సెంట్రల్ జైల్‌లో ఖైదీలకు టెలిఫోన్
Published Thu, Dec 26 2013 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ :ఖైదీలు తమ బంధువులతో మాట్లాడుకునేందుకు వీలుగా రాజమండ్రి సెంట్రల్‌జైలులో టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎ. నరసింహ బుధవారం టెలిఫోన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఖైదీలు వారానికి రెండుసార్లు తమ బంధువులకు ఫోన్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఐదు నిముషాలకు రూ. 20 చెల్లించాల్సి ఉంటుందన్నారు. బి.పి.ఝా టెలీకం కంపెనీ ఆధ్వర్యంలో రూ. 4 లక్షలతో సెంట్రల్ జైల్‌లో నాలుగు ఫోన్లు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఫోన్లు బయోమెట్రిక్ పద్ధతిలో ఖైదీలు వేలిద్రల ఆధారంగా పనిచేస్తాయన్నారు. ఒక్కొక్క ఖైదీకి రెండు ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుందని, వారి పేరున ఆ నెంబర్లు నమోదు అయి ఉంటాయని తెలిపారు. ఖైదీల కుటుంబ సభ్యులతో డీఐజీ ఫోన్‌లో మాట్లాడి ఈ సౌకర్యం కల్పించడం పట్ల వారి స్పందనను అడిగి
తెలుసుకున్నారు.
ఆనందం వ్యక్తం చేస్తున్న ఖైదీలు: సెంట్రల్ జైల్‌లో టెలిఫోన్ సౌకర్యం కల్పించడంతో ఖైదీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివలన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకుంటామన్నారు. ఫోన్ సౌకర్యం కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement