మెట్రో స్పెల్లింగులు తప్పుల తడకలు
సవరిస్తామంటున్న డీఎంఆర్సీ
న్యూఢిల్లీ: మెట్రోరైళ్లు ప్రయాణికులు చక్కటి సేవలు అందిస్తుండవచ్చు గాక. అయితే స్టేషన్లు, రూట్మ్యాపులపై ఉన్న పేర్లలో చాలా తప్పులు కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని పేర్ల స్పెల్లింగులు తప్పుగా ఉంటే, మరికొన్నింటినీ తప్పుగా రాస్తున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ మె ట్రో స్టేషన్ ఒకటో నంబరు గేటు దగ్గరున్న బోర్డుపై Chams Ford Club అని రాసి ఉంటుంది. నిజానికి దీనిని Chelms Ford Club అని రాయాలి. బ్రిటిష్‌పాలనలో భారత వైస్రాయ్ లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ పేరు మీద నగరంలోని రెడ్‌క్రాస్ రోడ్డు లో క్లబ్ ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి చెమ్స్‌ఫోర్డ్ వీధి అనే పేరొచ్చింది.
మండీ హౌస్ స్టేషన్‌లోని సూచికల బోర్డులపై Lady Irvin College అని తప్పుగా రాశారు. దీనిని Lady Irwin College అని రాయాలి. ఇర్విన్ కూడా భారత వైస్రాయ్ సతీమణి కావడంతో ఈమె పేరుపై లేడీ ఇర్విన్ కాలేజీని 1930లో స్థాపించారు. ఇదే స్టేషన్లో మరో చోట Bhagwan Dass Road కు బదులు Bhagvan Dass Road అంటూ తప్పుగా రాశారు. అంతేగాక స్టేషన్లలో ఎల్ఈడీ తెర ల్లో కనిపించే రూటుమ్యాపుల్లోనూ చాలా తప్పులు ఉంటాయి. జంగ్‌పురా స్టేషన్‌లోని బోర్డులపై Jang pura అని సరిగ్గానే రాసి ఉంటుంది. కోచ్‌లలోని ఎల్ఈడీ తెరపై దీనిని Jang pura అంటూ రెం డు పదాలుగా విడగొట్టారు.
మూల్‌చంద్ స్టేషన్ పేరులోనూ ఇదే పొరపాటు జరిగింది. స్టేషన్ బయట ఉక్కు అక్షరాల్లో Moolchand అని బాగా నే రాశారు. రూట్మ్యాపుల్లో మాత్రం Mool chand అని విడగొట్టారు. ఈ తప్పుల గురించి ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారు ల వద్ద ప్రస్తావించగా, త్వరలోనే స్పెల్లింగు తప్పులను సవరిస్తామని ప్రకటించారు. ఇలాంటి తప్పు లు సూచికల బోర్డులు, రూట్మ్యాపులకు మాత్రమే పరిమితం కాలేదు. రాజధాని విహారం పేరుతో రూపొందించిన నావిగేషన్ మ్యాపుల్లోనూ తప్పులకు కొదవలేదు.
సెంట్రల్ సెక్రటేరియట్ నావిగేషన్ మ్యాపులో రాష్ట్రపతి భవన్ అని పేర్కొంటూ పార్లమెంటు భవ నం ఫొటో ముద్రించారు. జహంగీర్‌పురి స్టేషన్ పేరును ఎల్ఈడీ తెరపై సక్రమంగానే రాశారు. స్టేషన్ బయట కనిపించే సూచికల బోర్డులో మాత్రం ‘జహంగీర్ పురి’ అని విడిగా రాశారు. యెల్లోలైన్లో కింగ్స్‌వే క్యాంప్ స్టేషన్ పేరును ‘కింగ్స్ వే క్యాంప్’ అంటూ అనవసరంగా ఖాళీలతో రాశారు. రేస్‌కోర్సు మెట్రో స్టేషన్‌లోని సూచికల బోర్డులపై Tuglak Road అని తప్పుగా రాశా రు. దీనిని Tughlaq Road అని రాయాలి.