Central Health Family Welfare Department
-
కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్–19 కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండి కట్టడి చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గత పక్షం రోజుల్లో కేసుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీకి లేఖ ద్వారా పలు సూచనలు చేశారు. పక్షం రోజులుగా రాష్ట్రంలో కొత్తగా పెరుగుతున్న కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 5.7 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతవారం రాష్ట్రంలో పాజిటివ్ రేటు 5.67 శాతం నుంచి 7.34 శాతానికి చేరిందని తెలిపారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు వారం రోజులుగా తగ్గగా, అదే సమయంలో నాలుగు జిల్లాల్లో కేసులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. రానున్న పండుగలు, పర్వదినాల్లో భారీగా ప్రజలు గుమిగూడే అవకాశాలున్నందున ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు మరింత పెంచాలని, ఆర్టీపీసీఆర్తోపాటు యాంటీజెన్ పరీక్షల సంఖ్య రెట్టింపు చేయాలన్నారు. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న జిల్లాలపై దృష్టి పెట్టి వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించి జీనోమ్ సీక్వెన్స్ నిర్వహించాలని, 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ప్రికాషన్ డోసు అందించాలని, ప్రజలు కోవిడ్–19 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసులు పెరుగుతున్న జిల్లాలివే.. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్ జిల్లాల్లో 15 రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. 1.17 శాతం నుంచి 1.61 శాతం వరకు పెరుగుదల నమోదవుతోందని, ఈ మేరకు ఈ జిల్లాల్లో మరింత దృష్టి పెట్టి కేసుల సంఖ్య తగ్గేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మరో 12 జిల్లాల్లో నిర్ధారణ పరీక్షలను పెంచాలని పేర్కొంది. -
కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షలు విధించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. అధికారుల అనుమతి మేరకు, సడలింపు ఇచ్చినప్పుడు మాత్రమే విధుల్లోకి వెళ్లాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ముందు జాగ్రత్త చర్యలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ‘కార్యాలయంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలి. తరచూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక దూరాన్ని పాటించాలి’అని కోరింది. ఇవీ మార్గదర్శకాలు.. ► ప్రభుత్వ కార్యాలయాలు, గదుల్లో క్రిమిసంహారక ప్రొటోకాల్‌ను పాటించాలి. ► సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. ► ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను వాడండి. ► గదుల్లోని అధికారుల మధ్య తగినంత దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. ► క్యాంటీన్లలో గుమిగూడటం మానుకోవాలి. ► కార్యాలయంలోని ఏ ప్రదేశంలోనైనా 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడకూడదు. ► కార్యాలయ సముదాయంలో సందర్శకుల ప్రవేశాలను తగ్గించాలి. సందర్శకుల తాత్కాలిక పాస్‌లను ఇప్పటికే నిలిపివేశాం. ► ఆఫీసర్ అనుమతి ఉన్న సందర్శకులను, వారు కలవాలనుకునే వారిని మాత్రమే సరిగ్గా పరీక్షించిన తరువాతే లోనికి అనుమతించాలి. ► సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే నిర్వహించాలి. ► అధికారిక ఈ–మెయిల్లో అవసరమైన కరస్పాండెన్స్ జరపాలి. ఫైళ్లు, పత్రాలను ఇతర కార్యాలయాలకు పంపించకుండా చూసుకోవాలి. ► అధికారులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ► జ్వరం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. వారిని వెంటనే ఇంటికి పంపించాలి. ► గర్భిణీ ఉద్యోగులు, ఇతరత్రా అనారోగ్యంతో బాధపడుతున్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ► వీళ్లు ప్రజలతో ప్రత్యక్ష సంబంధముండే పనుల్లోకి రాకూడదు. అవసరమైతే హోం క్వారంటైన్‌కు పరిమితం కావాలి. -
ఎయిడ్స్‌కు 4,250 మంది బలి
సాక్షి, హైదరాబాద్: ఎయిడ్స్‌కు తెలంగాణలో అనేకమంది బలవుతున్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ మరణాల్లో మన రాష్ట్రం ఏకంగా నాలుగో స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం 2018–19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో డిసెంబర్ నాటికి 43,019 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. జాతీయస్థాయిలో మరణాల సంఖ్య తగ్గగా, తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2018– 19 ఆర్థిక ఏడాదిలో 2,925 మంది తెలంగాణలో ఎయిడ్స్ కారణంగా చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో గత డిసెంబర్ నాటికే 4,278 మంది చనిపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అంటే గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలోనే ఇంతమంది చనిపోవడం గమనార్హం. మరణాల్లో పెరుగుదల 32%అధికంగా ఉంది. దేశంలో ఎయిడ్స్ కారణంగా మరణించిన వారిలో దాదాపు పదో వంతు ఉండటం గమనార్హం. ఇక 7,778 మరణాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 17.77 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని కేంద్రం తెలిపింది. అందులో తెలంగాణలో 83,861 మంది రోగులున్నారు. సెక్స్ వర్కర్లలో అధికం.. సెక్స్ వర్కర్లలో లైంగిక సంక్రమణ వ్యాధులు 25% ఎక్కువగా ఉన్నాయని తేలింది. తర్వాత వలస కార్మికులు 17%, లింగమార్పిడి 15%, మిశ్రమ సమూహాలు 12%, మిగిలిన ఇతరుల్లో లైంగిక సంక్రమణ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. 25 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారని ఓ అంచనా . ఎయిడ్స్ సోకినట్లు తెలియగానే కొన్నాళ్లపాటు మందులు వాడుతున్నారని, తర్వాత మధ్యలో నిలిపేయడం వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని డాక్టర్ కమల్‌నాథ్ తెలిపారు. -
వైద్యుల రిటైర్మెంట్పై ఏం చేద్దాం?
ఉద్యోగ విరమణ వయసు పెంపుపై తర్జనభర్జన కేంద్ర విన్నపంపై తెలంగాణలో ఎటూతేలని వ్యవహారం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు వైద్యుల విరమణ వయసును పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు కూడా అదే డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసి యేట్ ప్రొఫెసర్లు సహా ఇతర వైద్య అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును 70 ఏళ్ల వరకు పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. వైద్య విద్యకు సంబంధించి వివిధ అంశాలపై కేంద్రం ఇటీవల కాలంలో ప్రతిపాద నలు తయారు చేసింది. వాటిపై అభిప్రాయాలు కోరుతూ రాష్ట్రాలకు ఇప్పటికే లేఖ రాసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల విరమణ వయసు కేవలం 58 ఏళ్లు మాత్రమే ఉంది. నిమ్స్‌లో 60 ఏళ్లుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 62 ఏళ్లు కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విరమణ వయసు 70 ఏళ్లు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైద్య అధ్యాపకుల విరమణ వయసు 58 ఉండటంపై వైద్య వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వైద్యులు, అధ్యాపకుల కొరత... రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 300 వరకు ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా. అలాగే ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు వందల్లో ఖాళీలున్నాయి. ఇటీవల బోధనాసుపత్రుల్లో కొందరికి పదోన్నతులు ఇచ్చినా ఖాళీల భర్తీ మాత్రం జరగలేదు. ప్రభుత్వం ఖాళీల భర్తీపై నిర్ణయం తీసుకున్నా కూడా భర్తీలో ఆలస్యం జరుగుతోంది. దీంతో వైద్యుల కొరత వేధిస్తోంది. 62 ఏళ్లకు పెంచాలని కోరిన ఐఎంఏ... రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఇప్పటికే తెలంగాణ సర్కారుకు విన్నవించింది. విరమణ వయసు పెంచడం వల్ల అనేక మంది యువ డాక్టర్లు ప్రభుత్వ సర్వీసులోకి రావడానికి ఆసక్తి కనబర్చుతారని ఐఎంఏ వివరించింది. కానీ ప్రభుత్వం మాత్రం విరమణ వయసు పెంచడానికి వెనుకా ముందు ఆలోచిస్తోంది. ఇతర ఉద్యోగులు కూడా విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని కోరుతారని, దీనివల్ల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారన్నదే ప్రభుత్వ భయంగా కనిపిస్తోంది.