అనారోగ్యంతో రిమాండ్ ఖైదీ మృతి
రాజమహేంద్రవరం క్రైం:
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో అనారోగ్యంతో ఒక రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అముదాలపల్లి గ్రామానికి చెందిన కట్టా రాజేష్ (38) ఈ ఏడాది జూలై 11వ తేదీన అత్యాచారం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా వచ్చాడు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రాజేష్ శుక్రవారం సాయత్రం అపస్మారక స్థితిలో రిమాండ్ బ్లాక్‌లో పడిఉండగా తోటి ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు హుటాహుటిన జైలుకు చెందిన అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.