క్రీడల మంత్రిగా రాజ్యవర్ధన్
న్యూఢిల్లీ: మోదీ సర్కారులో కొత్త క్రీడల మంత్రి కొలువుదీరారు. మాజీ స్టార్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కేంద్ర క్రీడాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రిగా పనిచేసిన ఆయన శాఖను ఆదివారం జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రధాని మోదీ మార్చారు. ఒక ఒలింపిక్ పతక విజేత క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కాగా... ఎన్‌డీఏ ప్రభుత్వంలో రాథోడ్ మూడో క్రీడాశాఖ మంత్రి. గతంలో శర్బానంద సోనోవాల్, విజయ్ గోయెల్ క్రీడల మంత్రులుగా పనిచేసిన సంగతి తెలిసిందే.
47 ఏళ్ల రాథోడ్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు. అప్పట్లో వ్యక్తిగత విభాగంలో ఇదే అత్యుత్తమ పతకం. తదనంతరం దీన్ని అభినవ్ బింద్రా 2008లో స్వర్ణంతో మార్చేశాడు. క్రీడాశాఖ కేటాయింపు సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ తన హయాంలో క్రీడాకారులందరికీ అత్యుత్తమ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని, క్రీడల్లో భారత్‌ను మేటి పోటీ దేశంగా నిలిపేందుకు శ్రమిస్తానని అన్నారు. ఆయన క్రీడల మంత్రి కావడం పట్ల క్రీడావర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
మాజీ షూటర్ అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, బాక్సర్ మేరీకోమ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, హాకీ స్టార్ వీరెన్ రస్కిన్హా, మాజీ క్రీడల మంత్రి అజయ్ మాకెన్ జాతీయ షూటింగ్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు రణీందర్‌సింగ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయెల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కటే క్రీడాసంస్కృతిని పెంపొందించలేదని చెప్పారు. తన మంత్రిత్వ శాఖను విజయవంతంగా తీర్చిదిద్దినందువల్లే ప్రధాని మోదీ తనకు కీలక బాధ్యతలను అప్పగించారని విజయ్ గోయెల్ తెలిపారు. కేబినెట్ విస్తరణలో ఆయనకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు.