ceo bhanwar lal
-
పకడ్బందీగా పోలింగ్ ఏర్పాట్లు
► శాసనమండలి ఎన్నికలపై సీఈఓ భన్వర్‌లాల్ కడప సెవెన్‌రోడ్స్ : శాసనమండలి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి నిలిపి వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి ప్రచారాలు జరగకుండా చూడాలన్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి డ్రైడే పాటిస్తూ అన్ని లిక్కర్‌షాపులు మూయించాలని చెప్పారు. ఈనెల 9న జరగనున్న పోలింగ్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా సెలవులు మంజూరు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పుల గురించి ప్రజలకు ముందే తెలియజేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రచురణకు సంంధించిన వివరాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై జిల్లాలోని ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులతో సమీక్షించాలని చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 78,168 పట్టభద్రుల ఓటర్లు ఉండగా, ఇప్పటికి 47 వేల స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. అలాగే 5970 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా, 3600 స్లిప్పులు పంపిణీ చేశామని చెప్పారు. పది పోలింగ్ కేంద్రాల మార్పు కోసం ఎన్నికల కమిషన్‌ను కోరగా, తొమ్మిదింటికి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ మేరకు పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. ఎన్నికల సిబ్బందికి సరఫరా చేసే మెటీరియల్ కిట్స్‌ను తయారు చేశామన్నారు. ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 1338 తుపాకులు డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. సమావేశంలో జేసీ శ్వేత తెవతీయ, జేసీ–2 నాగేశ్వరరావు, డీఆర్వో నరసింహారావు, ఆర్డీఓలు చిన్నరాముడు, వినాయకం, వీరబ్రహ్మయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఎవరికి ఓటేశారో చెబితే నేరం
తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరికి ఓటేశారో బయటకు చెబితే అది నేరం అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నామని, సెల్ఫోన్లను గానీ, కెమెరాలను గానీ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాడు ఈ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఈనెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఆదివారం పోలింగ్ జరగనుంది. -
ఓటుకు కోట్లుపై ఏసీబీ కేసు పెట్టొచ్చు: భన్వర్‌లాల్
ఓటుకు కోట్లు కేసులో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. రాజకీయ నాయకుల అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు అన్నింటినీ తమకు ఇవ్వాలంటూ తాము జూన్ 1వ తేదీనే కోర్టులో ఒక మెమో దాఖలు చేశామని, గురువారం దాఖలు చేసినది రిమైండర్ మెమో అని ఆయన తెలిపారు. కాగా, ఓటుకు కోట్లు అంశంపై భన్వర్‌లాల్ గతంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఒక నివేదికను పంపారు. ఆ తర్వాతే, కేసును వీలైనంత లాజికల్‌గా దర్యాప్తు చేయాలని సీఈసీ తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, ఓటుకు కోట్లు కేసును క్రిమినల్ కేసుగా కూడా పరిగణించి, ఏసీబీ దర్యాప్తు చేయొచ్చని భన్వర్‌లాల్ చెప్పారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ మొత్తం విచారణ ప్రక్రియను ఎన్నికల కమిషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ పెరిగిపోతోందని, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలకే డబ్బులు పంచుతుండటంతో ఇది భవిష్యత్తులో కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. -
భువనగిరి టాప్.. మల్కాజిగిరి లాస్ట్
తెలంగాణ ప్రాంతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోను, అత్యల్ప పోలింగ్ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలోను నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ తెలిపారు. మొత్తం 17 నియోజకవర్గాల పరిధిలో కలిపి సగటున 70.85 శాతం పోలింగ్ నమోదైందని, అత్యల్పంగా మల్కాజిగిరిలో 51.19 శాతం, అత్యధికంగా భువనగిరి 81 శాతం పోలింగ్ నమోదైందని ఆయన వివరించారు. 80 శాతం పోలింగ్‌తో ఖమ్మం రెండో స్థానంలో నిలిచిందన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ స్థానాల్లో 3 శాతం పోలింగ్ పెరిగిందని భన్వర్‌లాల్ చెప్పారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎన్నికల సోదాల్లో రూ. 140 కోట్లు పట్టుబడ్డాయని, 5 లక్షల లీటర్ల మద్యం, 74 కేజీల బంగారం, 933 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఇది చాలా ఆందోళనకరమని, భారత ఎన్నికల కమిషన్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు. ఇక రెండోదశ పోలింగ్‌లో అరకు, పాడేరు స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని, అలాగే కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెద్దకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్లలలో 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. మిగతా 165 స్థానాల్లో సాధారణంగానే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. తెలంగాణలో పోలింగ్ తగ్గినా, అది కేవలం నగర ప్రాంతంలోనేనని, అందువల్ల సీమాంధ్రలో మరింత ఎక్కువ పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నామని భన్వర్‌లాల్ చెప్పారు.