మగవాడి మంచితనమైనా, చెడ్డతనమైనా.. మగవాడి మంచితనాన్ని బట్టి, చెడ్డతనాన్ని బట్టి కాకుండా.. ఆడవాళ్లు అనుకోడాన్ని బట్టి ఉంటుంది.
రాత్రి పన్నెండు దాటింది. పన్నెండు తర్వాత ఉప్పల్‌కి బస్సులు ఉండవు. పన్నెండుకి లాస్ట్ బస్. లాస్ట్ బస్ ఇంకా రాలేదు కాబట్టి, పన్నెండు దాటిన తర్వాత ఇక అది ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ముందే వెళ్లిపోయిందా అని అనుకోడానికి లేదు. పదకొండున్నర నుంచి అతడు ఆ బస్టాప్‌లో ఉన్నాడు. టెలిఫోన్ భవన్ బస్టాప్ అది. మెహిదీపట్నం డిపో నుంచి వచ్చే ఉప్పల్ బస్సులకు, పంజాగుట్ట మీదుగా వచ్చే ఉప్పల్ బస్సులకు టెలిఫోన్ భవన్ బస్టాప్ జంక్షన్. పంజాగుట్ట మీదుగా వచ్చే ఉప్పల్ బస్సుల టైమ్ పన్నెండుకు ముందే అయిపోతుంది కనుక ఇక రావలసింది మెహదీపట్నం నుంచి వచ్చే ఉప్పల్ బస్సే అనుకున్నా.. పంజాగుట్ట నుంచి వచ్చే ఆఖరి బస్సూ లేటయితే.. రెండు బస్సులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బస్టాప్‌లో మొదట అతడొక్కడే ఉన్నాడు కానీ, తర్వాత.. ఆమె కూడా వచ్చి అతడికి కాస్త దూరంలో నిలబడింది. పదకొండున్నర నుంచి అతడు అక్కడ ఉంటే.. పావు తక్కువ పన్నెండు నుంచి ఆమె అక్కడ ఉంది. ఇద్దరే ఉన్నారు బస్టాప్‌లో. ఎవరూ ఎవరితో మాట్లాడుకోవడం లేదు. సెల్‌ఫోన్‌లో టైమ్ చూసుకుంటూ.. బస్సు వచ్చే దారి వైపు చూస్తూ నిలుచున్నారు. బస్టాప్‌లో రిన్నోవేషన్ ఏదో జరుగుతున్నట్లుంది. అంతా తవ్వేశారు. పోల్స్‌కి ఉండవలసిన లైట్స్ కూడా లేవు. కాస్త దూరంలో ట్రాఫిక్ ఐలండ్‌లో ఉన్న స్ట్రీట్ లైట్ నుంచి ఇక్కడికి మసగ్గా వెలుతురు పడుతోంది. ఆ మసక వెలుతురులోనే ఆమె అందంగా ఉండడం గమనించాడు అతడు. అందంగా కాదు. చాలా అందంగా! ఆ ‘చాలా అందం’ బహుశా ఆమె జుట్టుది కావచ్చు. లేదా ఆ మెడ! లేదంటే.. ఆమెలో ఇంకేదో.. చూడబుద్ధయ్యేలా ఉన్న చోటు.
ఎంతోసేపు బస్సుకోసమే చూడలేడు కాబట్టి అప్పుడప్పుడు ఆమెవైపు కూడా చూస్తున్నాడు అతడు. భుజానికి హ్యాండ్ బ్యాగ్ ఉంది. చేతిలో క్యారీ బ్యాగ్ ఉంది. ఇన్ని బ్యాగులతో ఆడవాళ్లకు ఎన్ని పనులో అనుకున్నాడు అతడు. అలా అనుకోడానికి ముందు.. ఇంత రాత్రివరకు ఆమె తన పని ఎందుకు తెముల్చుకోలేక పోయిందో అనుకున్నాడు. తనొక్కటే ఉన్నందుకు భయపడుతోందేమోనని ఆమెక్కొంచెం ధైర్యం ఇవ్వాలని అతడికి అనిపించింది. ధైర్యం ఇవ్వడం అంటే.. తను చెడ్డవాడిని కాదన్న భావన ఆమెకు కల్పించడం. అంతకన్నా కూడా.. అంతసేపటిగా ఒక ఆడ, ఒక మగ.. ఎంత అపరిచితులైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండడంలోని అసహజత్వం అతడిని ఇబ్బంది పెడుతోంది. ఆ ఇబ్బందిని పోగొట్టుకోడానికైనా అతడు ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ‘‘మీరూ ఉప్పలేనా?’’ అన్నాడు. ఆమె చికాగ్గా చూసింది. అతడు కొంచెం హర్ట్ అయ్యాడు. ఆడవాళ్లు వాళ్లకైవాళ్లు మంచి అనుకుంటే తప్ప మగవాళ్ల మంచితనాన్ని ఆమోదించరని జీవితంలో అనేకసార్లు అతడికి అనుభవమైంది. మగవాడి మంచితనమైనా, చెడ్డతనమైనా.. మగవాడి మంచితనాన్ని బట్టి, చెడ్డతనాన్ని బట్టి కాకుండా.. ఆడవాళ్లు అనుకోడాన్ని బట్టి ఉంటుంది. ‘‘వేరేలా అనుకోకండి. మీరూ ఉప్పలేనా అని అడగడంలో నా ఉద్దేశం.. నేనూ ఉప్పలే అని చెప్పడం కాదు. నేనూ మీలా మనిషినే అని మీరు అర్థం చేసుకోవాలని అలా అడిగాను. ఎందుకంటే.. ఈ చీకటి రాత్రి, ఈ ఒంటరి రాత్రి నేను మీకు మనిషిలా కాకుండా మరోలా కనిపిస్తున్నానేమోనని నాకు అనిపిస్తోంది’’ అన్నాడు అతడు. అతడివైపు చిత్రంగా చూసింది ఆమె. చూసిందే కానీ అతడితో మాట్లాడలేదు. మళ్లీ బస్సు వచ్చే దారి వైపు చూసింది. బస్సు వస్తూ కనిపించలేదు.
‘‘ఏమైందీ దెయ్యం బస్సుకు?!’’ అన్నాడతడు ఆమెకు సానుభూతిగా. ఆ మాటకు మళ్లీ అతడివైపు ఆమె చికాగ్గా చూసింది. ‘‘సారీ..’’ అన్నాడు అతడు. ‘ఎందుకు సారీ..’ అన్నట్లు చూసింది ఆమె. ‘‘బస్సులు దెయ్యాలు ఎందుకవుతాయి? వేళ తప్పి బస్సుల కోసం చూసే మనమే దెయ్యాలం’’ అన్నాడు అతడు. ఫక్కున నవ్వింది ఆమె. ‘‘హమ్మయ్య.. నవ్వారు’’ అన్నాడు అతడు. ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నారు. ‘‘మీరూ ఉప్పలేనా?’’ మళ్లీ అడిగాడు అతడు. ‘‘ఎందుకనుకుంటున్నారు.. నేనూ ఉప్పలేనని?’’ అంది ఆమె. అతడు నవ్వాడు. ‘‘ఈవేళప్పుడు ఈ స్టాప్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే బస్సులు, కోఠి వెళ్లే బస్సులు ఉండవు. అందుకే ఉప్పలేనా అని అడిగాను’’ అన్నాడు. ఆమె నవ్వింది. ‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ అడిగాడు. ‘‘ఉప్పల్ బస్సు ఎక్కితే ఉప్పలే వెళ్తారా? మధ్యలో పది స్టాపులు ఉంటాయి. ఏ స్టాపులోనైనా దిగొచ్చు కదా నేను. నారాయణగూడనో, బర్కత్‌పురానో, రామంతపూరో..’’ అంది ఆమె. అతడు నవ్వాడు. ‘‘సో.. నేను మిమ్మల్ని అడగవలసిన ప్రశ్న.. ‘మీరూ ఉప్పల్ బస్ కోసమేనా?’ అనే కదా’’ అన్నాడు. ఆమె మళ్లీ నవ్వింది.అతడికి సంతోషంగా ఉంది. అక్కడ తామిద్దరే ఉండడం అతడికి బాగుంది. తెల్లారే వరకు బస్సు రాకపోతే బాగుండనుకున్నాడు. అయితే అలా అనుకోగానే.. ఇలా వస్తూ కనిపించింది ఉప్పల్ వెళ్లే బస్సు! పావు తక్కువ ఒంటిగంటకు.
‘‘వచ్చేసింది’’ అన్నాడు అతడు ఆమెవైపు తిరిగి. అయితే ఆమె అక్కడ లేదు. బస్సు ఎక్కుతూ కనిపించింది! అరె.. అంత వేగంగా ఎప్పుడు వెళ్లిపోయింది అనుకున్నాడు అతడు. అతడు ఎక్కేలోపే బస్సు కదలిపోయింది! తనొక్కడే ఉసూరుమంటూ బస్టాప్‌లో ఉండిపోయాడు. కనీసం నేనొకణ్ని బస్టాప్‌లో ఉన్నానని డ్రైవర్‌కి చెప్పి ఆపించలేకపోయింది అనుకున్నాడు అతడు. వెంటనే అతడికి ఇంకో ఆలోచన కూడా వచ్చింది. బస్సులో తనొక్కటే లేదు కదా.. అని. ఎస్.. తనొక్కటే ఉన్నట్లుంది. బస్సు ఆగినప్పుడు చూశాడు. డ్రైవర్, కండక్టర్ తప్ప లోపల ఎవరూ లేరు. బస్సు ఫెయిలైందని, రూటు మళ్లించి, ఏ మూలో ఆపి, ఆమెను వాళ్లు ఏమైనా చేస్తే? పైగా అందంగా ఉంది. ఒంటరిగా ఉంది. బస్టాపులో తన ఒంటరితనం మర్చిపోయి, బస్సులో ఆమె ఒంటరితనం గురించి ఆలోచిస్తున్నాడు అతడు. పది నిముషాల తర్వాత ఇంకో బస్సు వచ్చింది! ఉప్పల్ బస్సు. పరుగున వెళ్లి ఎక్కేశాడు. అందులో కూడా డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. వెనక్కు వెళ్లి కూర్చున్నాడు. బస్సు వేగంగా వెళుతోంటే కిటికీలోంచి రయ్యిన చల్లటి గాలి ముఖానికి తగులుతోంది. కళ్లు మూసుకున్నాడు.
అతడు కళ్లు మూసుకున్నాడే కానీ, మళ్లీ వెంటనే కళ్లు తెరిచాడు. అప్పటికింకా బస్సు తర్వాతి స్టాపుకు కూడా చేరుకోలేదు. ఎవరూ లేని బస్సులో.. తన సీటు వెనుక సీట్లో ఎవరో ఉన్నట్లనిపించి వెనక్కు తిరిగి చూశాడు. ఆమె!!!అతడి గొంతు కండరాలు భయంతో బిగుసుకుపోయాయి. ‘‘ముందెక్కిన బస్సు ఫెయిలయింది. అందుకే ఈ బస్సెక్కాను’’ అంది.. నోటి దగ్గర రక్తాన్ని నాలుకతో చప్పరిస్తూ. వెంటనే లేచి ముందు సీట్లలోకి వెళ్లిపోతే ఏం గొడవోనని... ప్రాణాల్ని బిగబట్టుకుని అక్కడే కూర్చుండిపోయాడు అతడు.
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment