ఓటుకు కోట్లుపై ఏసీబీ కేసు పెట్టొచ్చు: భన్వర్లాల్
ఓటుకు కోట్లు కేసులో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. రాజకీయ నాయకుల అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు అన్నింటినీ తమకు ఇవ్వాలంటూ తాము జూన్ 1వ తేదీనే కోర్టులో ఒక మెమో దాఖలు చేశామని, గురువారం దాఖలు చేసినది రిమైండర్ మెమో అని ఆయన తెలిపారు. కాగా, ఓటుకు కోట్లు అంశంపై భన్వర్లాల్ గతంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్కు ఒక నివేదికను పంపారు. ఆ తర్వాతే, కేసును వీలైనంత లాజికల్గా దర్యాప్తు చేయాలని సీఈసీ తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే.
కాగా, ఓటుకు కోట్లు కేసును క్రిమినల్ కేసుగా కూడా పరిగణించి, ఏసీబీ దర్యాప్తు చేయొచ్చని భన్వర్లాల్ చెప్పారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ మొత్తం విచారణ ప్రక్రియను ఎన్నికల కమిషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ పెరిగిపోతోందని, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలకే డబ్బులు పంచుతుండటంతో ఇది భవిష్యత్తులో కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.