రైతులు కష్టపడాలని కోరుకుంటున్నారా?
కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ మండిపాటు
► రైతులకు సాయమందకుండా చేసేందుకే సంఘర్షణ సమితులు
► రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వం అందించనున్న ఎకరాకు రూ.8 వేల ఆర్థిక సాయం రైతులకు అందకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్ రైతు సంఘర్షణ సమితులను ఏర్పాటు చేస్తానంటోందని సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ‘టీఆర్ఎస్ పాలన రైతుల పాలిట శాపమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అంటున్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం తీసుకుంటున్న చర్యలు కాంగ్రెస్ పాలిట శాపమవుతున్నాయి’అని పేర్కొన్నారు.
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మండలి విప్ బోడకుంటి వేంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో హరీశ్ మాట్లాడారు. కాంగ్రెస్ నేతల మాటల్లో శాడిజం కనిపిస్తోందని, రైతులను ఆత్మన్యూనతలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. మిషన్ కాకతీయతో 5 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టించామని, కాంగ్రెస్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులు తమ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయని పేర్కొన్నారు.
‘ఉత్తమ్ గుండె మీద చేయి వేసుకుని మాట్లాడాలి. అబద్ధాలు ప్రచారం చేయొద్దు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతల పాలన. అప్పటి కరెంటు సరఫరాకు ఇప్పటి కరెంటు సరఫరాకు ఏమైనా పోలిక ఉందా? పంట దిగుబడిపై కూడా ఆయన అబద్ధాలు చెబుతున్నారు’అని హరీశ్ దుయ్యబట్టారు. అన్ని విషయాలను రైతులు గమనిస్తున్నారని, ఎవరు చెబుతున్నది నిజమో వారే తేలుస్తారని పేర్కొన్నారు. రూ.17 వేల కోట్లు విడుదల చేసి రుణ మాఫీ ప్రక్రియ పూర్తి చేయడం కాంగ్రెస్ నేతలకు కన్పించట్లేదా అని ప్రశ్నించారు. నీలం తుపాను వచ్చినప్పుడు తెలంగాణ జిల్లాలకు ఓ న్యాయం, ఆంధ్రా జిల్లాలకు ఓ న్యాయం అన్నట్లు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవర్తించారని, అప్పుడు మంత్రిగా ఉన్న ఉత్తమ్ ఈ అన్యాయంపై నోరుమెదిపారా అని ప్రశ్నించారు.
అవినీతి అంతానికే..
అవినీతి అంతానికే భూరికార్డుల ప్రక్షాళన చేపడుతున్నామని, తమ పెత్తందారీ పోకడ లు పోతాయనే భయంతోనే కాంగ్రెస్ నేతలు దీన్ని అడ్డుకుంటున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. వారి వైఖరి ఇలానే ఉంటే ఇపుడున్న సీట్లు కూడా దక్కవని హెచ్చరించారు. రైతులు ఇంకా కాంగ్రెస్ పాలనను మర్చిపోలేదని, ఎరువులు, విత్తనాల కోసం వారు పడ్డ కష్టాలు గుర్తున్నాయన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో 2013–14 బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించింది రూ.4,040 కోట్లయితే, తెలంగాణ వాటా రూ.1,697కోట్లని,2017–18 బడ్జెట్లో వ్యవసాయానికి రూ.6,812 కోట్లు తమ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలన్న తేడా లేకుండా సీఎం నిధులు విడుదల చేస్తున్నారని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నియోజకవర్గ అభివృద్ధి నిధిగా రూ.3 కోట్లు ఇవ్వడంలో తామెలాంటి వివక్ష చూపట్లేదని స్పష్టం చేశారు.
పెసర కొనుగోలుకు కేంద్రం అంగీకారం మంత్రి హరీశ్ చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెసర్ల కొను గోలుకు కేంద్రం అంగీకరించింది. రెండు రోజుల కిందట ఢిల్లీలో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. నాఫెడ్ తరఫున రాష్ట్ర మార్క్‌ఫెడ్ సంస్థ సోమవారం పెసర్ల కొనుగోలు ప్రారంభించనుంది. దీనిపై కేంద్ర మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం డైరెక్టర్ శశిభూషణ్, నాఫెడ్ ఎండీ సంజీవ్ కుమార్‌తో హరీశ్‌రావు శుక్రవారం ఫోన్లో మాట్లాడారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని వారిని కోరారు. పెసర్లు క్వింటాలుకు రూ.5,575 మద్దతు ధరగా నిర్ణయించినట్టు శశిభూషణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని తన చాంబర్లో మార్కెటింగ్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో హరీశ్ సమీక్షించారు. 20 నుంచి 25 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. పెసర్లు ఎక్కువగా పండే ప్రాంతాలను గుర్తించి అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.