రియల్టీ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయరేం!: సుప్రీం
న్యూఢిల్లీ: రియల్టీ రంగానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇందుకు ఎన్నేళ్లు పడుతుందని కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్కే కౌల్‌ను ప్రశ్నించింది. రియల్టీ సంస్థల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఒక నియంత్రణ సంస్థ అవసరమని దాఖలైన ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పీఐఎల్) సోమవారం విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా కౌల్ సమాధానం చెబుతూ, కేంద్రం రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) బిల్లు రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. తదుపరి పరిణామాల గురించి తెలియజేయడానికి న్యాయవాది ఆరు వారాల సమయాన్ని కోరారు. ఇందుకు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏకే శిక్రిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది.