ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దు : మాల మహానాడు
కేంద్ర మంత్రి గెహ్లాట్‌కు మాల మహానాడు వినతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దని, దేశంలో వర్గీకరణ ఎక్కడా లేదని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు మాల మహానాడు ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది.
మంగళవారం మంత్రిని కలసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య నేతృత్వంలోని బృందం.. వర్గీకరణ వల్ల నష్టాలను వివరించింది. వర్గీకరణకు వ్యతిరేకంగా ఆరో రోజు దీక్షలో చెన్నయ్య మాట్లాడుతూ.. రెండు కళ్ల సిద్ధాంతంతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, మనువాద కుట్రలతో ఎస్సీలను వర్గీకరించాలని చూస్తోందని, దీని వెనక కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. దళితులను విభజించి పాలించడమే బీజేపీ సిద్ధాంతమని, ఇప్పటికైనా వెంకయ్య ఈ కుట్రలు మానుకోవాలన్నారు.