గూగుల్ స్థానంలో ‘భువన్’
భువన్ మ్యాప్‌ల ఆధారంగా పేదల ఇళ్లకు జియో ట్యాగింగ్
ఆధార్‌తోనూ ఇళ్ల వివరాలను అనుసంధానించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గూగుల్ మ్యాప్‌లకు బదులు దేశీయంగా రూపొందించిన భౌగోళిక సమాచార వ్యవస్థ ‘భువన్’ను ఇకపై విస్తృతంగా వినియోగించాలన్న కేంద్రం నిర్ణయం మేరకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశ భౌగోళిక సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) తయారు చేసిన ‘భువన్’ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో ప్రభుత్వ పథకాలను భువన్ మ్యాపులతో అనుసంధానించే ప్రక్రియ మొదలవుతోంది.
రాష్ట్రంలో పేదల ఇళ్ల వివరాలను ఈ పోర్టల్ ఆధారంగా ‘జియో ట్యాగింగ్’ చేయబోతున్నా రు. ప్రతి ఇల్లు ఉన్న ప్రదేశాన్ని ఆక్షాంశరేఖాంశాల ఆధారంగా గుర్తించి ఈ ప్రక్రియను చేపడతారు. సర్వే నంబర్, లబ్ధిదారుడి ఫొటో, వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఒకసారి లబ్ధిపొందిన వ్యక్తి మరోసారి ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు.
ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సీఐడీ విచారణ జరిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ‘భువన్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించడంతో గూగుల్ సాఫ్ట్‌వేర్‌ను పక్కనబెట్టనున్నారు. ఒక్కో ఇంటి వివరాలను జియో ట్యాగింగ్‌లో నమోదు చేయడానికి రూ. 27 చొప్పున ప్రైవేట్ సంస్థకు చెల్లించాల్సి వస్తుండటంతో.. ఇకపై సొంతంగానే ఈ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజాగా గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సాయంత్రం అధికారులతో సమావేశమై దీనిపై చర్చించారు. జియో ట్యాగింగ్ చేసే ప్రతి ఇంటి వివరాలను ఆధార్ తోనూ అనుసంధానించాలని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను పాత పథకం కిందనే పూర్తి చేయాలని, రెండు పడకగదుల ఇళ్ల పథకాన్ని కొత్త దరఖాస్తులతో ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి సూచించారు. హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన స్వగృహ ఇళ్ల ధరలను తగ్గించాలన్నారు. జవహర్‌నగర్ ప్రాజెక్టులోని ఇళ్లను సీఆర్పీఎఫ్కు కేటాయించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.