సాఫ్ట్వేర్ రంగంలో భారత్ కీలక పాత్ర
ఎరిక్సన్ ప్రెసిడెంట్, సీఈఓ హాన్స్ వెస్ట్బర్గ్
హైదరాబాద్: సాఫ్ట్వేర్ రంగంలో భారత్ ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిందని స్వీడన్ టెలికాం దిగ్గజం ఎరిక్సన్ సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ హాన్స్ వెస్ట్బర్గ్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ట్రాన్స్ఫర్మేషన్, బిజినెస్ స్ట్రాటజీ అనే అంశంపై ఐఎస్బీ హైదరాబాద్, మొహాలి క్యాంపస్ విద్యార్థులతో ఆయన గురువారం రాత్రి మాట్లాడారు. టెక్నాలజీ రంగంలో గతంలో హార్డ్వేర్, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఎంతో ప్రగతిని సాధించాయని, ఇందులో భారత్ కృషి ఎంతో ఉందన్నారు. ప్రపంచ సాఫ్ట్వేర్ రంగంలో భారతీయులే ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ఎరిక్సన్ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం, పరికరాల ఉత్పత్తి కేంద్రాలను భారత్లో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్లోని ఎరిక్సన్ సంస్థలో 21 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు.
సాఫ్ట్వేర్ టెక్నాలజీలో భారతీయ యువత ప్రతిభను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను 40 వేలకు పెంచాలని నిర్ణయించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 108 దేశాలలో ఎరిక్సన్ సంస్థ సేవలను అందిస్తోందని, 2జీ, 3జీ, 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఎరిక్సన్, త్వరలో ఆవిష్కరించే 5జీ సేవలను కూడా త్వరితగతిన అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎరిక్సన్ సంస్థలో ఇప్పటివరకు 22 శాతం మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని వారి పనితీరును అం చనా వేసి 2020లోగా 30 శాతం మహిళలే పనిచేసే విధంగా ఉద్యోగుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించమన్నారు.
నాయకత్వ లక్షనాలు సులువుగా రావని, సమయపాలన, ఏకాగ్రత, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యతను ఇచ్చే స్వభావం ఉన్నప్పుడే నాయకునిగా ఎదుగుతారని, ఇవన్నీ ఐఎస్బీ విద్యార్థులందరూ అలవరచుకోవాలన్నారు. అనంతంరం ఎస్ఎంఎస్ల ద్వారా మొహాలి క్యాంపస్ విద్యార్థులు, నేరుగా హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.