త్వరలో నిట్ భవనాలు పూర్తి
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌కు సంబంధించి శాశ్వత భవనాలను త్వరలో పూర్తిచేసేందుకు కషిచేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. నిట్ తాత్కాలిక క్యాంపస్, శాశ్వతభవనాల నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. ముందుగా భవన నిర్మాణానికి సంబంధించి నిట్ రెసిడెంట్ కో–ఆర్డినేటర్ టి.రమేష్, అధికారులతో చర్చించారు. తాత్కాలిక తరగతుల నిర్వహణ, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల గురించి మాట్లాడారు. భవనాల నిర్మాణాలకు అవసరమయ్యే నిధులు, మాస్టర్ ప్లాను రూపకల్పన, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక పరిశీలించారు. హాస్టల్ భవనాల నిర్మాణానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కోరారు. వచ్చే జూన్ నాటికి హాస్టల్ భవనాలను పూర్తిచేయాలని సూచించారు. నిధుల విడుదలలో జాప్యం ఉండదని, దానికి అనుగుణంగా వెంటనే టెండరు ప్రక్రియలను ప్రారంభించాలని సూచించారు. శశి ఇంజినీరింగ్ కళాశాలకు దగ్గరలో నిట్ హాస్టల్ భవనాలు నిర్మించే ప్రతిపాదిత స్థలం పరిశీలించారు. భూమి స్థితిగతులు, నీటి లభ్యత తదితరాలపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. నిట్ మెంటర్ డైరెక్టర్ డాక్టర్ చలం, రెసిడెంట్ కో–ఆర్డినేటర్ డాక్టర్ టి.రమేష్, ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ కె.మధుమూర్తి , సీపీడబ్ల్యూడీ అధికారి సీఎన్ సురేష్, వాసవీ ఇంజినీరింగ్ కళాశాల పాలకవర్గ కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.బ్రహ్మయ్య, పరిపాలనాధికారి నారాయణరావు ఆయన వెంట ఉన్నారు.