telephone
-
Telangana: మొబైల్ కనెక్షన్లు 100కి 105..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టెలీ సాంద్రత నానాటికీ పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోనే తొమ్మిదో టెలీ సాంద్రత గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ లెక్కల ప్రకారం నవంబర్ 2022 నాటికి తెలంగాణలో మొత్తం 4.08 కోట్ల మంది టెలిఫోన్ వినియోగదారులున్నారు. అందులో 98 శాతం మంది వైర్లెస్ (మొబైల్) వినియోగదారులే. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 2.37 కోట్ల మంది టెలిఫోన్ వినియోగదారులుండగా, అందులో 96 శాతం మంది వైర్లెస్ ఫోన్లు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే 1.70 కోట్ల మంది టెలిఫోన్ వాడుతుంటే అందులో 99.8 శాతం మందివి వైర్లెస్ ఫోన్లే. విశేషమేమిటంటే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే సగటున మొబైల్ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం విశేషం. ఇక, మొబైల్ కనెక్షన్ల విషయంలో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలవగా, దేశంలో 9వ స్థానంలో నిలిచింది. ప్రతి 100 మంది జనాభాకు తెలంగాణలో 105 మొబైల్ కనెక్షన్లుండడం విశేషం. దక్షిణాదిన కేరళ తర్వాత దక్షిణ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెలీ సాంద్రత ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కేరళలో ప్రతి 100 మంది జనాభాకు 120 మొబైల్ ఫోన్లుండగా, తెలంగాణలో 105 మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. తమిళనాడులో 102, కర్ణాటక 97, ఆంధ్రప్రదేశ్‌లో 82 కనెక్షన్లు ఉన్నాయి. ఇక, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా మొబైల్ టెలీ సాంద్రత మనకంటే తక్కువగా ఉంది. మహారాష్ట్రలో ప్రతి 100 మంది జనాభాకు ఉన్న మొబైల్ కనెక్షన్లు 99 మాత్రమే. ఇక దేశంలో అత్యల్ప మొబైల్ సాంద్రత ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (53), జార్ఖండ్ (58), మధ్యప్రదేశ్ (66), ఛత్తీస్‌గఢ్ (67), అసోం (69)లు నిలిచాయి. -
టెలిఫోన్లలో ఎన్ని రకాలో తెలుసా?
తమ యొక్క పరిశోధనలతో మానవ జాతికి మహోపకారం చేసిన మహనీయులలో అలెగ్జాండర్ గ్రాహంబెల్ ఒకరు. టెలిఫోన్‌ను రూపొందించి సమాచార రంగంలో గొప్ప విప్లవానికి గ్రహంబెల్ నాంది పలికారు. ఈయన 1847వ సంవత్సరం మార్చి 3న ఇంగ్లాండులో జన్మించారు. ఇంగ్లాండ్, జర్మనీ దేశాలలో గ్రహంబెల్ విద్యాభ్యాసం జరిగింది. ఒకేసారి అనేక సందేశాలను శబ్దరూపంలో పంపడానికి నిర్విరామంగా కృషి చేశారు. టెలిఫోన్ కనుగొనడమే తన యొక్క జీవిత ఆశయంగా నిర్ణయించుకొని, తన ఆరోగ్యాన్నికూడా లెక్క చేయకుండా పరిశోధనలు జరిపాడు. చివరికి 1876వ సంవత్సరంలో తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడారు. ఈ విధంగా మానవుని జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన ఒక అద్భుతమైన పరికరం రూపొందించబడింది. ఈ పరికరం నేడు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల రూపంలో అనేక విషయాలు, సమాచారాన్ని