9న జిల్లా యువజనోత్సవం
కడప కల్చరల్ : రాష్ట్ర యువజన సర్వీసులశాఖ, స్టెప్ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జిల్లా యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు స్టెప్ సీఈఓ మమత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా పలు అంశాలలో యువతకు పోటీలు నిర్వహిస్తామని, మొదటి బహుమతి సాధించిన వారిని 2017 జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యువజనోత్సవ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈనెల 9న కడప నగరంలోని నేక్నామ్ఖాన్ కళాక్షేత్రంలో యువజనులకు పోటీలను నిర్వహిస్తామన్నారు. ఫోక్ డ్యాన్స్ (గ్రూప్), ఫోక్సాంగ్స్ (గ్రూప్), ఏకపాత్రాభినయం (ఇంగ్లీషు, హిందీ), హిందూస్తానీ గాత్రం సోలో, కర్ణాటక గాత్రం (సోలో), సితార్, ఫ్లూట్, వీణా, తబల, మృదంగం విన్యాసాలు, వక్తృత్వ పోటీ (ఇంగ్లీషు, హిందీ), కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, మణిపురి, హార్మోనియం, గిటార్ వాయిద్యాల పోటీలు ఉంటాయని తెలిపారు. ఆసక్తిగల యువత ఉదయం 9.30 గంటలకు నేక్నామ్ఖాన్ కళాక్షేత్రం వద్దకు చేరుకోవాలని సూచించారు.