సీమాంధ్ర ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉంది'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర హోదా అంశాన్ని ఇంకా పెండింగ్ లోనే పెట్టింది. కేంద్రం నుంచి అదనపు సాయం పొందే అర్హత కు సంబంధించి, జాతీయ అభివృద్ధి మండలి నిర్దేశించిన సూత్రాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ఇంకా పరిశీలనలోనే ఉందని ప్రణాళిక సంఘం తెలిపింది. దీనిపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని శుక్రవారం స్పష్టం చేసింది.
ప్రణాళికా శాఖ కేంద్ర మంత్రి ఇందర్ జీత్ సింగ్ రావుకు ప్రణాళికా సంఘం అధికారులు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఆంద్రప్రదేశ్ కి అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న మన్మోహన్ సింగ్ తెలిపిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే బీహార్, రాజస్థాన్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. బీహార్ కి ఆ హోదా ఇవ్వనవసరం లేదని, మిగతా రాష్ట్రాలకు మాత్రం ఇవ్వవచ్చునని ప్రణాళికా సంఘం భావిస్తోంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రానికి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు 90 శాతం ప్రణాళికా గ్రాంట్ గా , మిగతాది అప్పుగా ఇవ్వడం జరుగుతుంది.
జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం కొండలు, దుర్గమ ప్రాంతాలు ఉండటం, జన సాంద్రత తక్కువగా ఉండటం, పెద్ద సంఖ్యలో గిరిజన జనాభా ఉండటం, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న సరిహద్దు రాష్ట్రమై ఉండటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకే ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడానికి వీలవుతుంది.
ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సిక్కింలకు మాత్రమే ప్రత్యేక హోదా ఉంది.