నిమిషాలలో మనకు అందిస్తోంది. ఇప్పడు అయితే అరచేతిలో పట్టే స్మార్ట్ మొబైల్స్ వచ్చాయి గానీ కిందటి మొబైల్స్ చరిత్ర తెలిస్తే ఒకింత ఆశ్చర్యపోతాం. అలెగ్జాండర్ గ్రాహంబెల్ జయంతి సందర్బంగా వాటి గురుంచి తెలుసుకుందాం. హ్యాండ్ క్రాన్క్ టెలిఫోన్: 1880ల్లో ఈ హ్యాండ్ క్రాంక్ టెలిఫోన్లు వాడేవారు. ఇది చాలా పెద్దగా ఉండటమే కాదు దీనితో కాల్స్ చేయడం కూడా కష్టంగానే ఉండేది. కాండిల్ స్టిక్ టెలిఫోన్: పదేళ్లు తర్వాత 1890లోకి వచ్చేసరికి సౌకర్యవంతమైన ఫోన్ వచ్చింది. ఈ క్యాండిల్ స్టిక్ ఫోన్ అప్పట్లో బాగా ఆదరణ పొందింది. డెస్క్ టాప్ రోటరీ టెలిఫోన్: కొంత కాలం తర్వాత 1920లోకి వచ్చేసరికి అనుకూలమైన డెస్క్‌టాప్ రోటరీ టెలిఫోన్‌ను తయారుచేశారు. పాత సినిమాల్లో ఇది బాగా కనిపిస్తుంది. టచ్ టోన్: డెస్క్ టాప్ రోటరీ ఫోన్ చాలా కాలం నిలబడింది. అయితే, నంబర్ల కోసం మధ్యలోని రింగ్ అదే పనిగా తిప్పడం కష్టమవుతుంటే చాలా పరిశోధనల అనంతరం 1960లో టచ్ టోన్ ఫోన్లను తెచ్చారు. దింతో కాల్ చేయడం తేలికైపోయింది. వాల్ టచ్ టోన్: ఎప్పుడైతే టచ్ టోన్ ఫోన్ వచ్చిందో అది మరో సంచలన ఆవిష్కరణగా మారింది. ఆ తర్వాత పదేళ్లకే అంటే 1970ల్లో గోడకు తగిలించే వాల్ టచ్ టోన్ ఫోన్ వచ్చేసింది. ఇది టెలిఫోన్ రంగాన్ని మరో ముందు అడుగు వేయించింది. కార్డ్‌లెస్ ఫోన్: 1980ల్లో అంటే టెలిఫోన్ కనిపెట్టిన వందేళ్లకు టెలిఫోన్ చరిత్రలో మరో అద్భుత ఆవిష్కరణ వచ్చింది. అదే కార్డ్‌లెస్ ఫోన్. అప్పటివరకూ ఫోన్‌కి కార్డ్(వైర్) తప్పని సరి అయ్యేది. ఇవి వచ్చాక ఇక ఇల్లంతా తిరుగుతూ మాట్లాడే అవకాశం రావడంతో ప్రజలు ఎంతో సంతోష పడ్డారు. మొబైల్ ఫోన్: కార్డ్ లెస్ ఫోన్ వచ్చిన మూడేళ్లకే మొదటి మొబైల్ ఫోన్ 1983లో వచ్చేసింది. ఇక ఆ తర్వాత మొబైల్ ఫోన్ల రూపు రేఖలు చాలా వేగంగా మారిపోతూ వచ్చాయి. స్మార్ట్ మొబైల్స్: గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రాకతో మొబైల్స్‌లో మరో సంచలనంగా మారిపోయింది. ఇప్పడు వాటిలోనూ చాలా మార్పులొస్తున్నాయి. నాలుగైదు కెమెరాలతో రెవల్యూషన్ సృష్టిస్తున్నాయి. -
కాదేదీ గుర్తుకనర్హం!
సాక్షి, సిటీబ్యూరో: కత్తెర, రిఫ్రిజిరేటర్‌తోపాటు ఇస్త్రీ పెట్టె, పెన్‌స్టాండ్, హెడ్‌ఫోన్, బ్రష్, బెలూన్ తదితరాలు స్వతంత్ర అభ్యర్థుల గుర్తులుగా ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లకు కేటాయించిన గుర్తుల్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ప్రకటించారు. వీటిలో కప్ సాసర్, రూమ్ కూలర్, బకెట్, టెలిఫోన్, బ్యాట్స్‌మన్, ప్రెషర్‌కుక్కర్, గ్యాస్ సిలిండర్, ద్రాక్ష, డైమండ్, హెల్మెట్, ట్రాక్టర్ నడుపుతున్న రైతు, సైకిల్పంపు, బ్యాటరీ టార్చ్, బేబివాకర్, ఫ్లూట్, క్యారమ్బోర్డు తదితరమైనవి ఉన్నాయి. -
పన్నెండు దాటింది
