ఎట్టకేలకు ఫోక్స్ వాగెన్ సీఈఓ రాజీనామా
ఫ్రాంక్ ఫర్ట్ (జర్మనీ) : ఫోక్స్ వాగెన్ సీఈఓ మార్టిన్ వింటర్ కార్న్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వాగెన్ సంస్థ డీజిల్ కార్ల ఇంజిన్ల విషయంలో భారీ కుంభకోణానికి తెరతీసిన విషయం విదితమే. కంపెనీపై తాజాగా వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఐదు మంది డైరెక్టర్ల బృందం ఒత్తిడి తీసుకురాగా సీఈఓ మార్టిన్ తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 78 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభకోణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై షాక్కు గురయ్యానని రాజీనామా చేసిన అనంతరం ఆయన చెప్పారు. ఫోక్స్ వాగెన్ ప్రస్తుతం కొత్తగా కెరీర్ ను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీ పేర్కొన్న విధంగానే కాలుష్యం వెలువడుతుందా.. అంతకు మించి అధిక మోతాదులో వెలువడుతున్నాయో ఒకసారి పరిశీలించిన తర్వాత ఆ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న యోచనలో అమెరికన్ అధికారులున్నారు. కాలుష్యాన్ని కప్పిపుచ్చే ఇంజన్లను కార్లలో అమర్చి విమర్శలపాలై చివరికి భారీ కుంభకోణానికి దారితీసింది. భారత కరెన్సీలో అక్షరాలా 48.10 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి ఆ సంస్థ తెరతీసిందన్న విషయం వెల్లడైంది.
దేశ కార్ల దిగ్గజ కంపెనీలో తలెత్తుతున్న పరిణామాల నేపథ్యంలో జర్మనీ చాన్సలర్ ఎంజెలా మోర్కెల్ మాట్లాడుతూ.. ఆత్మస్థైర్యాన్ని సాధ్యమైనంత తొందరగా కంపెనీ కోలుకోవాలని వ్యాఖ్యానించారు. టైప్ ఈఏ 189 రకం ఇంజన్లను 1.1 కోట్ల కార్లుకు వినియోగించిన విషయం విదితమే. కేవలం అమెరికాలోనే 5లక్షల కార్లను ఆ కంపెనీ అమ్మిందని, కాలుష్య పరీక్షలు నిర్వహించగా ఒక్కొక్కటిగా కంపెనీ మోసాలు బయటపడినట్లు తెలుస్తోంది.