న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చాలెంజ్‌ను విసిరాడు. అలాగే తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అందుకు మోదీ స్పందిస్తూ ‘సవాలును స్వీకరిస్తున్నా. త్వరలో నా ఫిట్‌నెస్ వీడియోను పోస్టు చేస్తాను’ అంటూ ట్వీట్ చేశారు. ఫిట్‌నెస్‌పై కోహ్లీ, మోదీలు చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు అంతటా ఆసక్తిని రేపుతున్నాయి. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్‌లో ఈ ఫిట్‌నెస్ చాలెంజ్‌కు పిలుపునిచ్చారు. # Hum Fit Toh India Fit (మనం దృఢంగా ఉంటే దేశం దృఢంగా ఉంటుంది) పేరిట రాథోడ్ ఈ పిలుపునిస్తూ.. దేశ ప్రజల్లో వ్యాయామం పట్ల ఆసక్తి పెంపొందించేందుకు తన ఫిట్‌నెస్ చాలెంజ్‌ను స్వీకరించాలని క్రికెటర్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు ట్వీట్ చేశారు.
ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని అందులో వెల్లడించడంతో పాటు.. భారతీయులు వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. ఫిట్‌నెస్ వీడియోల్ని Fitness Challenge, Hum Fit Toh India Fit హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టు చేయాలని సూచించారు. రాథోడ్ పిలుపునకు కోహ్లీ స్పందిస్తూ.. ‘నేను రాథోడ్ సార్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. అయితే నా భార్య అనుష్క శర్మను కూడా ఈ సవాలులో భాగం చేస్తున్నాను’ అని చెపుతూ ప్రధాని మోదీ, మరో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీలను ట్యాగ్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. రాథోడ్ ఫిట్‌నెస్ సవాలుకు సైనా నెహ్వాల్, నటులు అమితాబ్ బచ్చన్, మనోజ్ తివారీ, సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్, రెజ్లర్ బబిత ఫోగట్, పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మానసి జోషితో పాటు పలువురు స్పందించారు. ట్విట్టర్‌లో తమ వీడియోలను పోస్టు చేశారు. అలాగే ప్రముఖులు కూడా వరుసగా ఈ చాలెంజ్‌పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
మోదీజీ.. మా చాలెంజ్‌కు సిద్ధమా: రాహుల్
ట్విట్టర్‌లో జోరుగా సాగుతున్న ఫిట్‌నెస్ చాలెంజ్ ఆసక్తికరంగా రాజకీయ మలుపు తీసుకుంది. కోహ్లీ సవాలుకు సిద్ధమంటూ మోదీ చేసిన ట్వీట్‌ను అస్త్రంగా చేసుకుని.. దేశంలోని సమస్యల్ని పరిష్కరించాలంటూ విపక్ష నేతలు మోదీకి సవాలు విసురుతున్నారు. ‘మోదీ గారు. మీరు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చాలెంజ్‌ను స్వీకరించినందుకు ఆనందంగా ఉంది. నా నుంచి కూడా ఒక చాలెంజ్. పెట్రో ధరలు తగ్గించండి.. లేదా మీరు రంగంలోకి దిగేలా చేసేందుకు కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళన నిర్వహిస్తుంది. మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటా’ అని # Fuel Challenge పేరిట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మోదీని సవాలు చేస్తూ.. ‘చమురు ధరలు వరుసగా 11వ రోజు పెరిగాయి. ప్రధాని మోదీ మాత్రం మౌనంగానే ఉన్నారు.
చమురు ధరలు తగ్గిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు తగ్గిపోతుందని ఆయన కేబినెట్‌లోని మంత్రులు చెపుతున్నారు. గత నాలుగేళ్లుగా ఎక్సైజ్ రూపంలో దోచుకున్న రూ.10లక్షల కోట్లను ఇంధన ధరలు తగ్గించేందుకు ఉపయోగిస్తారా? దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు ఫిట్‌నెస్ చాలెంజ్‌ను స్వీకరించండి’ అని ట్వీట్ చేశారు. మాజీ క్రికెటర్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా సవాల్ విసురుతూ. ‘కోహ్లీ ఫిట్‌నెస్ చాలెంజ్‌ను మీరు అంగీకరించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. యువతకు ఉద్యోగాలు కల్పించడం, రైతుల్ని ఆదుకోవడం, దళితులు, మైనార్టీలపై దాడులు జరగకుండా హామీ ఇస్తూ నా చాలెంజ్‌ను స్వీకరిస్తారా?’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment