Central Excise Department
-
ఐసెట్‌లో జిల్లా వాసికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఐసెట్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా మాలిపురం గ్రామానికి చెందిన ఇరుకుల సోమశేఖర్ రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించాడు. బుధవారం ప్రకటించిన ఐసెట్ ఫలితాల్లో 200 మార్కులకు గాను 166 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. సోమశేఖర్ ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్గా నిజామబాద్ జిల్లాలో పనిచేస్తున్నాడు. చదువులో ముందంజ.. తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన ఇరుకుల భిక్షపతి, సోమలక్ష్మిల పుత్రుడు సోమశేఖర్ చిన్నతనం నుంచే చదువులో ముందంజలో ఉన్నాడు. 9వ తరగతి వరకు తిరుమలగిరిలోని వివేకానంద విద్యామందిర్, 10వ తరగతి శ్రీవాణి పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ ఖమ్మంలో చదివాడు. 2014లో సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీఏ చేయడానికి ఐసెట్ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. -
సీబీఐ వలలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గోపాల కృష్ణమూర్తి సాక్షి, హైదరాబాద్: సీబీఐ వలలో మరో అవినీతి తిమింగళం పట్టుబడింది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో యాంటీ ఇవాషన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఎస్.గోపాల కృష్ణమూర్తి.. కాటేదాన్‌లోని కేఎం ప్లాస్టిక్ కంపెనీకి అనుకూలంగా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఆ సంస్థ యజమాని జగదీశ్ ప్రసాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన గోపాల కృష్ణమూర్తి బృందం కంపెనీలో తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో అనుకూలంగా రిపొర్ట్ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం రూ.6 లక్షలను గోపాల కృష్ణమూర్తికి జగదీశ్ ఇచ్చాడు. మిగతా రూ.4 లక్షలు మధ్యాహ్నం ఇస్తానని చెప్పాడు. అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ ద్వారా ఈ సమాచారం అందుకున్న సీబీఐ ఇన్స్పెక్టర్ రాందాస్.. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొని రూ.4 లక్షలు ఇస్తున్న సమయంలో గోపాల కృష్ణమూర్తితోపాటు జగదీశ్ప్రసాద్ను అరెస్ట్ చేశారు. గోపాల కృష్ణమూర్తి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు రూ.5.6 లక్షల నగదుతోపాటు కీలకమైన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ డీఐజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు. -
సెంట్రల్ ఎక్సైజ్ శాఖ పాత్ర కీలకం
హైదరాబాద్: సెంట్రల్ ఎక్సైజ్ శాఖ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందని కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు జస్టిస్ డాక్టర్ సతీశ్‌చంద్ర అన్నారు. గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 74వ సెంట్రల్ ఎక్సైజ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సతీశ్‌చంద్ర మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారుల పట్ల అధికారులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచిం చారు. జీఎస్టీ బిల్లును ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, ఆ బిల్లు మంచి ఫలితాలను అందిస్తుందని ఆశిద్దామని అన్నారు. ఒలంపిక్ రజత పతక గ్రహీత పి.వి. సింధు మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు ప్రచారకర్తగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఎంపిక తన భవిష్యత్‌పై మరింత బాధ్యతను పెంచిం దన్నారు. కమిషనర్ సందీప్ ఎం. భట్నాగర్ మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లు రావడంతో అధికారుల్లో ఆందోళనగా ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేసినట్లు తెలిపారు. పన్ను వసూళ్లలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. -
వెయ్యి కోట్లు కట్టాల్సిందేనా?
