పేలిన దశాబ్దాల నాటి బాంబు
- ఆరుగురు మృతి
హనోయి: దశాబ్దాల క్రితం నాటి బాంబు పేలి ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వియత్నాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1970 లలో అమెరికా, వియత్నాం మధ్య యుద్ధం సందర్భంగా అమెరికా వైమానిక బలగాలు వేలకొద్దీ బాంబులను వియత్నాంపై విసిరాయి. వీటిలో కొన్ని పేలిపోగా మరికొన్ని ఇంకా బయటపడుతున్నాయి. ఇటువంటి ఓ బాంబు ఖాన్హ్హో ప్రావిన్స్‌లోని టా లువాంగ్ గ్రామానికి చెందిన ఓ రైతు భూమి దున్నుతుండగా దొరికింది. ఆ రైతు కుటుంబసభ్యులు దానిని ఇంటికి తీసుకెళ్లి ఇనుప వస్తువులను వేరు చేసేందుకు ప్రయత్నించగా బాంబు ఒక్కసారిగా పేలింది.
దీంతో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ ఇల్లు కుప్పకూలింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 1975 సంవత్సరంలో అమెరికా, వియత్నాం యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో 42 వేల మంది చనిపోగా 62 వేల మందికి పైగా గాయపడ్డారు. యుద్ధ సమయంలో అమెరికా విసిరిన బాంబులు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో, రైతులు పొలాలు దున్నే సమయంలో బయటపడుతూనే ఉన్నాయి.
కొన్ని సార్లు ఆ బాంబులు పేలి ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి. అయితే, కొన్ని సార్లు రైతులు ఈ బాంబుల నుంచి పేలుడు పదార్ధాలను సేకరించి మత్స్యకారులకు విక్రయిస్తుంటారు. ఇనుపసామగ్రిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక్కోసారి వారి ప్రాణాంతకంగా మారుతోంది.