గూగుల్లో సినిమాలను తెగ వెతికేస్తున్నారు!
భారతీయులు గూగుల్ని అత్యధికంగా దేని గురించి అడుగుతున్నారో తెలుసా? మన దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న సినిమాల గురించే. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడే వినియోగదారులు గూగుల్లో వెతుకుతున్న ప్రతి 10 అంశాల్లో ఒకటి సినిమాలకు సంబంధించిన విషయమేనట. అందుకే సినిమా ప్రియులు మరింత సులభంగా వారి అభిమాన చిత్రాలు, తారలు, సంగీతాల గురించి తెలుసుకునేందుకు వీలు కల్పిస్తూ గూగుల్ కొత్త ఆప్షన్లను జోడించనుంది. ఇక నుంచి సినిమాల గురించి వెతికేవారికి సమాధానాలతో పాటు కరోజల్స్ రూపంలో ఆయా ప్రాంతాల్లో సినిమాల సమయాలు, సినిమాల గురించి సంక్షిప్త సమాచారం అందనుంది.
కాగా గూగుల్ సెర్చ్ లో సినిమాలకు సంబంధించిన సమాచారం గురించే వినియోగదారులు అత్యధికంగా వెతుకుతున్నట్లు తెలియడంతో ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గూగుల్ ఇండియా హెడ్ స్వప్నా చడ్డా తెలిపారు. భారతదేశ వినియోగదారుల్లో ఎక్కువమంది సినిమా గురించే అడుగుతున్నట్లుగా గూగుల్ కంపెనీ గమనించినట్లు ఆమె తెలిపారు. అయితే ఎంత శాతమో సంఖ్య సరిగా తెలపని ఆమె... ఇండియాలో పదిమందిలో ఒకరు సినిమాను గురించే శోధిస్తున్నట్లు వివరించారు.
సినిమాతోపాటు క్రికెట్ గురించిన సమాచారాన్ని కూడ భారత వాసులు అధికంగా శోధిస్తున్నట్లు చడ్డా తెలిపారు. భారత్ కు ఉత్పత్తులు అందించడంలో గూగుల్ కు సుదీర్థ చరిత్ర ఉందని, అందుకే లక్షలమంది ఇండియన్ సినిమా అభిమానులకు వారికిష్టమైన సినిమాలు, నటులు, సంగీతం, పాటలు గురించిన సమాచారం అందించి వారికి కావలసిన సంతోషాన్ని అందించాలని గూగుల్ నిర్థారించుకున్నట్లు చడ్డా తెలిపారు.