రాష్ట్ర ఆబ్కారీకి సర్వీస్ ట్యాక్స్ చిక్కులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ శాఖకు సర్వీస్ ట్యాక్స్ విభాగం కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010 నుంచి ఇప్పటి వరకు మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, బాట్లింగ్‌కు సంబంధించి సర్వీస్ ట్యాక్స్ చెల్లించ లేదని నిర్ధారించిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ మూడు రోజుల క్రితం సెర్చ్ వారెంట్లతో రెండు రాష్ట్రాల బేవరేజెస్ కార్పొరేషన్లకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం సరఫరా, డిపోల నిర్వహణ చూసిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచే బకాయిలను వసూలు చేయాలని సర్వీస్ ట్యాక్స్ విభాగం భావించింది. రెండు రాష్ట్రాలకు కలిపి సర్వీస్ ట్యాక్స్ సుమారు రూ.1,000 కోట్ల వరకు ఉన్నట్లు లెక్కలు తేలడంతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎక్సైజ్ శాఖ ద్వారా సర్వీస్ ట్యాక్స్ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిర్దేశిత అంశాలు, ఇప్పటి వరకు వివిధ శాఖల్లో జరిగిన పంపకాల తీరును సర్వీస్టాక్స్ అధికారులకు వివరించడంతో 2010-11 నుంచి 2013-14 వరకు చెల్లించాల్సిన సర్వీస్ ట్యాక్స్‌ను రెండు రాష్ట్రాలకు పంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు జనాభా, మద్యం డిపోల్లో నిర్దేశిత సేవల ఆధారంగా పన్నును విభజించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తదనుగుణంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల విలువను మదింపు చేసిన అధికారులు సోమవారం డిమాండ్ తుది నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎంత మొత్తంలో పన్ను చెల్లించాలో కూడా నోటీసుల్లో పేర్కొని, 30 రోజుల గడువిచ్చే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. -
మున్సిపాల్టీలకు సెంట్రల్ ఎక్సైజ్ షాక్
=సేవాపన్ను చెల్లించాలంటూ నోటీసులు =రూ.9 కోట్లు బకాయిపడిన విజయవాడ కార్పొరేషన్ సాక్షి, విజయవాడ : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాల్టీలపై మరో పిడుగుపడింది. అవి సెంట్రల్ ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సిన సేవాపన్నును ఎప్పటినుంచో ఎగవేస్తున్నాయి. దీన్ని గమనించిన సంబంధిత శాఖ అధికారులు పన్ను చెల్లించని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గుంటూరులో కస్టమ్స్, సెంట్ర ల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ కార్యాలయం ఉంది. దీని పరిధిలోకి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వస్తాయి. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలతోపాటు 30 మున్సిపాల్టీలకు సేవాపన్ను చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. భవనాలను అద్దెకిస్తే పన్ను చెల్లించాలి.. మున్సిపాల్టీలు ఆదాయం కోసం సొంత షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి వ్యాపారులకు అద్దెలకిస్తుంటారు. ఈ విధంగా వచ్చే అద్దెలపై ఆయా మున్సిపాల్టీలు సేవాపన్ను చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్కో మున్సిపాల్టీకి వివిధ భవనాల ద్వారా ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ అద్దెలు వస్తే అవి సేవాపన్ను పరిధిలోకి వస్తాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వస్త్రలత, అరండల్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఐవీ ప్యాలెస్, కేబీఎన్ కాంపెక్స్ తదితర దుకాణ సముదాయాలున్నాయి. వీటి ద్వారా సాలీనా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. వీటిని గుర్తించిన సేవాపన్ను విభాగం అధికారులు రూ.9 కోట్లు చెల్లించాలంటూ కార్పొరేషన్‌కు గత ఏడాది నోటీసులిచ్చారు. అంత బకాయి చెల్లించలేమంటూ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉండగా తాజాగా ఈ ఏడాది రూ.కోటి పన్ను చెల్లించాలంటూ మరో నోటీసు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వస్తే మొత్తం పన్ను బకాయిలు వసూలు చేస్తామని సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. మూలిగే నక్కపై తాటికాయ.. విజయవాడ, గుంటూరు నగరపాలకసంస్థలతోపాటు కోస్తా జిల్లాల్లో ఉన్న అనేక మున్సిపాల్టీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్నిచోట్ల సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం సకాలంలో రాకపోవడంతో ఆయా మున్సిపాల్టీలు ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు, భవనాల నుంచి వచ్చే అద్దెలపైనే ఆధారపడి నెట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సేవాపన్నును వసూలు చేయడమంటే వాటిపై మరింత భారం మోపడమే అవుతుందని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి సేవాపన్ను రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.