మగవాడి మంచితనమైనా, చెడ్డతనమైనా.. మగవాడి మంచితనాన్ని బట్టి, చెడ్డతనాన్ని బట్టి కాకుండా.. ఆడవాళ్లు అనుకోడాన్ని బట్టి ఉంటుంది. రాత్రి పన్నెండు దాటింది. పన్నెండు తర్వాత ఉప్పల్‌కి బస్సులు ఉండవు. పన్నెండుకి లాస్ట్ బస్. లాస్ట్ బస్ ఇంకా రాలేదు కాబట్టి, పన్నెండు దాటిన తర్వాత ఇక అది ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ముందే వెళ్లిపోయిందా అని అనుకోడానికి లేదు. పదకొండున్నర నుంచి అతడు ఆ బస్టాప్‌లో ఉన్నాడు. టెలిఫోన్ భవన్ బస్టాప్ అది. మెహిదీపట్నం డిపో నుంచి వచ్చే ఉప్పల్ బస్సులకు, పంజాగుట్ట మీదుగా వచ్చే ఉప్పల్ బస్సులకు టెలిఫోన్ భవన్ బస్టాప్ జంక్షన్. పంజాగుట్ట మీదుగా వచ్చే ఉప్పల్ బస్సుల టైమ్ పన్నెండుకు ముందే అయిపోతుంది కనుక ఇక రావలసింది మెహదీపట్నం నుంచి వచ్చే ఉప్పల్ బస్సే అనుకున్నా.. పంజాగుట్ట నుంచి వచ్చే ఆఖరి బస్సూ లేటయితే.. రెండు బస్సులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బస్టాప్‌లో మొదట అతడొక్కడే ఉన్నాడు కానీ, తర్వాత.. ఆమె కూడా వచ్చి అతడికి కాస్త దూరంలో నిలబడింది. పదకొండున్నర నుంచి అతడు అక్కడ ఉంటే.. పావు తక్కువ పన్నెండు నుంచి ఆమె అక్కడ ఉంది. ఇద్దరే ఉన్నారు బస్టాప్‌లో. ఎవరూ ఎవరితో మాట్లాడుకోవడం లేదు. సెల్ఫోన్లో టైమ్ చూసుకుంటూ.. బస్సు వచ్చే దారి వైపు చూస్తూ నిలుచున్నారు. బస్టాప్‌లో రిన్నోవేషన్ ఏదో జరుగుతున్నట్లుంది. అంతా తవ్వేశారు. పోల్స్‌కి ఉండవలసిన లైట్స్ కూడా లేవు. కాస్త దూరంలో ట్రాఫిక్ ఐలండ్‌లో ఉన్న స్ట్రీట్ లైట్ నుంచి ఇక్కడికి మసగ్గా వెలుతురు పడుతోంది. ఆ మసక వెలుతురులోనే ఆమె అందంగా ఉండడం గమనించాడు అతడు. అందంగా కాదు. చాలా అందంగా! ఆ ‘చాలా అందం’ బహుశా ఆమె జుట్టుది కావచ్చు. లేదా ఆ మెడ! లేదంటే.. ఆమెలో ఇంకేదో.. చూడబుద్ధయ్యేలా ఉన్న చోటు. ఎంతోసేపు బస్సుకోసమే చూడలేడు కాబట్టి అప్పుడప్పుడు ఆమెవైపు కూడా చూస్తున్నాడు అతడు. భుజానికి హ్యాండ్ బ్యాగ్ ఉంది. చేతిలో క్యారీ బ్యాగ్ ఉంది. ఇన్ని బ్యాగులతో ఆడవాళ్లకు ఎన్ని పనులో అనుకున్నాడు అతడు. అలా అనుకోడానికి ముందు.. ఇంత రాత్రివరకు ఆమె తన పని ఎందుకు తెముల్చుకోలేక పోయిందో అనుకున్నాడు. తనొక్కటే ఉన్నందుకు భయపడుతోందేమోనని ఆమెక్కొంచెం ధైర్యం ఇవ్వాలని అతడికి అనిపించింది. ధైర్యం ఇవ్వడం అంటే.. తను చెడ్డవాడిని కాదన్న భావన ఆమెకు కల్పించడం. అంతకన్నా కూడా.. అంతసేపటిగా ఒక ఆడ, ఒక మగ.. ఎంత అపరిచితులైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండడంలోని అసహజత్వం అతడిని ఇబ్బంది పెడుతోంది. ఆ ఇబ్బందిని పోగొట్టుకోడానికైనా అతడు ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ‘‘మీరూ ఉప్పలేనా?’’ అన్నాడు. ఆమె చికాగ్గా చూసింది. అతడు కొంచెం హర్ట్ అయ్యాడు. ఆడవాళ్లు వాళ్లకైవాళ్లు మంచి అనుకుంటే తప్ప మగవాళ్ల మంచితనాన్ని ఆమోదించరని జీవితంలో అనేకసార్లు అతడికి అనుభవమైంది. మగవాడి మంచితనమైనా, చెడ్డతనమైనా.. మగవాడి మంచితనాన్ని బట్టి, చెడ్డతనాన్ని బట్టి కాకుండా.. ఆడవాళ్లు అనుకోడాన్ని బట్టి ఉంటుంది. ‘‘వేరేలా అనుకోకండి. మీరూ ఉప్పలేనా అని అడగడంలో నా ఉద్దేశం.. నేనూ ఉప్పలే అని చెప్పడం కాదు. నేనూ మీలా మనిషినే అని మీరు అర్థం చేసుకోవాలని అలా అడిగాను. ఎందుకంటే.. ఈ చీకటి రాత్రి, ఈ ఒంటరి రాత్రి నేను మీకు మనిషిలా కాకుండా మరోలా కనిపిస్తున్నానేమోనని నాకు అనిపిస్తోంది’’ అన్నాడు అతడు. అతడివైపు చిత్రంగా చూసింది ఆమె. చూసిందే కానీ అతడితో మాట్లాడలేదు. మళ్లీ బస్సు వచ్చే దారి వైపు చూసింది. బస్సు వస్తూ కనిపించలేదు. ‘‘ఏమైందీ దెయ్యం బస్సుకు?!’’ అన్నాడతడు ఆమెకు సానుభూతిగా. ఆ మాటకు మళ్లీ అతడివైపు ఆమె చికాగ్గా చూసింది. ‘‘సారీ..’’ అన్నాడు అతడు. ‘ఎందుకు సారీ..’ అన్నట్లు చూసింది ఆమె. ‘‘బస్సులు దెయ్యాలు ఎందుకవుతాయి? వేళ తప్పి బస్సుల కోసం చూసే మనమే దెయ్యాలం’’ అన్నాడు అతడు. ఫక్కున నవ్వింది ఆమె. ‘‘హమ్మయ్య.. నవ్వారు’’ అన్నాడు అతడు. ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నారు. ‘‘మీరూ ఉప్పలేనా?’’ మళ్లీ అడిగాడు అతడు. ‘‘ఎందుకనుకుంటున్నారు.. నేనూ ఉప్పలేనని?’’ అంది ఆమె. అతడు నవ్వాడు. ‘‘ఈవేళప్పుడు ఈ స్టాప్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే బస్సులు, కోఠి వెళ్లే బస్సులు ఉండవు. అందుకే ఉప్పలేనా అని అడిగాను’’ అన్నాడు. ఆమె నవ్వింది. ‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ అడిగాడు. ‘‘ఉప్పల్ బస్సు ఎక్కితే ఉప్పలే వెళ్తారా? మధ్యలో పది స్టాపులు ఉంటాయి. ఏ స్టాపులోనైనా దిగొచ్చు కదా నేను. నారాయణగూడనో, బర్కత్పురానో, రామంతపూరో..’’ అంది ఆమె. అతడు నవ్వాడు. ‘‘సో.. నేను మిమ్మల్ని అడగవలసిన ప్రశ్న.. ‘మీరూ ఉప్పల్ బస్ కోసమేనా?’ అనే కదా’’ అన్నాడు. ఆమె మళ్లీ నవ్వింది.అతడికి సంతోషంగా ఉంది. అక్కడ తామిద్దరే ఉండడం అతడికి బాగుంది. తెల్లారే వరకు బస్సు రాకపోతే బాగుండనుకున్నాడు. అయితే అలా అనుకోగానే.. ఇలా వస్తూ కనిపించింది ఉప్పల్ వెళ్లే బస్సు! పావు తక్కువ ఒంటిగంటకు. ‘‘వచ్చేసింది’’ అన్నాడు అతడు ఆమెవైపు తిరిగి. అయితే ఆమె అక్కడ లేదు. బస్సు ఎక్కుతూ కనిపించింది! అరె.. అంత వేగంగా ఎప్పుడు వెళ్లిపోయింది అనుకున్నాడు అతడు. అతడు ఎక్కేలోపే బస్సు కదలిపోయింది! తనొక్కడే ఉసూరుమంటూ బస్టాప్‌లో ఉండిపోయాడు. కనీసం నేనొకణ్ని బస్టాప్‌లో ఉన్నానని డ్రైవర్‌కి చెప్పి ఆపించలేకపోయింది అనుకున్నాడు అతడు. వెంటనే అతడికి ఇంకో ఆలోచన కూడా వచ్చింది. బస్సులో తనొక్కటే లేదు కదా.. అని. ఎస్.. తనొక్కటే ఉన్నట్లుంది. బస్సు ఆగినప్పుడు చూశాడు. డ్రైవర్, కండక్టర్ తప్ప లోపల ఎవరూ లేరు. బస్సు ఫెయిలైందని, రూటు మళ్లించి, ఏ మూలో ఆపి, ఆమెను వాళ్లు ఏమైనా చేస్తే? పైగా అందంగా ఉంది. ఒంటరిగా ఉంది. బస్టాపులో తన ఒంటరితనం మర్చిపోయి, బస్సులో ఆమె ఒంటరితనం గురించి ఆలోచిస్తున్నాడు అతడు. పది నిముషాల తర్వాత ఇంకో బస్సు వచ్చింది! ఉప్పల్ బస్సు. పరుగున వెళ్లి ఎక్కేశాడు. అందులో కూడా డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. వెనక్కు వెళ్లి కూర్చున్నాడు. బస్సు వేగంగా వెళుతోంటే కిటికీలోంచి రయ్యిన చల్లటి గాలి ముఖానికి తగులుతోంది. కళ్లు మూసుకున్నాడు. అతడు కళ్లు మూసుకున్నాడే కానీ, మళ్లీ వెంటనే కళ్లు తెరిచాడు. అప్పటికింకా బస్సు తర్వాతి స్టాపుకు కూడా చేరుకోలేదు. ఎవరూ లేని బస్సులో.. తన సీటు వెనుక సీట్లో ఎవరో ఉన్నట్లనిపించి వెనక్కు తిరిగి చూశాడు. ఆమె!!!అతడి గొంతు కండరాలు భయంతో బిగుసుకుపోయాయి. ‘‘ముందెక్కిన బస్సు ఫెయిలయింది. అందుకే ఈ బస్సెక్కాను’’ అంది.. నోటి దగ్గర రక్తాన్ని నాలుకతో చప్పరిస్తూ. వెంటనే లేచి ముందు సీట్లలోకి వెళ్లిపోతే ఏం గొడవోనని... ప్రాణాల్ని బిగబట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు అతడు. - మాధవ్ శింగరాజు -
