పసిడి దూకుడుకు ‘యెలెన్’ కళ్లెం!
న్యూయార్క్/ముంబై: అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుందని, రేట్ల పెంపు అనివార్యమని ఈ వారం మొదట్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జానెట్ ఎలెన్ చేసిన ప్రకటనతో గడచిన వారంలో అంతర్జాతీయంగా పసిడి దూకుడుకు కళ్లెం పడింది. ఫిబ్రవరి 10తో ముగిసిన వారం స్థాయి ధర వద్దే ఫిబ్రవరి 17వ తేదీనా బంగారం ధర అంతర్జాతీయంగా నిలకడగా ఉంది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,235 డాలర్ల వద్దే స్థిరంగా ఉంది. అంతక్రితం రెండు వారాల్లో ఇక్కడ ధర భారీగా 45 డాలర్లు పెరగడం గమనార్హం.
డాలర్ బలహీనతలు, గత వారం ఫెడ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రకటన, అమెరికా ఆర్థిక అనిశ్చితి దీనికి దన్నుగా నిలిచాయి. మొత్తంమీద బంగారానికి 1,210 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1,241 డాలర్ల వద్ద తొలి నిరోధం ఉండొచ్చనే సంకేతాలున్నాయి. అయితే మున్ముందు అమెరికా ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, డాలర్‌పై దాని ప్రభావం బంగారం కదలికలకు కారణమవుతుందన్నది నిపుణుల విశ్లేషణ.
దేశీయంగా చూస్తే...
ఇక దేశీయంగా చూస్తే... అంతర్జాతీయంగా ధర పటిష్టంగా ఉండడం బంగారానికి కలిసి వచ్చింది. వారంలో ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.370 పెరిగి రూ.29,565కు చేరింది. ఇక 99.5 స్వచ్ఛత గలిగిన పసిడి విషయంలో ఈ ధర ఇంతే స్థాయిలో ఎగసి రూ.29,415కు చేరింది. కాగా వెండి కేజీ ధర రూ.965 పెరిగి రూ.43,255కు ఎగసింది.