సీఎం నేటి పర్యటన రద్దు
సాదాసీదాగా విశాఖ ఉత్సవ్ ముగిసేనా
విశాఖపట్నం: విశాఖఉత్సవ్-2015 ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావడంలేదు. నగరంలో వేర్వేరు వేదికల్లో ఈనెల 23వ తేదీ నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరు కాగా, ఆదివారం జరుగనున్న ముగింపు ఉత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించారు. విదేశీ పర్యటనలో భాగంగా దావోస్ పర్యటిస్తున్న ఉన్న సీఎం శని వారం ఉదయం హైదరాబాద్ చేరుకో నున్నారు. మధ్యాహ్నంనేరుగా నగరానికి చేరుకుని విశాఖ ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంది. చివరి నిముషంలో సీఎం పర్యటన రద్దయినట్టుగా జిల్లా కలెక్టరేట్‌కు సమాచారం అందింది. ఈ విషయాన్ని కలెక్టరేట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆదివారం జరుగనున్న ముగింపు ఉత్సవాలు సాదాసీదాగానే జరిగే అవకాశాలు కన్పిస్తు న్నాయి.
జిల్లాకు చెందిన మరో మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు ఆయన వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులంతా ఈఉత్సవాలకు దూరంగా ఉండగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఈ ఉత్సవాలను వన్మెన్ఆర్మీగా నిర్వహిస్తున్నారు. శనివారం హాజరు కావాల్సిన మరో కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజునైనా ముగింపు ఉత్సవాలకు తీసుకురావాలని గంటా చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కన్పించడం లేదు. గణతంత్ర వేడుకల సందర్భంగా మంత్రి అశోక్‌గజపతిరాజు ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో మంత్రి గంటా ఆధ్వర్యంలోనే ఈ ఉత్సవాలకు ముగింపు పలుకనున్నట్టు తెలియవచ్చింది.