Central Jail inmates
-
జైలు జీవితం నుంచి జనజీవనంలోకి..
సాక్షి, రాజమహేంద్రవరం : తప్పు చేశారు. ఆ తప్పులకు శిక్ష కూడా అనుభవించారు. పశ్చాత్తాపంతో జైలు జీవితాన్నీ గడిపిన ఆ ఖైదీలు ఎట్టకేలకు జైలు జీవితం నుంచి విముక్తిపొందారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 12 మంది ఖైదీలు విడుదలయ్యారు. అర్హులైన ఖైదీలకు గత టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించకపోవడంతో కొందరు ఖైదీలు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఖైదీలు విడుదలయ్యారు. ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం జీఓ నంబర్ 6 విడుదల చేస్తూ రాష్ట్రంలో అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు జీవో విడదల చేసింది. దాని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 57 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలున్నారని, వీరు క్షమాభిక్షకు అర్హులని జైలు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం జీవో 46 ప్రకారం కేవలం ఎనిమిది మంది ఖైదీలను మాత్రమే విడుదల చేసింది. ప్రభుత్వ పక్షపాత వైఖరికి అర్హులైన ఖైదీలు హైకోర్టును ఆశ్రయించారు. ఖైదీల పిటిషన్ విచారణ చేసిన కోర్టు అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు వెళ్లిన ఖైదీలు జూలై ఒకటో తేదీన ఒకరు విడుదల కాగా, ఆగస్టు నెలలో 11 మంది, సెప్టెంబర్ ఒకటో తేదీన ఎనిమిది మంది, సెప్టెంబర్ 12న 12 మందిని విడుదలయ్యారు. మరో 17 మంది అర్హులైన ఖైదీలు ఈ వారంలో విడుదలవుతారని సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కె.వెంకట రాజు పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలు వీరే.. చేదల రామిరెడ్డి, కాపర్తి సత్యనారాయణ, నక్కా సత్యనారాయణ, మోర్త నాగేశ్వరావు, గుమ్మడి ఏసు, ఉచ్చుల రాఘవులు, గంటేటి ప్రసాద్, శెట్టి చిన్నయ్య, గంటి నూకరాజు, డేరింగుల సుమంత్, పొలినాటి ప్రేమ్ కుమార్, చెక్కా జోసఫ్. టీడీపీ ప్రభుత్వ తీరుతో నా కుమారుడిని కోల్పోయాను నేను 2010లో హత్య కేసులో శిక్షపడి జైలుకు వచ్చాను. వ్యవసాయం చేసుకుని జీవించేవాడిని, నాకు ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడికి వివాహమైంది. విడుదల కావడం సంతోషంగా ఉంది. కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. ఎదైనా పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాను. నేను విడుదలవుతానని ఆశతో ఎదురు చూసిన నా చిన్న కుమారుడు గణేష్ విడుదల కాకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. – చెక్కా జోసఫ్ గుంటూరు కుటుంబాన్ని చక్కదిద్దాలి నా కుటుంబ ఆస్తితగాదాలో కుమారుడిని కోల్పోయాను. దానికి నేనే కారణమయ్యాను. 2010లో జీవిత ఖైదీ పడింది. కూలి పనులు చేసుకుని జీవించేవాడిని, జీవనోపాధి వెతుక్కొని కుటుంబాన్ని పోషించుకోవాలి. – నక్కా సత్యనారాయణ, రాజోలు -
జైల్లో ఎయిడ్స్ ఖైదీల కేసుపై హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎయిడ్స్ ఖైదీలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27మందికి ఎయిడ్స్ ఉందో, లేదో అధికారులు నిర్థారించాలని హైకోర్టు ఆదేశాలతో జైలు అధికారులలో హైరానా మొదలైంది. హెచ్ఐవీ రోగుల పరిస్థితిపై సీరియస్ అయిన హైకోర్టు 27మందికి రోగ నిర్థారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. ఏడు కొండలు అనే ఖైదీ తాను హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడనని, తనకు బెయిల్ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హైకోర్టుకు విన్నవించుకోవడంతో న్యాయస్థానం ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీలు, రిమాండ్ ఖైదీలు కలిపి మొత్తం 1400మంది ఉన్నారు. 1200మందికి పరిమితి ఉన్న జైలులో అదనంగా 200 మంది ఖైదీలు ఉన్నారు. దీంతో జైలులో ఆస్పత్రి సౌకర్యాలు అంతంత మాత్రమే. జైలులో ముగ్గురు డాక్టర్లు ఉన్నా రాత్రి వేళల్లో ఏ ఒక్క డాక్టరూ అందుబాటులో ఉండటం లేదని ఖైదీలు పేర్కొంటున్నారు. -
సెంట్రల్ జైల్లో ఖైదీలకు టెలిఫోన్
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ :ఖైదీలు తమ బంధువులతో మాట్లాడుకునేందుకు వీలుగా రాజమండ్రి సెంట్రల్‌జైలులో టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎ. నరసింహ బుధవారం టెలిఫోన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఖైదీలు వారానికి రెండుసార్లు తమ బంధువులకు ఫోన్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఐదు నిముషాలకు రూ. 20 చెల్లించాల్సి ఉంటుందన్నారు. బి.పి.ఝా టెలీకం కంపెనీ ఆధ్వర్యంలో రూ. 4 లక్షలతో సెంట్రల్ జైల్లో నాలుగు ఫోన్లు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఫోన్లు బయోమెట్రిక్ పద్ధతిలో ఖైదీలు వేలిద్రల ఆధారంగా పనిచేస్తాయన్నారు. ఒక్కొక్క ఖైదీకి రెండు ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుందని, వారి పేరున ఆ నెంబర్లు నమోదు అయి ఉంటాయని తెలిపారు. ఖైదీల కుటుంబ సభ్యులతో డీఐజీ ఫోన్లో మాట్లాడి ఈ సౌకర్యం కల్పించడం పట్ల వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్న ఖైదీలు: సెంట్రల్ జైల్లో టెలిఫోన్ సౌకర్యం కల్పించడంతో ఖైదీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివలన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకుంటామన్నారు. ఫోన్ సౌకర్యం కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.