల్లో భారీ తేడాలున్నాయి. సిమెంటురకాన్ని బట్టి బస్తా ధర కేరళ మార్కెట్లో రూ.400-420 ఉండగా తమిళనాడులో రూ.370-400, కర్నాటకలో రూ.350-380 ఉంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.270-300 ఉంటే, తెలంగాణలో బస్తా రూ.220-250కి లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధరల్లో తమకు నష్టమేనన్నది కంపెనీల మాట. ఇదే పరిస్థితి కొనసాగితే నాలుగు కంపెనీలు పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్లొచ్చునని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో సిమెంటు ధరలు పెరగడంతో సంబంధిత కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయని ప్రముఖ సిమెంటు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
 
విజయవంతంగా వైట్ టాపింగ్..
సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌లో (సీఎంఏ) ఉన్న భారతి సిమెంట్, అల్ట్రాటెక్, మహా, సాగర్ సిమెంట్స్ సహా 17 కంపెనీలు ప్రయోగాత్మకంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వైట్ టాపింగ్ టెక్నాలజీతో కాంక్రీటు రోడ్డును విజయవంతంగా వేయటం తెలిసిందే. 30 ఏళ్లకుపైగా మన్నటం వీటి ప్రత్యేకత. ఈ రోడ్లు చెన్నై వరదల్లో చెక్కు చెదరలేదని, బెంగళూరులో 300 కిలోమీటర్ల మేర రూ.900 కోట్ల పెట్టుబడితో మొదలయ్యాయని కంపెనీలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement