టెలిఫోన్ వినియోగదారులు @100.69 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య జూన్ నెల చివరి నాటికి 100.69 కోట్లకు చేరింది. ఇది మే నెల చివరి నాటికి 100.20 కోట్లుగా ఉందని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పేర్కొంది. మే నెల చివరి నాటికి 97.57 కోట్లుగా ఉన్న వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య జూన్ నెల చివరి నాటికి 98.08 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వైర్‌లైన్ వినియోగదారులు 2.62 కోట్ల నుంచి 2.61 కోట్లకు తగ్గారు. వైర్‌లెస్ వినియోగదారు మార్కెట్‌లో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల వాటా 91.75 శాతంగా, ప్రభుత్వ సర్వీస్ ప్రొవైడర్ల వాటా (బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్) 8.25 శాతంగా ఉంది. వైర్‌లెస్ విభాగంలో.. జూన్ నెల చివరి నాటికి ఎయిర్‌టెల్‌కు 23 కోట్ల మంది, వొడాఫోన్‌కు 19 కోట్ల మంది, ఐడియాకు 16 కోట్ల మంది, రిలయన్స్‌కు 11 కోట్ల మంది, టాటాకు 6 కోట్ల మంది, ఎయిర్‌సెల్‌కు 8 కోట్ల మంది, యూనినార్‌కు 5 కోట్ల మంది, సిస్టెమా శ్యామ్‌కు 87 లక్షల మంది, వీడియోకాన్‌కు 76 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.