ధ్యానం, యోగా, వాకింగ్ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో దృశ్యాలు
న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి విసిరిన ఫిట్‌నెస్ చాలెంజ్‌కు ప్రధాని మోదీ స్పందించారు. బుధవారం తన ఫిట్‌నెస్ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, 22 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మాణికా బాత్రా, ఐపీఎస్ అధికారులు ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారికి మోదీ అదే సవాలు విసిరారు. మోదీ చాలెంజ్‌ను బాత్రా స్వీకరించగా, కుమారస్వామి మాత్రం..తనకు కర్ణాటక ఫిట్‌నెస్, అభివృద్ధే ముఖ్యమని కాస్త వ్యంగ్యంగా స్పందించారు.
ధ్యానం..యోగా..వాకింగ్..
తాను పోస్ట్ చేసిన 90 సెకన్ల నిడివి గల వీడియోలో మోదీ..ధ్యానం, యోగా, వాకింగ్ చేస్తున్నట్లు కనిపించింది. నలుపు రంగు జాగింగ్ దుస్తుల్లో ఆయన పంచభూతాలు(నేల, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం) స్ఫురించేలా ఏర్పాటుచేసిన ఇరుకైన వృత్తాకార ట్రాక్‌పై తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచారు. శరీరాన్ని అటూఇటూ వంచుతూ కసరత్తులు చేశారు. బండరాయిపై కూర్చుని ధ్యానం చేశారు. ‘యోగాతో పాటు, పంచభూతాల స్ఫూర్తితో ఏర్పాటుచేసిన ట్రాక్‌పై నడుస్తాను. ప్రాణాయామ కసరత్తులు కూడా చేస్తా. ఇవి మనసు, శరీరాన్ని తాజాగా ఉంచటంతో పాటు కొత్త ఉత్సాహాన్నిస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. కోహ్లి సవాల్ విసిరిన సుమారు మూడు వారాల తరువాత మోదీ ఈ వీడియోను విడుదల చేశారు.
ఫిట్‌నెస్ ముఖ్యమే..కానీ: కుమారస్వామి
మోదీ సవాలుపై కుమారస్వామి స్పందిస్తూ..‘ప్రధానమంత్రి గారు! నా ఆరోగ్యంపై మీరు చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు. మనందరికీ ఫిజికల్ ఫిట్‌నెస్ ముఖ్యమని నేను కూడా నమ్ముతాను. యోగా, ట్రెడ్‌మిల్‌లు నా రోజువారీ జీవితంలో భాగంగా ఉన్నాయి. కానీ నాకు అంతకన్నా కర్ణాటక ఫిట్‌నెస్, అభివృద్ధే ముఖ్యం. ఈ విషయంలో మీ మద్దతు కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. కుమారస్వామికి 2007, 2017లో రెండుసార్లు హృద్రోగ సంబంధ శస్త్రచికిత్సలు జరిగాయి.
తన ఆరోగ్యంపై ఆందోళనతో తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులను కోరినట్లు కుమారస్వామి గతంలో ఓసారి వెల్లడించారు. మరోవైపు, మోదీ సవాలును స్వీకరించిన బాత్రా త్వరలోనే తన ఫిట్‌నెస్ వీడియోను పోస్ట్ చేస్తానని వెల్లడించింది. ‘నన్ను ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు మోదీ గారికి కృతజ్ఞతలు. ఆయన సవాలును స్వీకరిస్తున్నా. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్ కేవలం క్రీడాకారులకే కాదు అందరికీ ముఖ్యమే’ అని ఆమె పేర్కొంది. ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో టీం, వ్యక్తిగత విభాగాల్లో పతకాలు సాధించిన బాత్రా దేశం దృష్టిని ఆకర్షించింది.
Comments
Please login to add a commentAdd a comment