ఒడిదుడుకుల వారం..!
మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వారంలో వచ్చే టాటా మోటార్స్, ఐటీసీ, సన్ ఫార్మా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్‌కు కీలకాంశాలని వారంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం.. తదితర అంశాలు కూడా మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
అమెరికా పరిణామాల ప్రభావం..
మన స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ వారంలో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. ఈ గురువారం (ఈ నెల 25న) ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు ఎక్స్పైరీ అవుతాయని, మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. రాజకీయ అనిశ్చితి పెరగడంతో అమెరికా మార్కెట్, ఇతర ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయని వివరించారు. కంపెనీల ఫలితాల సీజన్ కొనసాగుతోందని, అందరి కళ్లు ఈ వారంలో ఫలితాలను వెల్లడించే కంపెనీలపై ఉంటుందని తెలిపారు.
కరెక్షన్ తర్వాత దూకుడు...
సమీప భవిష్యత్తులో మార్కెట్లో కరెక్షన్ వుండవచ్చని, అటుతర్వాత దూకుడు కొనసాగవచ్చని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ చెప్పారు. గత కొన్ని సెషన్లుగా అమెరికాలోనూ, మన స్టాక్ మార్కెట్లోనూ ర్యాలీ కొనసాగుతోందని, ఈ వారంలో కన్సాలిడేషన్‌కు ఆస్కారముందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన వి.కె. శర్మ పేర్కొన్నారు.
లాభాల స్వీకరణకు ఆస్కారం..
ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు ఈ వారంలో ముగియనున్నందున, లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశాలున్నాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ ఎనలిస్ట్ ఫోరమ్ పరేఖ్ చెప్పారు. భారీ పన్ను సంస్కరణల్లో ఒకటైన జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైందని, జీఎస్టీ రేట్లు ఖరారైన నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడుతుందని యెస్ సెక్యూరిటీస్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిటాషా శంకర్ పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల విషయంలో ఎఫ్ఎంసీజీ, యుటిలిటీస్, బొగ్గును ఉపయోగించే లోహ కంపెనీలు, డెయిరీ కంపెనీలు లాభపడతాయని వివరించారు.
కీలక కంపెనీల ఫలితాలు
నేడు(ఈ నెల 22న) గెయిల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీలు తమ గత ఆర్థిక సంవత్సరం, క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం(ఈ నెల 23న) టాటా మోటార్స్, ఓల్టాస్, సెంట్రల్ బ్యాంక్, జిందాల్ స్టీల్ కంపెనీలు, బుధవారం(ఈ నెల 24న) అదానీ ఎంటర్ప్రైజెస్, లుపిన్, గురువారం(ఈ నెల 25న) బాష్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అశోక్ లేలాండ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, శుక్రవారం (ఈ నెల26న) ఐటీసీ, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, మహానగర్ గ్యాస్, ఎన్బీసీసీ, దివీస్ ల్యాబ్స్ తమ తమ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి.
వెలుగులో జీఎస్టీ షేర్లు
జీఎస్టీ మండలి వివిధ సేవలపై పన్ను రేట్లను ఖరారు చేసిన నేపథ్యంలో హాస్పిటాలిటీ చెయిన్స్, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ వంటి వినోద సంబంధ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. జీఎస్టీ రేట్లు విమానయాన సంస్థలపై సానుకూల ప్రభావం చూపుతాయని జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు వెలుగులో ఉంటాయని నిపుణులంటున్నారు. టెలికం సేవలుపై పన్ను రేట్లను 18 శాతంగా(గతంలో 15 శాతంగా) నిర్ణయించిన నేపథ్యంలో టెలికం షేర్లపై ఒత్తిడి ఉంటుందని అంచనా. కాగా ఈ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 277 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
విదేశీ పెట్టుబడుల జోరు
విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటిదాకా 266 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో అధిక భాగం డెట్ మార్కెట్లోకి రావడం విశేషం. రూపాయి నిలకడగా ఉండటమే దీనికి కారణమని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన స్టాక్ మార్కెట్లో రూ.4.157 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.12,941 కోట్ల చొప్పున వెరసి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.17,099 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ కాలానికి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.94,900 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. దీంతో మొత్తం మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ఈ ఏడాదిలో రూ. 1 లక్ష కోట్లకు మించాయి.