సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టెలీ సాంద్రత నానాటికీ పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోనే తొమ్మిదో టెలీ సాంద్రత గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ లెక్కల ప్రకారం నవంబర్ 2022 నాటికి తెలంగాణలో మొత్తం 4.08 కోట్ల మంది టెలిఫోన్ వినియోగదారులున్నారు.
అందులో 98 శాతం మంది వైర్‌లెస్ (మొబైల్) వినియోగదారులే. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 2.37 కోట్ల మంది టెలిఫోన్ వినియోగదారులుండగా, అందులో 96 శాతం మంది వైర్‌లెస్ ఫోన్లు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే 1.70 కోట్ల మంది టెలిఫోన్ వాడుతుంటే అందులో 99.8 శాతం మందివి వైర్‌లెస్ ఫోన్లే.
విశేషమేమిటంటే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే సగటున మొబైల్ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం విశేషం. ఇక, మొబైల్ కనెక్షన్ల విషయంలో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలవగా, దేశంలో 9వ స్థానంలో నిలిచింది. ప్రతి 100 మంది జనాభాకు తెలంగాణలో 105 మొబైల్ కనెక్షన్లుండడం విశేషం.
దక్షిణాదిన కేరళ తర్వాత
దక్షిణ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెలీ సాంద్రత ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కేరళలో ప్రతి 100 మంది జనాభాకు 120 మొబైల్ ఫోన్లుండగా, తెలంగాణలో 105 మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. తమిళనాడులో 102, కర్ణాటక 97, ఆంధ్రప్రదేశ్‌లో 82 కనెక్షన్లు ఉన్నాయి.
ఇక, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా మొబైల్ టెలీ సాంద్రత మనకంటే తక్కువగా ఉంది. మహారాష్ట్రలో ప్రతి 100 మంది జనాభాకు ఉన్న మొబైల్ కనెక్షన్లు 99 మాత్రమే. ఇక దేశంలో అత్యల్ప మొబైల్ సాంద్రత ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (53), జార్ఖండ్ (58), మధ్యప్రదేశ్ (66), ఛత్తీస్‌గఢ్ (67), అసోం (69)లు నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment