రూ.149కే ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్
విజయవాడ: హీరో మోటార్స్ కు 600 ఎకరాలు (ఎకరా లక్ష చొప్పున), యాక్సిలరీ యూనిట్స్‌కు 200 ఎకరాలు(ఎకరా 10 లక్షల చొప్పున) కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోమవారం విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.3,200 కోట్ల పెట్టుబడితో, ప్రత్యక్షంగా 10వేలు, పరోక్షంగా మరో 10వేలు ఉద్యోగాల కల్పించనున్నారు. ఇది పూర్తయితే సౌత్ ఇండియాలో హీరో మోటార్స్ పరిశ్రమ ఇదే ప్రథమం.
మరోపక్క, అర్జున అవార్డు గ్రహీత, పోలీస్ బాక్సింగ్ కోచ్ శ్రీశీ రాజయరాం కు విశాఖలో ఎండాడ గ్రామంలో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నారు. రెవెన్యూ గెస్ట్ హౌస్ నిర్మాణానికి నర్సీపట్నంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారికి 10సెంట్లు స్థలం(చ.గ రూ.1000 చొప్పున) అనంతపురం జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్టుల స్థాపనకు (ఎ) పుట్లూరు మండలంలో మాదుగుపల్లి, ఎల్లుట్ల గ్రామాలలో 9.88 ఎకరాలు (బి) తాడిమర్రి మండలంలోని చిల్లవారి పల్లి గ్రామంలో 11.42 ఎకరాలు (సి) నార్పాల మండలంలో నార్పాల మరియు గూగుడు గ్రామాలలో 77.28 ఎకరాలు మొత్తం 98.58 ఎకరాలు అనంత సాగర్ నాన్ రెన్వూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ మరియు అనంత సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి సంయుక్తంగా 25 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు.
గుంటూరు జిల్లాలో కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నిర్మించడానికి దక్షణ మధ్య రైల్వే వారికి 16.45 ఎకరాల భూమి ఉచితంగా కేటాయించాలని నిర్ణయించారు. పీపీపీ పద్ధతిలో ట్రిపుల్ ఐటి స్థాపించడానికి చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని మల్లవారి పాలెం గ్రామంలో 35.09 ఎకరాలను కమిషనర్ సాంకేతిక విద్య వారికి ఉచితంగా కేటాయించనున్నారు.
ఇ-ప్రగతిలో ఒరాకిల్ కస్టమర్ హబ్ ప్రోడక్ట్, వారి కన్సల్టెన్స్ సర్వీసులను ఉపయోగించుకుని పీపుల్ హబ్ డేటాను తయారుచేయాలని నిర్ణయించారు. దీనివల్ల రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలకు సంబందించిన పూర్తి డేటా, ఇండివిడ్యువల్ బెనిఫిట్స్, రేషన్ కార్డుల వివరాలు తెలుస్తాయి. మే 20లోగా దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. రాబోయే జూలై లోపు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి రూ.149కే ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్, కేబుల్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.