Central Sports Minister
-
క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ శాఖను నిర్వహించిన కిరణ్ రిజుజు ఇతర శాఖకు బదిలీ కావడంతో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021కు సరిగ్గా రెండు వారాల ముందు కేంద్ర క్రీడల శాఖకు కొత్త మంత్రి వచ్చారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనురాగ్ ఠాకూర్‌కు ఈ అవకాశం లభించింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల అనురాగ్ ఠాకూర్‌కు ఇదివరకే క్రీడలతో అనుబంధముంది. ఆయన గతంలో 2016 మే నుంచి 2017 ఫిబ్రవరి వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు బీసీసీఐ సెక్రటరీగా, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అనుభవం అతనికుంది. ఇదిలా ఉంటే, ఈనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గతేడాదిగా వాయిదా పడుతూ వస్తున్న ఒలింపిక్స్‌ను జులై నెలలో ఎలాగైనా నిర్వహించాలని నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మంత్రివర్గంతో అత్యవసరంగా సమావేశమై జపాన్ ప్రధాని యొషిహిదె సుగా టోక్యోలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒలింపిక్స్ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి బయలదేరనున్న అథ్లెట్లు .. ఎప్పుడూ వెళతామో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. దానికి తోడు కొత్త క్రీడా మంత్రి రావడంతో ఏం జరుగుతుందోనన్న అయోమయంలో ఉన్నారు. -
ఒలింపిక్స్ జెర్సీలను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్లు సన్నద్దం అవుతున్నారు. ఈ క్రమంలో నేడు(గురువారం) కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు.. భారత అథ్లెట్ల జెర్సీలను, అలాగే సహాయ సిబ్బంది యూనిఫాంలను ఆవిష్కరించారు. అథ్లెట్ల కోసం నీలం, తెలుపు రంగులలో జెర్సీలు డిజైన్ చేయబడగా, సపోర్ట్ స్టాఫ్ కోసం ప్రత్యేక సూట్లు రూపొందించబడ్డాయి. కాగా, షెడ్యూల్ ప్రకారం గతేడాది(2020) జరగాల్సిన విశ్వక్రీడలు.. ఈ ఏడాది జులైకి రీషెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, అంతకముందే ఒలింపిక్స్క్రీడల సంసిద్దతపై ప్రధాని మోదీ.. క్రీడల మంత్రితో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులందరికి వ్యాక్సినేషన్, సరైన శిక్షణ, ఇతర సదుపాయాల గురించి చర్చించారు. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహకాలనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని, మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. విశ్వక్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల దీవెనలుంటాయని, టోక్యోకు వెళ్లే భారత బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ కోసం మన దేశం నుంచి 11 క్రీడా విభాగాల్లో మొత్తం 100 మంది అథ్లెట్లు పాల్గొంటారు. జూన్చివరి నాటికి ఆ సంఖ్య 125కి పెరిగే అవకాశం ఉంది. చదవండి: కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్ వేరు, నా స్టైల్ వేరు -
షూటింగ్ లేకుంటే... 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను బహిష్కరిద్దాం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడల జాబితా నుంచి షూటింగ్‌ను తప్పిస్తే... తాము ఏకంగా ఈ మెగా ఈవెంట్‌ను బహిష్కరిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) హెచ్చరిక జారీ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు సత్వరమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా శనివారం లేఖ రాశారు. గత నెలలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో రాబోయే కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్‌ను తొలగించి, మరో మూడు కొత్త క్రీడలను చేర్చాలని కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) ప్రతిపాదన తెచ్చింది. ఇదే జరిగితే... పతకాల పరంగా భారత్‌కు పెద్ద దెబ్బే అవుతుంది. పట్టికలోనూ కిందకు పడిపోతుంది. ఈ 2018 గోల్డ్‌కోస్ట్ క్రీడల్లో మన దేశం 66 పతకాలు సాధించగా, అందులో 16 షూటింగ్లో వచ్చినవే. నేపథ్యంలో తమ నిరసనగా సెప్టెంబరులో రువాండాలో జరుగనున్న సీజీఎఫ్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేది లేదని ఐఓఏ తేల్చిచెప్పింది. సమాఖ్య రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, స్పోర్ట్స్ కమిటీ సభ్యత్వానికి నామ్‌దేవ్ షిర్గాంకర్ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంది. ‘ఇలాంటి అసంబద్ధ ఆలోచనలపై మా నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయదల్చుకున్నాం. మేం ఇంకా బ్రిటిష్ పాలనలో లేమని వారు తెలుసుకోవాలి. భారత్ ఏ క్రీడలో పట్టు సాధిస్తే అందులో నిబంధనలు మార్చడమో, మరో అడ్డంకి సృష్టించడమో చేస్తున్నారు. ఈసారి మాత్రం వాటిని ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాం’ అని బాత్రా తెలిపారు. -
క్రీడల మంత్రిగా రాజ్యవర్ధన్
న్యూఢిల్లీ: మోదీ సర్కారులో కొత్త క్రీడల మంత్రి కొలువుదీరారు. మాజీ స్టార్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కేంద్ర క్రీడాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రిగా పనిచేసిన ఆయన శాఖను ఆదివారం జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రధాని మోదీ మార్చారు. ఒక ఒలింపిక్ పతక విజేత క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కాగా... ఎన్డీఏ ప్రభుత్వంలో రాథోడ్ మూడో క్రీడాశాఖ మంత్రి. గతంలో శర్బానంద సోనోవాల్, విజయ్ గోయెల్ క్రీడల మంత్రులుగా పనిచేసిన సంగతి తెలిసిందే. 47 ఏళ్ల రాథోడ్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు. అప్పట్లో వ్యక్తిగత విభాగంలో ఇదే అత్యుత్తమ పతకం. తదనంతరం దీన్ని అభినవ్ బింద్రా 2008లో స్వర్ణంతో మార్చేశాడు. క్రీడాశాఖ కేటాయింపు సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ తన హయాంలో క్రీడాకారులందరికీ అత్యుత్తమ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని, క్రీడల్లో భారత్‌ను మేటి పోటీ దేశంగా నిలిపేందుకు శ్రమిస్తానని అన్నారు. ఆయన క్రీడల మంత్రి కావడం పట్ల క్రీడావర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. మాజీ షూటర్ అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, బాక్సర్ మేరీకోమ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, హాకీ స్టార్ వీరెన్ రస్కిన్హా, మాజీ క్రీడల మంత్రి అజయ్ మాకెన్ జాతీయ షూటింగ్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు రణీందర్సింగ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయెల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కటే క్రీడాసంస్కృతిని పెంపొందించలేదని చెప్పారు. తన మంత్రిత్వ శాఖను విజయవంతంగా తీర్చిదిద్దినందువల్లే ప్రధాని మోదీ తనకు కీలక బాధ్యతలను అప్పగించారని విజయ్ గోయెల్ తెలిపారు. కేబినెట్ విస్తరణలో ఆయనకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు.