Censor Cuts
-
రారా సరసకు రారా మూవీకి 62 సెన్సార్ కట్స్!
'రారా సరసకు రారా' చిత్రానికి సెన్సార్ బోర్డు 62 చోట్ల కత్తెరకు పని చెప్పిందని నిర్మాత జయలక్ష్మి తెలిపారు. వేలూరులో చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలోనూ పోలీసులు, ఇన్స్పెక్టర్, కమిషనర్ స్థాయి నుంచి పలు సమస్యలను ఎదుర్కొన్నామని, కాట్పాడి రాజన్ తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు. స్కై వండర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈమె నిర్మించిన చిత్రం రారా సరసకు రారా. ఈ చిత్రానికి కేశవ్ దబర్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 3వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. లేడీస్ హాస్టల్లో ఒక్క రాత్రి జరిగే కథా చిత్రం అని చెప్పారు. నిత్యం పలు సమస్యలతో సతమతమయ్యే ప్రజలు రెండు గంటల పాటు హాయిగా చూసి ఎంజాయ్ చేసే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డు నిబంధనలు 5 ఏళ్లకు ఒకసారి మారాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడో 1952లలో సెన్సార్ విధి విధానాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అన్నారు. తమ చిత్రానికి 62 కట్స్ ఇచ్చారని తెలిపారు. అందుకే తనను 62 కట్స్ చిత్ర దర్శకుడు అంటున్నారని తెలిపారు. రారా సరసకు రారా చిత్రం టైటిల్‌కే అభ్యంతరం తెలిపారని, ఇంతకు ముందు ఎన్నో చిత్రాలకు అభ్యంతరం చెప్పినా సెన్సార్ బోర్డు తమ చిత్రానికి చాలా కట్స్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రివైజింగ్ కమిటీకి వెళ్లినట్లు, నటి గౌతమి సభ్యురాలిగా ఉన్న ఆ కమిటీలోనూ పలుమార్లు చర్చ జరిగిందని చెప్పారు. తాము యు సర్టిఫికెట్ కోరలేదని, వారు ఎన్ని కట్స్ చెప్పినా ఓకే చెప్పడానికి సిద్ధమయ్యామని దర్శకుడు పేర్కొన్నారు. లేడీస్ హాస్టల్లో జరుగుతున్న అనర్థాలను చెప్పడమే తమ చిత్ర ప్రధాన ఉద్దేశం అని దర్శకుడు తెలిపారు. చదవండి: ఐశ్వర్యరాయ్ బర్త్‌డే స్పెషల్.. ఏడువందల కోట్లకు పైగా ఆస్తులు -
సెన్సార్ ఇబ్బందుల్లో ‘రక్తం’
ప్రముఖ దర్శకుడు, జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్‌రివర్ తను రూపొందించిన రక్తం చిత్రానికి సెన్సార్ సభ్యులు తెలిపిన అభ్యంతరాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు ఇంటర్నేషనల్ అవార్డులు, ఐదు నామినేషన్లకు ఎంపికైన ఈ చిత్రంపై సెన్సార్ సభ్యులు తెలిపిన అభ్యంతరాలు సంతృప్తికరంగా లేవని ఆయన అన్నారు. ఎలాంటి అసభ్యత లేకుండా, మానవీయ కోణంలో చిత్రీరించిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు చెప్పిన అభ్యంతరాలు సరైనవి కావు. 2(12) గైడ్ లైన్స్ ప్రకారం కట్స్ ఇచ్చామని రిపోర్ట్ పంపించారు. వాళ్లు సూచించిన గైడ్ లైన్స్ చదవగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇద్దరు విప్లవకారుల మధ్య జరిగే సీరియస్ సంభాషణ అది. వాళ్లు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం సెక్స్‌వల్ గా తప్పుదారి పట్టించేదేంటో నాకు అర్థం కాలేదు. సామాజిక పరివర్తన కోసం రక్తం చిందించడం అవసరమా? అనే సెన్సిబుల్ కథంశంతో సాగే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యలు చెప్పిన అభ్యంతరాలు చిత్ర కథను చిన్నాభిన్నం చేసేలా వున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నామన్నారు. ఈ చిత్రంలో బెనర్జీ, సంజు శివరామ్, మధుశాలినీ, సన, జాన్ కోటోలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. -
ఆ సినిమాకు కట్లు తప్పవు
ముంబై: బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్‌కు 89 కట్లు వేయడాన్ని సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లజ్ నిహలానీ సమర్థించుకున్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. పంజాబ్ ఎన్నికలకు కూడా సంబంధంలేదని చెప్పారు. తాను నియంతలా వ్యవహరిస్తున్నానంటూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నిహలానీ తోసిపుచ్చారు. సినిమా టైటిల్ నుంచి పంజాబ్ అన్న పదాన్ని తొలగించడంతో పాటు చిత్రంలో పంజాబ్, రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించి కట్లు వేయడం సెన్సార్ బోర్డు నిర్ణయమని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్నారు. టైటిల్ నుంచి పంజాబ్ అన్న పదాన్ని ఎందుకు తొలగించామన్నది ఈ సినిమా మొత్తం చూస్తే అర్థమవుతుందని వివరణ ఇచ్చారు. కాగా ఈ సినిమా విషయంలో కొన్ని రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వస్తుండగా, కొందరు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలిచారు.