తుది కేటాయింపులు ఎన్నిసార్లు?
అఖిల భారత సర్వీసు అధికారుల వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీసిన క్యాట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను ఎన్నిసార్లు తుది కేటాయింపులు చేస్తారని కేంద్రాన్ని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) బుధవారం నిలదీసింది.ఐపీఎస్ కేడర్ తాత్కాలిక కేటాయింపులను సవాలు చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారులు సయ్యద్ అన్వరుల్ హుడా, టీపీ దాస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ సభ్యులు బి.వి.రావు, మిన్నీ మాథ్యూస్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ల తరఫున షఫీకుజ్జమాన్ వాదనలు వినిపిస్తూ.. ఐపీఎస్ కేడర్‌ను కేటాయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసేనాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని తెలిపారు. జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయించాక.. మే 30న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని, దీని ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 31న నోటిఫికేషన్ జారీ చేసిందని వివరించారు.మార్గదర్శకాలు లేకుండానే కేటాయింపులు చేసిందన్నారు.
కేంద్రం తరఫు న్యాయవాది జయప్రకాశ్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే కేంద్రం తుది జాబితా ప్రకటించిందని, అభ్యంతరాల నిమిత్తం జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నిసార్లు తుది కేటాయింపులు జరుపుతారని ప్రశ్నిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.