=సేవాపన్ను చెల్లించాలంటూ నోటీసులు
=రూ.9 కోట్లు బకాయిపడిన విజయవాడ కార్పొరేషన్
సాక్షి, విజయవాడ : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాల్టీలపై మరో పిడుగుపడింది. అవి సెంట్రల్ ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సిన సేవాపన్నును ఎప్పటినుంచో ఎగవేస్తున్నాయి. దీన్ని గమనించిన సంబంధిత శాఖ అధికారులు పన్ను చెల్లించని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గుంటూరులో కస్టమ్స్, సెంట్ర ల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ కార్యాలయం ఉంది. దీని పరిధిలోకి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వస్తాయి. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలతోపాటు 30 మున్సిపాల్టీలకు సేవాపన్ను చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
భవనాలను అద్దెకిస్తే పన్ను చెల్లించాలి..
మున్సిపాల్టీలు ఆదాయం కోసం సొంత షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి వ్యాపారులకు అద్దెలకిస్తుంటారు. ఈ విధంగా వచ్చే అద్దెలపై ఆయా మున్సిపాల్టీలు సేవాపన్ను చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్కో మున్సిపాల్టీకి వివిధ భవనాల ద్వారా ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ అద్దెలు వస్తే అవి సేవాపన్ను పరిధిలోకి వస్తాయి.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వస్త్రలత, అరండల్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఐవీ ప్యాలెస్, కేబీఎన్ కాంపెక్స్ తదితర దుకాణ సముదాయాలున్నాయి. వీటి ద్వారా సాలీనా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. వీటిని గుర్తించిన సేవాపన్ను విభాగం అధికారులు రూ.9 కోట్లు చెల్లించాలంటూ కార్పొరేషన్‌కు గత ఏడాది నోటీసులిచ్చారు. అంత బకాయి చెల్లించలేమంటూ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉండగా తాజాగా ఈ ఏడాది రూ.కోటి పన్ను చెల్లించాలంటూ మరో నోటీసు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వస్తే మొత్తం పన్ను బకాయిలు వసూలు చేస్తామని సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
మూలిగే నక్కపై తాటికాయ..
విజయవాడ, గుంటూరు నగరపాలకసంస్థలతోపాటు కోస్తా జిల్లాల్లో ఉన్న అనేక మున్సిపాల్టీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్నిచోట్ల సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం సకాలంలో రాకపోవడంతో ఆయా మున్సిపాల్టీలు ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు, భవనాల నుంచి వచ్చే అద్దెలపైనే ఆధారపడి నెట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సేవాపన్నును వసూలు చేయడమంటే వాటిపై మరింత భారం మోపడమే అవుతుందని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి సేవాపన్ను రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మున్సిపాల్టీలకు సెంట్రల్ ఎక్సైజ్ షాక్
Published Tue, Dec 3 2013 12:20 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement