వైద్య సేవలు ప్రైవేటుకు ఇద్దామా!
⇒ రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ప్రజారోగ్యంపై ప్రైవేటురంగం గుత్తాధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో జిల్లా ఆస్పత్రులలోని కొన్ని రకాల వైద్య సేవల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్ ప్రతిపాదనలను రూపొందించాయి. ‘ప్రభుత్వ ఆస్పత్రులలోని కొన్ని వైద్య సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఎలా ఉంటుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, ఇబ్బందుల పరిస్థితేమిటి.
మీ రాష్ట్రంలో ఈ పద్ధతిని అమలు చేసేందుకు అవకాశాలున్నాయో లేదో స్పష్టత ఇవ్వడి’ అని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నీతి ఆయోగ్ జూన్ 5న లేఖలు పంపింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, స్పందన ఆధారంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ ఖర్చు అయ్యే వైద్య సేవలను ప్రైవేటు సంస్థలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంద ని ప్రభుత్వ వైద్య వర్గాలు భావిస్తున్నాయి.
మూడు రకాల సేవలు...
దేశంలోని ప్రభుత్వ వైద్య సేవలపై ప్రపంచ బ్యాంకు సం ప్రదింపులతో కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్లు తాజాగా ఒక నివేదిక రూపొందించాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా ఆస్పత్రులు... ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులలో గుండె, ఊపిరితిత్తులు, కేన్సర్ వైద్య సేవల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన 30 ఏళ్లు లీజు ఉండేలా అప్పగించాలి’ అని లేఖలో నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. కాగా, నీతి ఆయోగ్ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన పంపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.