టెలిఫోన్ లేని ప్రపంచం ఊహిద్దామా?
మానవచరిత్రలో మార్చి 10, 1876 ఒక మైలురాయి. ఆరోజు అలెగ్జాండర్ గ్రాహంబెల్ తాను రూపొందించిన టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తొలి మాటలు కమ్ హియర్ వాట్సాన్, ఐ వాంట్ యూ!. యూరోపియిన్ కమిషన్ అంచనాల ప్రకారం మానవ ఉపాధి అవకాశాల్లో 60 శాతం వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టెలిఫోన్ల రంగంపై ఆధారపడి ఉంది. ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ 2006 సంవత్సరానికి ప్రమోటింగ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీని లక్ష్యంగా ఎంచుకున్నది. గ్లోబల్ టెలి కమ్యూనికేషన్ల వ్యవస్థ సుమారు 220 దేశాల్లో నిరాటంకంగా పనిచేస్తోంది. ఇప్పుడు భూమి మీదే కాకుండా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా సముద్రం లోపల కూడా విస్తరించింది. టెలిగ్రాఫ్, టెలెక్స్ టెలిఫోన్, టెలివిజన్ మొదలైన ప్రత్యేక వ్యవస్థలు ప్రత్యేక కేబుల్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఒకప్పుడు తీగెల ఆధారంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేసేది. నేడు వైర్లెస్, సెల్‌ఫోన్ వ్యవస్థగా అభివృద్ధి చెందింది. నేడు సెల్‌ఫోన్ లేని వ్యక్తి లేడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నవారితో క్షణాల్లో సెల్ఫోన్లో మాట్లాడటం, ఛాటింగులు చేయడం, వీడియో కాల్ చేయడం, వీడియోలు పంపడం సులభతరంగా మారాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం అన్ని రకాల సెల్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. కొండలు, గుట్టలపైన కూడా సెల్ఫోన్లు పనిచేస్తున్నాయి. సెల్ఫోన్ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవసరం మేరకే ఫోన్లను వాడితే మంచిది. అనవసర కబుర్లను ఫోన్లో కాకుండా నేరుగా మాట్లాడుకోవడమే మేలు. (నేడు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల దినోత్సవం సందర్భంగా) -కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -
రూ.149కే ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్
విజయవాడ: హీరో మోటార్స్ కు 600 ఎకరాలు (ఎకరా లక్ష చొప్పున), యాక్సిలరీ యూనిట్స్‌కు 200 ఎకరాలు(ఎకరా 10 లక్షల చొప్పున) కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోమవారం విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.3,200 కోట్ల పెట్టుబడితో, ప్రత్యక్షంగా 10వేలు, పరోక్షంగా మరో 10వేలు ఉద్యోగాల కల్పించనున్నారు. ఇది పూర్తయితే సౌత్ ఇండియాలో హీరో మోటార్స్ పరిశ్రమ ఇదే ప్రథమం. మరోపక్క, అర్జున అవార్డు గ్రహీత, పోలీస్ బాక్సింగ్ కోచ్ శ్రీశీ రాజయరాం కు విశాఖలో ఎండాడ గ్రామంలో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నారు. రెవెన్యూ గెస్ట్ హౌస్ నిర్మాణానికి నర్సీపట్నంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారికి 10సెంట్లు స్థలం(చ.