నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
హుస్నాబాద్ : హుస్నాబాద్ కేంద్రంగా సాగుతున్న పత్తి విత్తనాల జీరోదందా గుట్టురట్టయింది. రైతుల సమాచారం మేరకు హుస్నాబాద్‌లో వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్ ఆది వారం దాడులు నిర్వహించారు. నాగారంరోడ్లోని శ్రీరామ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో రూ. 1,85,000 విలువైన 199 పత్తి విత్తనాల ప్యాకెట్లను పట్టుకున్నారు.
దొరికిందిలా..
వెన్కెపల్లిలో ఒకరి ఇంట్లో పత్తి విత్తనాలు నిల్వ ఉంచారనే స మాచారం మేరకు వ్యవసాయ అధికారులు అక్కడ దాడులు నిర్వహించారు. అధికారులు 96 ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కూపీలాగగా హుస్నాబాద్‌లోని శ్రీరామసీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు వివరించారు. దీంతో అధికారులు ఈ దుకాణంపై దాడి చేశారు. దుకాణానికి ఎటువంటి లెసైన్సు లేదని, అక్రమంగా పత్తిప్యాకెట్లు నిల్వచేస్తున్నారని, విక్రయిస్తున్నారని ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు.
భారీగా దిగుమతి..
ఈ దుకాణం వ్యాపారి వివిధ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను భారీగా దిగుమతి చేసుకుంటూ రైతాంగానికి తక్కువ ధర కే అంటగడుతున్నారు. బీటీ పత్తి విత్తన ప్యాకెట్ మార్కెట్లో రూ. 930కి దొరుకుతుండగా శ్రీరామసీడ్స్ వారు రూ. 600కే వి క్రయిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు చాంద్నీ, సుజాత, నందినీ తదితర కంపెనీలకు చెందిన 2,500ప్యాకెట్లను దిగుమతి చేసుకుని, 2,300వరకు విక్రయించారని అధికారులు చెప్పారు. శ్రీరామ సీడ్స్ నిర్వాహకుడు ప్రకాశం జిల్లాకు చెందిన బాచన రామాంజనేయులపై కేసు నమోదు చేసి దుకాణాన్ని సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో ఏఈవో పూర్ణచందర్ పాల్గొన్నారు.