సిగరెట్లతో కాల్చి, సూదులు గుచ్చి..
న్యూఢిల్లీ : దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలలో మూడొంతులమంది జీవన నేపథ్యం సామాజికంగా, ఆర్థికంగా, సమాజంలో వెనుకబడిన వర్గానికి చెందినదేనని సెంటర్ ఫర్ డెత్ పెనాల్టీ వెల్లడించింది. 80శాతానికి పైగా ఖైదీలు జైళ్లలో చిత్రహింసలకు గురవుతున్నారని రిపోర్టులో తెలిపింది. ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ చేపట్టిన ఈ అధ్యయనంలో జైళ్లలో ఖైదీల జీవన పరిస్థితులను వివరించింది. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురవుతూ దారుణమైన అమానుష పరిస్థితుల్లో ఖైదీలు జీవిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. 270 మంది ఖైదీల్లో 260 ఖైదీలు అమానుషమైన మానసిక, శారీరక చిత్రహింసలకు గురవుతున్నామని తెలిపినట్టు రిపోర్టు వెల్లడించింది. సిగరేట్లతో కాల్చడం, చేతివేళ్లలోకి సూదులు గుచ్చడం, బలవంతంగా యూరైన్ ను తాగించడం, తీగలు ద్వారా వేలాడుతీయడం, బలవంతపు నగ్నత్వం, తీవ్రంగా కొట్టడం వంటి దారుణమైన చిత్రహింసలకు ఖైదీలను గురిచేస్తున్నారని ఈ రిపోర్టు వెల్లడించింది.
మరణ శిక్ష పడ్డ ఖైదీల ఆర్థిక జీవన నేపథ్యం పరిశీలిస్తే, వారిలో 3/4 వంతు ఆర్థికంగా చాలా చితికిపోయిన వాళ్లని, కుటుంబాన్ని పోషించే సంపాదనలో వారే ప్రధాన పాత్ర పోషించేవారని తేలింది. సమాజంలో వెనుకబడిన వర్గాలకు, మత మైనార్టీలకు చెందినవారని పేర్కొంది. అదేవిధంగా మరణశిక్ష పడిన 12 మంది మహిళా ఖైదీలు కూడా ఈ వర్గానికి చెందినవారేనని రిపోర్టు నివేదించింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిరక్షరాస్యతకు సంబంధించినవై ఉంటే, వారి రక్షణ అత్యంత కీలకమని ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ నివేదించిన రిపోర్టుపై పానెల్ డిస్కషన్ సమయంలో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ మదన్ బి. లోకూర్ అన్నారు. ప్రజలు న్యాయ సహాయ న్యాయవాదులపై నమ్మకం కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా బాగాలేని 70.6శాతం మంది మరణ శిక్ష ఖైదీలూ ప్రైవేట్ లాయర్లనే ఆశ్రయిస్తున్నారని విచారణ వ్యక్తంచేశారు.
మరణశిక్ష ఖైదీల జీవనం గురించి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి ఈ రిపోర్టు కూలంకషంగా విశ్లేషించింది. ఈ రిపోర్టుపై ఎలాంటి వాదన చేయాల్సినవసరం లేకుండా ఖైదీల కులం, మతం, ఆర్థిక పరిస్థితి, అక్షరాస్యత వంటి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని తయారుచేశామని సెంటర్ ఫర్ డెత్ పెనాల్టీ డైరెక్టర్ అనూప్ సురేంద్రనాథ్ తెలిపారు. ఈ రిపోర్టులో నివేదించిన ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరణ శిక్ష పడిన ఖైదీలు 385 మంది ఉన్నారు. వారిలో ఉత్తరప్రదేశ్ లో అధికంగా 79 మంది మరణశిక్ష ఖైదీలున్నారు.