కమీషన్ల కోసమే దుమ్ముగూడెం : వివేక్
ప్రాజెక్టు రద్దుకు వివేక్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ ఆమోదం, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా, ప్రాజెక్టు వివరణాత్మక నివేదిక (డీపీఆర్) అందచేయకుండానే కాంట్రాక్టు కమీషన్ల కోసం దుమ్ముగూడెం ప్రాజెక్టును ప్రకటించారని, దానిని వెంటనే రద్దు చేయాలని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ కమిషన్ల కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో గురువారం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తుందని తెలిసి కూడా సీఎం కిరణ్ కాంట్రాక్టుల రూపంలో దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టును తన సోదరుడికి కట్టబెట్టి, అడ్వాన్సు ఇచ్చి వాపసు తీసుకోవడానికి కిరణ్ చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం గమనించాలన్నారు.
సీమాంధ్ర ప్రజలను సీఎం కిరణ్, వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకోవడం మాని సీమాంధ్రకు రాజధాని ఎక్కడ ఉండాలో? కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు ఎక్కడ ఉండాలో, ఇంకా ఏమేం కావాలో అఖిలపక్ష భేటీలో ప్రతిపాదనలు చేయాలని వారికి సూచించారు. మాజీ ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక చిన్నరాష్ట్రాలు ఇచ్చిన ప్రధాని ఇందిరాగాంధీయే అన్న విషయం సీఎం కిరణ్ తెలుసుకోవాలన్నారు. నాడు పంజాబ్ విభజనను వ్యతిరేకించిన ఆ రాష్ట్ర సీఎంను ఇందిర బర్తరఫ్ చేశారని, నేడు సీఎం కిరణ్‌ను కూడా బర్తరఫ్ చేయించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విభజన పూర్తి చేయాలన్నారు.