కేంద్రం చేతిలో తిరుపతిభవిత
- ఏపీ హై పవర్ కమిటీ సిఫార్సు
- స్మార్ట్ సిటీ జాబితాలో చోటుకోసం పోటీ
తిరుపతి తుడా: ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతి నగర అభివృద్ధి కేంద్రం చేతుల్లో ఉంది. దేశవ్యాప్తంగా 100నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ నుంచి మూడు నగరాలను స్మార్ట్ సిటీకి అర్హత కలిగినవిగా ఎంపిక చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి గత నెల మొదటి వారంలో ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు నగరాలను ఎంపిక చేసుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం హై పవర్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
కమిటీ ఈ నెల 28న సమావేశమై విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్‌కు ఎంపిక చేసింది. ఎంపికచేసిన జాబితాను కేంద్రానికి జూలై 31న అందజేశారు. స్మార్ట్ సిటీలకు అవసరమయ్యే అర్హతలను పరిశీలించి కేంద్రం ఆగస్టుకల్లా తుది జాబితాను విడుదల చేయనుంది. ఈ జాబితాలో తిరుపతికి స్థానం దొరికినట్టేగా దాదాపు కనిపిస్తోంది. అన్ని విధాలా సానుకూలంగా ఉన్నాయి. చివరి దిశలో ఉన్న ఈ వ్యవహారం తుది జాబితా విడుదల కేంద్ర చేతుల్లో ఉంది.
ఆధునిక హంగులు
స్మార్ట్ నగరంగా అభివృద్ధి చెందితే తిరుపతి నగరం పరిధి విస్తరించనుంది. మరో వెయ్యి ఎకరాలతో పాటు చుట్టపక్కల గ్రామాలు తిరుపతిలో కలిసిపోనున్నాయి. దీంతో తిరుపతి నగర పరిధి విస్తరించనుంది. అభివృద్ధి విషయానికి వస్తే అత్యాధునిక భవనాలు, కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ఆధునిక మల్టీప్లెక్స్ హాల్స్, పార్కులు, ఫుట్‌పాత్‌లు, బస్టాప్‌లు, మరుగుదొడ్లు, ఆస్పత్రులు ఇలా అన్ని హంగులతో అభివృద్ధి చేస్తారు. స్మార్ట్ సిటీలో 24 గంటలూ విద్యుత్, తాగునీరు, వైఫై సౌకర్యాలుంటాయి. విశాలవంతమైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు కూడళ్లను అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టు పట్టాలెక్కితే కేంద్రం తొలివిడతగా సెప్టెంబర్ కల్లా రూ.500 కోట్లను విడుదల చేస్తుంది.