గ రూ.1000 చొప్పున) అనంతపురం జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్టుల స్థాపనకు (ఎ) పుట్లూరు మండలంలో మాదుగుపల్లి, ఎల్లుట్ల గ్రామాలలో 9.88 ఎకరాలు (బి) తాడిమర్రి మండలంలోని చిల్లవారి పల్లి గ్రామంలో 11.42 ఎకరాలు (సి) నార్పాల మండలంలో నార్పాల మరియు గూగుడు గ్రామాలలో 77.28 ఎకరాలు మొత్తం 98.58 ఎకరాలు అనంత సాగర్ నాన్ రెన్వూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ మరియు అనంత సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి సంయుక్తంగా 25 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నిర్మించడానికి దక్షణ మధ్య రైల్వే వారికి 16.45 ఎకరాల భూమి ఉచితంగా కేటాయించాలని నిర్ణయించారు. పీపీపీ పద్ధతిలో ట్రిపుల్ ఐటి స్థాపించడానికి చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని మల్లవారి పాలెం గ్రామంలో 35.09 ఎకరాలను కమిషనర్ సాంకేతిక విద్య వారికి ఉచితంగా కేటాయించనున్నారు. ఇ-ప్రగతిలో ఒరాకిల్ కస్టమర్ హబ్ ప్రోడక్ట్, వారి కన్సల్టెన్స్ సర్వీసులను ఉపయోగించుకుని పీపుల్ హబ్ డేటాను తయారుచేయాలని నిర్ణయించారు. దీనివల్ల రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలకు సంబందించిన పూర్తి డేటా, ఇండివిడ్యువల్ బెనిఫిట్స్, రేషన్ కార్డుల వివరాలు తెలుస్తాయి. మే 20లోగా దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. రాబోయే జూలై లోపు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి రూ.149కే ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్, కేబుల్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. -
టెలిఫోన్ వినియోగదారులు @100.69 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య జూన్ నెల చివరి నాటికి 100.69 కోట్లకు చేరింది. ఇది మే నెల చివరి నాటికి 100.20 కోట్లుగా ఉందని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పేర్కొంది. మే నెల చివరి నాటికి 97.57 కోట్లుగా ఉన్న వైర్లెస్ వినియోగదారుల సంఖ్య జూన్ నెల చివరి నాటికి 98.08 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వైర్‌లైన్ వినియోగదారులు 2.62 కోట్ల నుంచి 2.61 కోట్లకు తగ్గారు. వైర్లెస్ వినియోగదారు మార్కెట్లో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల వాటా 91.75 శాతంగా, ప్రభుత్వ సర్వీస్ ప్రొవైడర్ల వాటా (బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్) 8.25 శాతంగా ఉంది. వైర్లెస్ విభాగంలో.. జూన్ నెల చివరి నాటికి ఎయిర్‌టెల్‌కు 23 కోట్ల మంది, వొడాఫోన్‌కు 19 కోట్ల మంది, ఐడియాకు 16 కోట్ల మంది, రిలయన్స్‌కు 11 కోట్ల మంది, టాటాకు 6 కోట్ల మంది, ఎయిర్‌సెల్‌కు 8 కోట్ల మంది, యూనినార్‌కు 5 కోట్ల మంది, సిస్టెమా శ్యామ్‌కు 87 లక్షల మంది, వీడియోకాన్‌కు 76 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. -
టెలిఫోన్ వినియోగదారులు @91 కోట్లు
న్యూఢిల్లీ: టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది నవంబర్‌లో స్వల్పంగా పెరిగిందని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో 90.45 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య అదే ఏడాది నవంబర్‌లో 0.62 శాతం వృద్ధితో 91.01 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరోవైపు అవాంఛిత కాల్స్ విషయంలో టెలీ మార్కెటింగ్ కంపెనీలకు ఊరటినిచ్చే నిర్ణయాన్ని ట్రాయ్ తీసుకుంది. అవాంఛిత కాల్స్ పంపించినందుకు విధించే జరిమానాల్లో భాగంగా ఆ కాల్స్ చేసిన నంబర్‌ను ట్రాయ్ డిస్కనెక్ట్ చేస్తుంది. రూ. 500 చెల్లించి మళ్లీ ఈ నంబర్‌ను చలామణిలోకి తెచ్చుకోవచ్చని ట్రాయ్ వివరించింది. ఇక మొబైల్ వినియోగదారులకు సంబంధించి వివరాలు.. పట్టణ వినియోగదారుల సంఖ్య 60.06 శాతానికి తగ్గగా, గ్రామీణ వినియోగదారుల సంఖ్య 39.94 శాతానికి పెరిగింది. టెలీడెన్సిటీ 73.69 శాతానికి పెరిగింది. 2013, అక్టోబర్‌లో 87.54 కోట్లుగా ఉన్న వెర్లైస్ వినియోగదారుల సంఖ్య 2013, నవంబర్‌లో 88.11 కోట్లకు పెరిగింది. వెర్లైస్ సర్వీసులు అందించే మొత్తం కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీల వాటా 88 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ల వాటా 12 శాతంగా ఉంది. కంపెనీ నవంబర్‌లో కొత్త మొత్తం విని. -
సెంట్రల్ జైల్లో ఖైదీలకు టెలిఫోన్
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ :ఖైదీలు తమ బంధువులతో మాట్లాడుకునేందుకు వీలుగా రాజమండ్రి సెంట్రల్‌జైలులో టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎ. నరసింహ బుధవారం టెలిఫోన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఖైదీలు వారానికి రెండుసార్లు తమ బంధువులకు ఫోన్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఐదు నిముషాలకు రూ. 20 చెల్లించాల్సి ఉంటుందన్నారు. బి.పి.ఝా టెలీకం కంపెనీ ఆధ్వర్యంలో రూ. 4 లక్షలతో సెంట్రల్ జైల్లో నాలుగు ఫోన్లు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఫోన్లు బయోమెట్రిక్ పద్ధతిలో ఖైదీలు వేలిద్రల ఆధారంగా పనిచేస్తాయన్నారు. ఒక్కొక్క ఖైదీకి రెండు ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుందని, వారి పేరున ఆ నెంబర్లు నమోదు అయి ఉంటాయని తెలిపారు. ఖైదీల కుటుంబ సభ్యులతో డీఐజీ ఫోన్లో మాట్లాడి ఈ సౌకర్యం కల్పించడం పట్ల వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్న ఖైదీలు: సెంట్రల్ జైల్లో టెలిఫోన్ సౌకర్యం కల్పించడంతో ఖైదీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివలన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకుంటామన్నారు. ఫోన్ సౌకర్యం కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇక... పోస్టల్ ఏటీఎం సెంటర్లు!
