ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
– ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ సంజీవ రెడ్డి
– నంద్యాలలో ఏపీఎస్ఈబీ 327 రాష్ట్ర కార్యవర్గ సమావేశం
నూనెపల్లె: విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమాలే శరణ్యమని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నంద్యాలలోని శోభా ఫంక్షన్ హాలులో మంగళవారం ఏపీఎస్ఈబీ 327 యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగులకు సరైన పెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని సంజీవరెడ్డి ఆరోపించారు. ఎన్టీపీసీలో ఏడాదికి రూ. 80వేలు బోనస్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేనని చెప్పడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థల ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఇచ్చి దేశ సంపదను వారికి దోచి పెడుతోందన్నారు. కాంట్రాక్టు, ప్రయివేటు ఉద్యోగంతో హోదా పెరగదని, వారికి పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాడ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు పెరుగుతున్నా కొత్తవారికి కాంట్రాక్టు బేసిక్ ఇవ్వడం ఎక్కడా లేదన్నారు. అనంతరం పవర్ వర్కర్ అనే యూనియన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి, 327 యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ సాయిబాబా, రీజినల్ నాయకులు రఘు, గిరి, నంద్యాల డివిజన్ కార్యదర్శి లక్ష్మికాంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.