జిల్లాలో మొదటగా 5 కేంద్రాలు హెడ్ పోస్టాఫీసుల్లో ఏర్పాటు హన్మకొండ, వరంగల్, జనగాం, పరకాల, మహబూబాబాద్‌లో పరిశీలన పూర్తి తీరనున్న ఖాతాదారుల వెతలు హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : టెలిఫోన్, సెల్ఫోన్ల ప్రభావంతో పోస్ట ల్ శాఖలో కీలకమైన టెలిగ్రాం వ్యవస్థ మూతపడితే... ప్రైవేట్ కొరియర్లతో పోస్టు కార్డు జో రు తగ్గిన విషయం తెలిసిందే. వీటికి తోడు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల పోటీకి పోస్టాఫీసుల్లో పొదుపు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. అ న్ని విధాలుగా వెనుకబడిన పోస్టల్ శాఖ... ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. తాజాగా ఏటీఎం సెంటర్లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. సేవింగ్స్ బ్యాంక్ (ఎస్బీ) ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఐదు ఏటీఎం సెంటర్లు జిల్లాలో హన్మకొండ, వరంగల్ డివిజన్లుగా పోస్టల్ శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తోం ది. హన్మకొండ డివిజన్ పరిధిలో జనగాం, పరకాల, హన్మకొండలో మూడు హెడ్ పోస్టాఫీసులుండగా... 47 సబ్ పోస్టాఫీసులున్నా యి. మరో 372 బ్రాంచీల్లో పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నారుు. వరంగల్ డివిజన్ పరిధిలో వరంగల్‌తోపాటు మహబూబాద్‌లలో హెడ్ పోస్టాఫీసులు, 41 సబ్ పోస్టాఫీసులుండగా... 300 బ్రాంచీలున్నా రుు. మొదటగా జిల్లావ్యాప్తంగా ఐదు హెడ్ పోస్టాఫీసు ల్లో ఏటీఎం సెంటర్ల ఏర్పాటుకు పోస్టల్ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. నెల రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఇన్ఫోసిస్, సిఫి కంపెనీల ఇంజినీర్ల బృందం ఇటీవల హన్మకొండ, వరంగల్, జనగాం, పరకా ల, మహబూబాబాద్ పోస్టాఫీసులను పరిశీ లించింది. అంతేకాకుండా... పోస్టల్ శాఖ అధికారులు హెడ్ పోస్టాఫీసుల పరిధిలో ఎస్బీ ఖాతాల వివరాలను కంప్యూటర్లో పొందుపరిచే ప్రక్రియను కూడా చేపట్టారు. ఈ మేరకు వచ్చే ఏడాదిలో పోస్టల్ ఏటీఎంలను నెలకొల్పనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నారుు. జిల్లాలో దాదాపు ఆరు లక్షల మంది సేవింగ్ బ్యాంక్ ఖాతాదారుల ఉన్న ట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ ఏటీఎంలు అందుబాటులోకి వస్తే... వినియోగదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన బాధ తీరినట్లే. అంతేకాదు... వారు తమ తమ ఖాతాల్లో ఎప్పుడైనా నగదు వేసుకోవచ్చు.... ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. -
బకాయిల బడి!
సాక్షి, ముంబై: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేషన్ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెబుతున్న బీఎంసీ అధికారులు, ఆచరణలో విఫలమవుతున్నారు. కొత్త హంగుల సంగతి దేవుడెరుగు... పాఠశాలల్లో ఆరేళ్ల కిందటే కల్పించిన సదుపాయాల నిర్వహణపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడంతో అవి కూడా కనుమరుగువుతున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో మొత్తం 1,074 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4.36 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2006-07 విద్యాసంవత్సరంలో పిల్లల సౌకర్యార్థం ఈ పాఠశాలలకు ల్యాండ్ లైన్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల గురించి, వారి తల్లిదండ్రులకు ఏదైనా సమాచారం ఇవ్వడానికి ఫోన్ ఉపయోగపడుతుందని, అలాగే పిల్లల్లో విజ్ఞానం పెంపొం దించడానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని అప్పట్లో బీఎంసీ అధికారులు ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లిం చేందుకు బీఎంసీ ఎటువంటి నిధులు కేటాయించలేదు. దాంతో వాటి బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో కొన్నాళ్లకు సుమారు 90 శాతం పాఠశాలల్లో టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లను తొల గించారు. దీంతో అత్యవసర సమయాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారర చేరవేసేందుకు తమ సొంత మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఇలా రోజుకు వంద ఫోన్లు చేయాల్సిరావడంతో తమకు ఆర్థికంగా భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని వడాలాలో ఉన్న నద్కర్నిరోడ్ మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రద్ధాజాదవ్ పేర్కొన్నారు. ఈ విషయమై డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ (విద్య) సునీల్ ధామ్నే మాట్లాడుతూ.. కార్పొరేషన్ పాఠశాలలు ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించనందునే చాలా పాఠశాలల్లో కనెక్షన్లు తొలగించారని తెలిపారు. అయితే ఫోన్ బిల్లుల బకాయిల చెల్లింపునకు బీఎంసీ నిర్ణయించిందని ధామ్నే వివరించారు. అన్ని పాఠశాలలకు చెందిన బిల్లు బకాయిల వివరాలను వార్డుల వారీగా తమకు అందజేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్లను కూడా పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు.